Begin typing your search above and press return to search.

కాంగ్రెస్-సీపీఐ.. కొత్తగూడెంలో పొత్తు.. మునుగోడులో ఢీ

తెలంగాణ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ-సీపీఐ మధ్య పొత్తు కుదిరింది. ఇందులో భాగంగా వామపక్షానికి కొత్తగూడెం సీటును కేటాయించేందుకు కాంగ్రెస్ అంగీకరించింది.

By:  Tupaki Desk   |   4 Nov 2023 8:06 AM GMT
కాంగ్రెస్-సీపీఐ.. కొత్తగూడెంలో పొత్తు.. మునుగోడులో ఢీ
X

సీరియల్ తరహాలో సాగుతూ వచ్చిన కాంగ్రెస్ –సీపీఐ పొత్తుకు ఎట్టకేలకు తెరపడింది. ఇరు పార్టీల మధ్య అనేక సార్లు చర్చలు.. పార్టీల్లో అంతర్గతంగానూ చర్చలు.. నేడో రోపో తేల్చాస్తామంటూ ప్రకటనల మధ్య సాగిన పొత్తు వ్యవహారం తేలిపోయింది. వామపక్షానికి ఎక్కడ సీటివ్వాలో అక్కడ సీటిచ్చింది కాంగ్రెస్ పార్టీ. అదీ ఆ ఒక్క సీటే. దీంతోపాటు ఆ పార్టీకి ఓ ఎమ్మెల్సీ స్థానమూ ఇస్తామని ప్రకటించింది.

అక్కడ అలా.. ఇక్కడ ఇలా..

తెలంగాణ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ-సీపీఐ మధ్య పొత్తు కుదిరింది. ఇందులో భాగంగా వామపక్షానికి కొత్తగూడెం సీటును కేటాయించేందుకు కాంగ్రెస్ అంగీకరించింది. మరీ ఒక్క సీటేనా? అని అనుకోకుండా, ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీ స్థానమూ కేటాయించనుంది. దీంతో పాటు మరో మెలిక ఏమంటే.. నల్లగొండ జిల్లా మునుగోడులో ఇరు పార్టీలు స్నేహపూర్వక పోటీకి దిగనున్నాయి.

కొత్తగూడెంలో ఆయనే..

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆ పార్టీ తరఫున కొత్తగూడెంలో పోటీ చేయడం ఖాయం. వాస్తవానికి వామపక్షాల్లో రాష్ట్ర కార్యదర్శి పదవిలో ఉన్నవారు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయరు. అయితే, దీనికి భిన్నంగా తాను కొత్తగూడెం బరిలో ఉంటానని కూనంనేని ఇప్పటికే స్పష్టం చేశారు. కాంగ్రెస్ తో పొత్తు ఖాయమైన నేపథ్యంలో ఆయన కొత్తగూడెం నుంచి పోటీకి దిగడం కూడా ఖాయమే అనుకోవాలి. మరోవైపు కూనంనేని అవసరమైతే, అంతగా అడ్డు అనుకుంటే.. పార్టీ పదవినీ వదులుకోవచ్చు. అది వేరే సంగతి.

మరి బీసీకి సీటో..?

తెలంగాణ ఎన్నికల్లో బీసీలకు 34 టికెట్లు ఇస్తామనేది కాంగ్రెస్ హామీ. అంటే పార్లమెంటు సీటుకు రెండు చొప్పున బీసీలకు కేటాయించాలని. అయితే, ఉమ్మడి ఖమ్మంలో ఉన్నవే మూడు జనరల్ స్థానాలు. వీటిలోనూ పాలేరులో రెడ్డి వర్గానికి చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, ఖమ్మంలో కమ్మ సామాజికవర్గానికి చెందిన తుమ్మల నాగేశ్వరరావుకు సీటిచ్చారు. ఇక మిగిలింది కొత్తగూడెం. వాస్తవానికి ఇక్కడనుంచి బీసీ నాయకుడిగా ఎడవల్లి క్రిష్ణ ఉన్నారు. 2009 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతున్న ఆయన.. నాడు పీఆర్పీ నుంచి పోటీ చేసి గణనీయంగా ఓట్లు సాధించారు. అంతేకాదు.. తన తోడల్లుడు, కాంగ్రెస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు ఓటమికి కారణమయ్యారు. మరోవైపు పీఆర్పీ కాంగ్రెస్ లో విలీనం అయ్యాక ఆ పార్టీలోకి వచ్చారు. వనమా గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్ లోకి వెళ్లినా.. ఎడవల్లి మాత్రం కాంగ్రెస్ నే నమ్ముకుని ఉన్నారు. ఈసారి టికెట్ ఆయనకే అనుకుంటుండగా, పొత్తులో భాగంగా సీటు సీపీఐకి వెళ్లింది. కాగా, కూనంనేని కూడా కమ్మ సామాజిక వర్గం వారే. దీన్నిబట్టి ఉమ్మడి ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు టికెట్ ఇవ్వలేకపోయింది. దీనిని మరే విధంగా భర్తీ చేస్తుందో చూడాలి.