మజ్లిస్ కు ప్రొటెం స్పీకర్ వెనుక కాంగ్రెస్ భారీ వ్యూహం!?
వివిధ శాఖల మంత్రులతో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. వారికి కేటాయించిన శాఖలతో మంత్రులు మరింత ఉత్సాహంగా ఉన్నారు.
By: Tupaki Desk | 9 Dec 2023 10:03 AM GMTవివిధ శాఖల మంత్రులతో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. వారికి కేటాయించిన శాఖలతో మంత్రులు మరింత ఉత్సాహంగా ఉన్నారు. స్పీకర్ గా దళితుడైన గడ్డం ప్రసాద్ కుమార్ ను లాంచనంగానే ఎన్నుకున్నా.. రేపు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. ప్రొటెం స్పీకర్ గా మజ్లిస్ పార్టీకి చెందిన అక్బరొద్దీన్ ఒవైసీ ఈ రోజు (డిసెంబర్ 09) ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనే మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే, ఈ కార్యక్రమాన్ని బీజేపీ బహిష్కరించింది. ప్రొటెం స్పీకర్ మజ్లిక్ కు ఇవ్వడంపై బీజేపీ తీవ్రంగా ఆక్షేపించింది.
ప్రొటెం స్పీకర్ ఎన్నిక వెనుక కాంగ్రెస్ వ్యూహం..
ఆల్ ఇండియా మజ్లిస్-ఈ-ఇతిహదుల్ ముస్లిమీన్ పేరుతో హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఈ పార్టీకి 90 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. ఎంఐఎం హైదరాబాద్ లో ఓల్డ్ సిటీతో పాటు రాష్ట్రం, దేశంలోనే ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండే శాసనసభ స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2008లో కాంగ్రెస్ నేతృత్వంలోనే యూపీఏ (యునైటెడ్ ప్రొగ్రసీవ్ అలయన్స్)లో చేరింది. 2012లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని ఏడు అసెంబ్లీ సీట్లను దక్కించుకుంది.
ప్రస్తుతం (2023) అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్న ఎంఐఎం 9 చోట్ల పోటీ చేయగా.. 7 సీట్లను కైవసం చేసుకుంది. అయితే గతంలో తమ మిత్ర పక్షంగా ఉన్న ఎంఐఎంను మళ్లీ తమ వైపునకు తిప్పుకోవాలని రేవంత్ రెడ్డి భారీగా ప్లాన్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది. పటిష్టమైన ప్రభుత్వం ఏర్పడడంతో ఐదేళ్లు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతుంది. కాబట్టి ఇదే అదునుగా ఎంఐఎంను తమ వైపునకు తిప్పుకోవాలని అందుకు ముందడుగుగా ప్రొటెం స్పీకర్ నియామకాన్ని చేపట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. బీజేపీని తమ దరిదాపుల్లోకి కూడా రాణివ్వని కాంగ్రెస్ ప్రొటెం స్పీకర్ ను బీఆర్ఎస్ నుంచి తీసుకోవచ్చు. కానీ అలా చేయకుండా ఎంఐఎం నుంచి తీసుకోవడంలో స్నేహ హస్తం చాపినట్లు సంకేతం వెళ్తుందని భావించినట్లు తెలుస్తోంది.
కొత్తగా కొలువు దీరిన కాంగ్రెస్ ప్రభుత్వానికి 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీఆర్ఎస్ కు 39, బీజేపీ 8, ఎంఐఎం 7, ఇతరులు 1. మ్యాజిక్ ఫిగర్ ను దాటి కాంగ్రెస్ కు నలుగురు ఎమ్మెల్యేలు ఉండగా.. మ్యాజిక్ ఫిగర్ కు 21 సీట్ల దూరంలో బీఆర్ఎస్ ఉంది. మిత్ర పక్షమైన ఎంఐఎం 7 సీట్లను కలుపుకుంటే 46 అంటే మ్యాజిక్ ఫిగర్ కు 14 సీట్ల దూరం మాత్రమే ఉంటుంది. ప్రభుత్వం పటష్టంగా ఉండాలంటే భవిష్యత్ లో ఎంఐఎం అవసరం అవుతుందని భావించిన కాంగ్రెస్ ఈ వ్యూహం అమలు చేసిందని టాక్ వినిపిస్తుంది. అంటే ఎంఐఎం కాంగ్రెస్ కు మద్దతిస్తే అసెంబ్లీలో తమ బలం 74కు పెరుగుతుంది. కాబట్టి బిల్లలు కూడా ఈజీగా పాస్ చేయించుకోవచ్చని కాంగ్రెస్ భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి చెక్ పెడుతుందా?
శాసన సభ ఎన్నికలు ముగిశాయి. ఇక రానున్నది పార్లమెంట్ ఎన్నికలు. బహూషా ఇంకో నాలుగు లేదంటే ఐదు నెలల్లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ సీట్లను కూడా భారీగా కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నట్లు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నారు. దేశంలో మోడీ హవా కొనసాగుతోంది. ఐదు నెలల క్రితం అడపా దడపా నిర్వహించిన సర్వేల్లో కూడా మోడీ ప్రభుత్వం మరోసారి కొలువు దీరుతుందని ఫలితాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆశించిన దాని కంటే ఎక్కువ ఎంపీ సీట్లను దక్కించుకోవాలని పావులు కదుపుతోంది.
ముస్లిం ఓట్లను కూడా భారీగా తమ ఖాతాకు మళ్లించుకునేందుకు సన్నాహాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణలో 17 లోక్ సభ సీట్లలో ఎంఐఎం 1 లేదంటే 2 చోట్ల గెలిచినా మిగిలిన పార్లమెంట్ స్థానాల్లో ముస్లింల ఓట్లను బీఆర్ఎస్ కు వెళ్లకుండా కాంగ్రెస్ వైపునకు మళ్లించడంలో సఫలీకృతమైతే.. భారీగా సీట్లను గెలుచుకోవచ్చన్ని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు గిఫ్ట్ అంటూ అసెంబ్లీ ఎన్నికలు గెలిచిన రేవంత్ రెడ్డి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చేందుకు అహర్నిశలు కృషి చేస్తానని చెప్తున్నారు. దీనికి ఎంఐఎంను కూడా కలుపుకుపోవాలని భావిస్తున్నారు.
ఏది ఏమైనా కాంగ్రెస్ వ్యూహం సఫలీకృతమైతే ముస్లిం ఓట్లు మారితే సీట్లలో భారీగా తేడా వచ్చే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ కంటే ఎక్కువ సీట్లను రాబట్టాలని ఇది సాధ్యమవుతుందని కాంగ్రెస్ అభిమానులు చెప్తున్నారు.