Begin typing your search above and press return to search.

బాబు మీద కామ్రేడ్స్ కస్సుబుస్సులు...!

అయిదేళ్ల పాటు విపక్షంలో ఉన్నపుడు చంద్రబాబుకు కామ్రేడ్స్ అండగా నిలిచారు.

By:  Tupaki Desk   |   13 Feb 2024 3:51 AM GMT
బాబు మీద కామ్రేడ్స్ కస్సుబుస్సులు...!
X

అయిదేళ్ల పాటు విపక్షంలో ఉన్నపుడు చంద్రబాబుకు కామ్రేడ్స్ అండగా నిలిచారు. అందులో సీపీఐ అయితే సొంత పార్టీ కంటే మిన్నగా టీడీపీని వెనకేసుకుని వచ్చింది. అమరావతి రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం అని బాబు సీఎం గా ఉండగా మాట్లాడిన కామ్రేడ్స్ ఆయన విపక్షంలోకి రాగానే ఆయనతో గొంతు కలిపి అమరావతే రాజధానిగా ఉండాలని అన్నారు. రెండు వేల ఎకరాలు రాజధానికి చాలు అన్న సీపీఐ నారాయణ అమరావతి ఉద్యమంలో బాబుతో భుజం కలిపారు.

ఇక ఏపీ సీపీఐ కార్యదర్శి రామక్రిష్ణ అయితే చంద్రబాబుతో పాటే నడిచారు. ఇన్ని చేసినా కూడా ఇపుడు చంద్రబాబు వెళ్లి బీజేపీతో కలుస్తున్నారు. పొత్తులు కూదా దాదాపుగా కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో కామ్రేడ్స్ కి వాస్తవాలు బోధపడ్డాయి.

దాంతో కామ్రేడ్స్ బాబు మీద కస్సుబుస్సు మంటున్నారు. బీజేపీతో ఎందుకు పొత్తులు అని సీపీఐ సీపీఎం నేతలు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ ఏపీకి ఏమీ ఇవ్వకుండా మోసం చేసింది అని 2019 ఎన్నికల వేళ తీవ్రంగా విమర్శించిన చంద్రబాబు ఇపుడు ఏమి న్యాయం చేసిందని పొత్తులకు సిద్ధపడుతున్నారు అని వారు ప్రశ్నిస్తున్నారు.

బీజేపీతో పొత్తుల వల్ల ఏపీకి ఉపయోగం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీని సర్వనాశనం చేసిన బీజేపీతో కూటమి కడితే అంతకంటే అన్యాయం ఉండదని అంటున్నారు. ఏపీలో జగన్ తో పాటు చంద్రబాబు పవన్ లను కూడా ఓడించాలని పిలుపు ఇస్తున్నట్లుగా కామ్రేడ్స్ ప్రకటించి కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ఇప్పటిదాకా ఒక్క జగన్ మీదనే విమర్శలు చేస్తూ వచ్చిన కామ్రేడ్స్ కి బాబు పవన్ కూడా ప్రత్యర్ధులు అయిపోయారు.

అదే నోటితో బీజేపీని కూడా వారు విమర్శిస్తున్నారు. ఏపీలోని అన్ని పార్టీలను తమ గుప్పిట పెట్టుకుని బ్లాక్ మెయిల్ రాజకీయాలకు కేంద్ర బీజేపీ పాల్పడుతోందని అంటున్నారు. బీజేపీ ట్రాప్ లో అన్ని పార్టీలు చిక్కుకుంటున్నాయని కూడా మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే టీడీపీ తమతో కలసి వస్తుందని ఈసారి అయినా అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉండేలా చూసుకోవాలని భావించిన వామపక్షాలు ఇపుడు ఏమి చేస్తాయి అన్నది ఆసక్తికరంగా మారింది.

ఏపీలో ఎన్నికల వ్యూహాల మీద భవిష్యత్తు కార్యాచరణ మీద ఈ నెల 20న వామపక్షాల సమావేశం జరగనుందని అంటున్నారు. ఆ సమావేశంలో ఏపీలో ఎత్తులు పొత్తులు ఏమిటి అన్నది నిర్ణయిస్తారు అని అంటున్నారు. కాంగ్రెస్ తో కలసి కామ్రేడ్స్ కూటమి కడతారా అన్నది చూడాల్సి ఉంది. ఎటూ ఇండియా కూటమిలో కాంగ్రెస్ కమ్యూనిస్టులూ ఉన్నారు. తెలంగాణాలో కూడా మిత్రులు అయ్యారు. సో అది ఏపీలో రిపీట్ అవుతుంది అని అంటున్నారు.