Begin typing your search above and press return to search.

నటి ఖుష్బూపై ఫిర్యాదు... బహిరంగ క్షమాపణల డిమాండ్!

ఈ సమయంలో నటి ఖుష్బూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి! దీంతో వ్యవహారం సీరియస్ అయ్యిందని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   25 Nov 2023 4:14 AM GMT
నటి ఖుష్బూపై ఫిర్యాదు... బహిరంగ  క్షమాపణల డిమాండ్!
X

ఇటీవల కాలంలో కొంతమంది సెలబ్రెటీలకు నోటి తీట ఎక్కువైపోతుందనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే త్రిష వర్సెస్ మన్సూర్ అలీఖాన్ వ్యవహారం ముదిరి పాకాన పడిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై చాలా మంది ఇండస్ట్రీ జనాలు స్పందించారు.. త్రిషకు మద్దతుగా నిలిచారు. ఈ సమయంలో నటి ఖుష్బూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి! దీంతో వ్యవహారం సీరియస్ అయ్యిందని తెలుస్తుంది.

అవును... కొన్ని రోజుల క్రితం సినీ నటి త్రిషపై, నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమైన సంగతి తెలిసిందే. ఈ సమయంలో త్రిషపై అలీఖాన్ చేసిన వ్యాఖ్యలను ఖుష్బూ ఖండించారు. ఈ సందర్భంగా ఈ వ్యవహారంపై తన ఎక్స్‌ లో ఓ ఫాలోవర్‌ అడిగిన ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. "మీలా లోకల్‌ భాషలో మాట్లాడలేను" అని తెలిపారు. దీంతో పలు దళిత వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

ఈ నేపథ్యంలో దళితులు మాట్లాడే భాషను తక్కువగా చేసి కించపరిచారని, ఖుష్బూపై అట్రాసిటీ చట్టం కింద చర్యలు చేపట్టాలని పోలీసు కమిషనరు కార్యాలయంలో వీసీకే నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో వ్యవహారం సీరియస్ అయ్యింది. ఈ విషయంపై స్పందించిన తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రంజన్‌ కుమార్‌... ఖుష్బూ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఎస్సీలను కించపరిచేలా సోషల్ మీడియాలో జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు ఖుష్బూ ట్వీట్‌ చేశారని, అందుకు ఆమె బహిరంగ క్షమాపణ చెప్పాలని, అలాకానిపక్షంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తామని రంజన్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా... త్రిష వ్యవహారంలో ఉత్సాహం చూపుతున్న ఖుష్బూ.. మణిపుర్‌ మహిళలపై అరాచకాల సమయంలో ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు. క్షమాపణలు చెప్పకుంటే ఇంటిని ముట్టడిస్తామన్నారు.

ఈ వ్యాఖ్యలతో ఆమె ఇంటిని ముట్టడించి ఆందోళన చేపట్టనున్నట్లు సమాచారం వెలువడటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇందులో భాగంగా... చెన్నై శాంథోంలోని ఆమె ఇంటి వద్ద ఇన్‌స్పెక్టర్ నేతృత్వంలో ఇద్దరు ఎస్సైలు, 33 మంది మహిళా పోలీసులు మొహరించారు! అయితే ఖుష్బూ ఇంటి ముట్టడి కార్యక్రమం వాయిదా పడటంతో ఆమె ఇంటికి కల్పించిన భద్రతను వెనక్కి తీసుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.