హింసకు ప్రేరేపిస్తున్నారు చర్యలు తీసుకోండి... లోకేష్ పై రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు!
ఇందులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు ఆయా పోలీస్ స్టేషన్లకు వెళ్లి పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు.
By: Tupaki Desk | 25 Aug 2023 3:14 PM GMTగతకొంతకాలంగా ఏపీ ప్రభుత్వంపైనా, అధికార పార్టీ నేతలపైనా, ఎమ్మెల్యేలపైనా, మంత్రులపైనా, ముఖ్యమంత్రిపై కూడా విపక్షాల విమర్శలు శృతిమించుతున్నాయనే విమర్శలు వస్తూనే ఉన్నాయి. వీరిలో మరి ముఖ్యంగా లోకేష్ చేస్తున్న విమర్శలు శృతిమించడమే కాకుండా... జుగుప్సాకరంగా కూడా ఉన్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి!
అవును... కొద్దిరోజులుగా లోకేష్ చేస్తున్న ప్రసంగాలు, ప్రకటనలు, హెచ్చరికలు శృతిమించుతున్నాయనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో అధికారపార్టీ నేతలు ఇప్పటివరకూ పాటించిన సంయమనం కూడా దాటిపోయేలా ఉందని తెలుస్తోంది. లోకేష్ విమర్శలపై అధికార పార్టీ నేతలు వాయించి వదులుతున్నారు.
దీంతో లోకేష్ శృతిమించి, విజ్ఞతమరిచి అన్నట్లుగా చేస్తోన్న విమర్శలు రాజకీయంగా బౌన్స్ బ్యాక్ అవ్వడమే కాకుండా... చట్టపరమైన చర్యలకు కూడా దారితీయబోతున్నాయని తెలుస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఆయనపై పలు ఫిర్యాదులు అందాయని తెలుస్తోంది.
యువగళం పాదయాత్రలో భాగంగా నిర్వహించే సభల్లో మైకందుకునే లోకేష్... "ఎవరి మీద ఎక్కువ కేసులు ఉంటే వాళ్లకు అంత పెద్ద నామినేటెడ్ పదవి ఇస్తాం" అంటూ తెలుగుదేశం కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ విషయంపై సర్వత్రా విమర్శలు రాగా... మరోపక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా భగ్గుమంది.
ఒక రాజకీయ నాయకుడై ఉండి, కార్యకర్తలను హింసవైపు నడిపిస్తారా? రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ఎవరు బాధ్యులు? ఇదేనా నాయకుడి తీరు? తమరు మాత్రం సెక్యూరిటీతో తిరుగుతూ, స్టేలు తెచ్చుకుంటూ.. సామాన్యులను మాత్రం ఎక్కువ కేసులు పెట్టించుకోవమని ఉసిగొల్పడం ఎంతవరకూ సమంజసం? అని నిలదీస్తున్నారు.
దీంతో... ఆయన తీరుతో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయి ప్రభుత్వం మీద, అధికారుల మీద, వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తల మీద దాడులకు దిగితే.. ఎవరు నిలువరిస్తారని, ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ఇలా హింసను ప్రేరేపించే లోకేష్ , టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు, ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు.
ఇందులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు ఆయా పోలీస్ స్టేషన్లకు వెళ్లి పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. చంద్రబాబు ఆనాడు రెచ్చగొట్టినందుకే తంబళ్లపల్లె, పుంగనూరు, మాచర్ల వంటి ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగాయని.. ఈ ఘటనల్లో పలువురు పోలీసులు గాయపడ్డారని.. దీనికి టిడిపి నాయకత్వమే కారణమని వైఎస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
ఈ సమయంలో... సమాజంలో శాంతియుత జీవనానికి విఘాతం కలిగించేలా లోకేష్ ప్రకటనలు ఉంటున్నాయని, ఈ నేపథ్యంలో అయన మీద కేసునమోదు చేసి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పోలీస్ స్టేషన్లకు వెళుతున్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు వరుసపెట్టి ఫిర్యాదులు చేస్తున్నారు.