'కామ్రెడ్'.. ఇంత ఒంటరైపోయారేంటి?
ఇదేమీ.. అంత తేలికగా తీసేసే నియోజకవర్గమో.. లేదా.. గ్యారెంటీగా గెలిచేసే నియోజకవర్గమో కాదు.
By: Tupaki Desk | 27 Nov 2023 4:30 PM GMTతమ్మినేని వీరిభద్రం. కామ్రెడ్లకు కంచుకోటగా.. వారి భాషలో చెప్పాలంటే.. ఉద్యమాలకు ఊపిరి పోసిన నేలగా పేర్కొనే ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇదేమీ.. అంత తేలికగా తీసేసే నియోజకవర్గమో.. లేదా.. గ్యారెంటీగా గెలిచేసే నియోజకవర్గమో కాదు. ఇవన్నీ.. ఒకప్పుడు. జెండా చూసి.. మొహం చూసి ఓటేసే రోజులు ఒకప్పుడు. దీంతో అప్పట్లో ఈ నియోజకవర్గం నుంచి సీపీఎం వరుస విజయాలు దక్కించుకుంది.
కానీ, మారిన కాలానికి అనుగుణంగా మార్పు చెందక.. మధ్యతరగతి ప్రజలకు చేరువ కాని నేపథ్యంలో కమ్యూనిస్టులు దేశవ్యాప్తంగా ఎదుర్కొంటున్న సవాలక్ష సమస్యలు.. పాలేరు లోనూ ఎదురవుతున్నాయి. ఇక్కడ తమ్మినేని వీరభద్రానికి కూడా ఎలాంటి మినహాయింపూ లేదు. వాస్తవానికి ఒకప్పుడు.. పుచ్చలపల్లి సుందరయ్య వంటి నాయకులు అసెంబ్లీకి పోటీ చేస్తామంటే.. మేం తప్పుకుంటాం.. అనే పార్టీలు ఉన్నాయి. దీనికి కారణం.. ఆయనపై ఉన్న అభిమానం ఒక్కటే కాదు. పోటీ చేసిన డిపాజిట్ దక్కదనే భయం కూడా!
కానీ, ఈ పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు. ఇక, తాజా పరిస్థితిని గమనిస్తే.. కామ్రెడ్ ఒంటరయ్యారు. పాలేరు నియోజకవర్గంలో సీపీఎం తరఫున పోటీ చేస్తున్న తమ్మినేనికి పెద్దగా చెప్పుకోదగిన బలం కనిపించడం లేదు. మరో ఎర్ర జెండా సీపీఐ.. ఇదే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నేతకు మద్దతు ప్రకటించిన దరిమిలా.. ఎర్ర జెండాల ఉత్సాహం కూడా తగ్గిపోయింది. అదేసమయంలో ఈ నియోజకవర్గంలో ఇద్దరుబడా పారిశ్రామిక వేత్తలు ఢీ అంటే ఢీ అన్నట్టుగా పోటీ పడుతున్నారు.
తమ్మినేని మాత్రం సిద్ధాంతాలను వివరిస్తున్నారు. ఇక, కాంగ్రెస్ కలిసి వస్తుందని అనుకున్నా.. ఆ పార్టీ దూరమైంది. చిన్న చితకా పార్టీలైనా కలిసి వస్తాయని అనుకుంటే.. అవి బీఆర్ ఎస్‌కు దన్నుగా ఉన్నాయి. వెరసి.. కామ్రెడ్ పరిస్థితి కుతకుతలాడుతోంది. ముఖ్యంగా ఖమ్మం ఒకప్పుడు కామ్రెడ్స్‌కు కంచుకోటే అయినా.. ఐక్యత విచ్ఛిన్నం దరిమిలా.. ఈ బలం పటాపంచలైంది. దీంతో కామ్రెడ్ గెలుపు అంత ఈజీ అయితే.. కాదు. గెలిచారా? రాష్ట్రాన్నే గెలిచిన లెక్క!! అంటున్నారు పరిశీలకులు.