తప్పు దిద్దుకోండి కామ్రెడ్.. ఎన్నాళ్లీ పరనిందలు!
అయితే.. ఇంత ఆవేదనలోనూ(మూడో స్థానానికి పరిమితమై డిపాజిట్ కోల్పోయినప్పటికీ) కామ్రెడ్ తమ్మినేని సంచలన విషయం చెప్పుకొచ్చారు.
By: Tupaki Desk | 7 Dec 2023 3:30 PM GMTఎన్నికలు అంటేనే డబ్బు మయం. దీనిలో ఓడేవారైనా.. గెలిచేవారైనా.. అన్నింటికీ సిద్ధపడే ముందుకు రావాలి. ముందుగానే అంచనా వేసుకోవాలి. సిద్ధాంతాలు రాద్ధాంతాలతో ఓట్లను తమకు అనుకూలంగా మార్చుకోలేమని.. కామ్రెడ్లూ గుర్తించారు. అందుకే.. చాలా తెలివిగా వ్యవహరించే పనిని చేపట్టారు. అయితే.. క్షేత్రస్థాయిలో పరిస్థితి తెలిసి కూడా.. ఇటీవల ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేసి ఓడిన పెద్ద కామ్రెడ్.. పరనిందలకే ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఈ ఎన్నికల్లో డబ్బు ప్రభావం బాగా పడిందని, అందువల్లే ఫలితాలు తారుమారయ్యాయని, అన్ని పార్టీలు ప్రత్యర్థి పార్టీలను ఓడించేందులకు ప్రజాస్వామ్య విలువలను పక్కన బెట్టి ప్రలోభాలకు తెర తీశాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పుకొచ్చారు. వాస్తవానికి.. అవకాశం లేకకానీ.. ఏమాత్రం అవకాశం ఉన్నా.. కేరళలో మాత్రం కొనలేదా? అన్న సంగతిని మరిచిపోయినట్టుగా ఉన్నారు ఈ కామ్రెడ్!!
అయితే.. ఇంత ఆవేదనలోనూ(మూడో స్థానానికి పరిమితమై డిపాజిట్ కోల్పోయినప్పటికీ) కామ్రెడ్ తమ్మినేని సంచలన విషయం చెప్పుకొచ్చారు. సీపీఎం సీట్లను, ఓట్ల శాతాన్ని పెంచుకోవటం బాగుందన్నారు. తాము పోటీ చేసిన 19స్థానాల్లో ఏ ఒక్కటీ గెలుస్తామని అంచనా వేసుకోలేదని, అయితే.. ఓటు బ్యాంకు బాగుందని అన్నారు. గెలుపోటములను కమ్యూనిస్టులు సర్వసాధారణంగా భావిస్తారని, రానున్న రోజుల్లో పార్టీని పటిష్ఠం చేస్తామన్నారు.
అయితే, కామ్రెడ్ చెప్పిన కామెంట్లపై సొంత పార్టీలోనే విస్మయం వ్యక్తమవుతోంది. సాధించిన దానికి సంతృప్తి చెందడం.. పరనిందలు వేయడం.. కామన్ అయిపోయిందని అంటున్నారు. తప్పులు జరుగుతున్నాయి. మిత్రపక్షం సీపీఐకి ఉన్న ఓర్పు, నేర్పు సీపీఎంకు లేకుండా పోయిందనే వాదన వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో ఆచి తూచివ్యవహరించి.. తప్పులు సరిచేసుకోవాల్సిన కామ్రెడ్స్ నేతలు.. ఇలా డబ్బు, ఈవీఎంలు అంటూ పరనిందలు వేయడం సమంజసమేనా? అనేది ప్రశ్న.