Begin typing your search above and press return to search.

కూటమికి ఎర్రన్నల రెడ్ సిగ్నల్

ఏపీలో వైసీపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ఎందుకంటే ఆ పార్టీ నిన్నటిదాకా అధికారంలో ఉంది.

By:  Tupaki Desk   |   14 Oct 2024 3:46 AM GMT
కూటమికి ఎర్రన్నల రెడ్ సిగ్నల్
X

ఏపీలో వైసీపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ఎందుకంటే ఆ పార్టీ నిన్నటిదాకా అధికారంలో ఉంది. ఏపీ వ్యాప్తంగా ఆ పార్టీకి క్యాడర్ ఉంది. అంగబలం అర్ధ బలం ఉంది. కానీ తొలి పోరాటం వైసీపీ నుంచి టీడీపీ కూటమికి ఎదురు కావడం లేదు. ఎర్రన్నల నుంచే రెడ్ సిగ్నల్ పడుతోంది. సీపీఐ సీపీఎం అయితే సమయం వస్తే చాలు కూటమి ప్రభుత్వం మీద హాట్ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. నాలుగు నెలలలో టీడీపీ కూటమి పట్ల ప్రజలలో వ్యతిరేకత వచ్చిందని కూడా కామ్రేడ్స్ అంచనా కడుతున్నారు

ఇక ఇప్పటిదాకా పార్టీ సమావేశాల్లో లేక మీడియా మీటింగులలోనూ కూటమి ప్రభుత్వం మీద విరుచుకుపడిన కామ్రేడ్స్ ఇపుడు కదన రంగంలోకి దిగుతున్నారు ముందుగా సీపీఎం జనంలోకి వస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం పనితీరు బాగా లేదని అంటూ ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గం తీర్మానం చేసింది. ఈ నెల 10,11 తేదీలలో జరిగిన ఈ సమావేశాలలోనే సమర శంఖం కూటమి ప్రభుత్వానికి వ్యతిరకంగా పూరించారు. ఏపీలో అత్యాచారాలు అధిక ధరలు నిరుద్యోగం పెరిగిపోయాయని అంతే కాదు దళితుల పైన వరసబెట్టి అత్యాచారాలు జరుగుతున్నాయని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని అడ్డుకోవడం లేదని కూడా విమర్శించారు

దీంతో నవంబర్ 1 నుంచి 7 వరకూ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద ఇంటింటికీ వెళ్ళి ప్రచారం చేస్తామని 8న తేదీన అన్ని కలెక్టరేట్ల ముందు ఆందోళనలు నిర్వహిస్తామని సీపీఎం నేతలు చెబుతున్నారు

ఏపీలో కూటమి ప్రభుత్వం హామీలను నెరవేర్చలేదని కూడా సీపీఎం నేతలు విమర్శిస్తున్నారు. ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగినా పట్టించుకోవడం లేదని కూడా ఫైర్ అయ్యారు. ఏపీలో డీఎస్సీ మీద తొలి సంతకం అని చెప్పినా అది వాయిదా వేశారని ఏపీపీఎస్సీ చైర్మన్ నియామకమే లేదని ఇక గ్రూప్ సర్వీస్ కమిషన్ పరీక్షలు పెట్టేది ఎపుడు అని కూడా నిలదీస్తున్నారు.

ట్రూ అప్ చార్జీలు గత వైసీపీ ప్రభుత్వం వేస్తే దానిని ఎదిరించిన టీడీపీ కూటమి ప్రభుత్వం తాను కూడా అదే బాటన పడుతోందని విద్యుత్ చార్జీలను పెంచడం ద్వారా జనం నడ్డి విరించేందుకు ప్రయత్నం చేస్తోంది అని ఆరోపిస్తున్నారు. విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా ఈ నెల 18న అన్ని విద్యుత్ ఆఫీసుల ముందు సీపీఎం ఆందోళనలు నిర్వహిస్తుందని కూడా తెలిపారు.

పెద్ద ఎత్తున వరదలు ఏపీని ప్రత్యేకించి విజయవాడను ముంచేసినా సాయం మాత్రం అరకొరగానే అందిందని కేంద్రం కూడా పెద్దగా ఇచ్చింది లేదని సీపీఎం అంటోంది. ఏపీ ప్రభుత్వం ఏ విధంగా చూసినా ప్రజా సమస్యలను పరిష్కరించడంతో విఫలం అయిందని అందుకే ఆందోళనలు తప్పవని హెచ్చరిస్తోంది. మొత్తానికి కూటమి ప్రభుత్వం మీద తొలి గర్జన వైసీపీ నుంచి కాకుండా సీపీఎం నుంచి రావడం విశేషం. ఈ సమస్యలను వైసీపీ కూడా ప్రస్తావించాల్సి ఉన్నా ఎందుకో వెనకబడిందా అన్న చర్చ కూడా వస్తోంది.

ఇక కామ్రేడ్స్ ని మిత్రులుగా చూడాలా లేక ప్రత్యర్ధులుగా చూడాలా అన్నది కూటమి పెద్దలు డిసైడ్ చేసుకోలేదని అంటున్నారు. ఆ క్లారిటీ మిస్ అవుతోంది. అదే సమయంలో ఎర్రన్నలకు మాత్రం ఫుల్ క్లారిటీ ఉంది. కూటమిని ఎదిరించాలని ప్రజా సమస్యలు ప్రస్తావించాలని ముందుకు కదులుతున్నారు. మరి ఎర్రన్నలను ఎలా కూటమి ప్రభుత్వం ఎదుర్కుంటుందో చూడాల్సి ఉంది.