Begin typing your search above and press return to search.

టి. కాంగ్రెస్ కి బిగ్ డే... వరంగల్ లో దబిడి దిబిడే!

అవును... జాతీయస్థాయి నాయకులతో వరుసగా ప్రచారాలు చేయిస్తూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచుతుంది.

By:  Tupaki Desk   |   17 Nov 2023 4:04 AM GMT
టి. కాంగ్రెస్  కి బిగ్  డే... వరంగల్  లో దబిడి దిబిడే!
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణలో బీఆరెస్స్ కు తామే ప్రత్యామ్నాయం అంటూ.. అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ విస్తృత ప్రచారం నిర్వహిస్తుంది. హస్తినలోని పెద్ద నేతలను తెలంగాణ గడ్డకు రప్పిస్తుంది. ఎక్కడికక్కడ కేడర్ డల్ అవ్వకుండా వరుస కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం రాష్ట్రంలో పర్యటించనున్నారు.

అవును... జాతీయస్థాయి నాయకులతో వరుసగా ప్రచారాలు చేయిస్తూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచుతుంది. ఇప్పటికే కర్ణాటక కాంగ్రెస్ బడా నేతలతో ప్రచారాలు నిర్వహించిన టి.కాంగ్రెస్... మరోసారి రాహుల్ ని రంగంలోకి దింపింది. ఇదే సమయంలో సీనియర్ మోస్ట్ నేత, కాంగ్రెస్ పార్టీ కీలక నేత, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే రంగంలోకి దిగుతున్నారు. ఈ ఇద్దరు నేతలు ఒకేసారి రాష్ట్రానికి రావడంతో మేనిఫెస్టో మ్యాటర్ తెరపైకి వచ్చింది.

ఈ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ... రాష్ట్రంలోని పరకాల, పినపాక, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు రాహుల్ గాంధీ ప్రచారం కొనసాగుతుందని తెలుస్తుంది. పినపాకలో హెలీకాప్టర్ ది గింది మొదలు ఇది మొదలవుతుందని అంటున్నారు!

ఈ క్రమంలో పినపాక నుంచి హెలికాప్టర్‌ లో నర్సంపేటకు చేరుకున్న అనంతరం అక్కడ నుంచి రోడ్డు మార్గంలో వరంగల్ ఈస్ట్ చేరుకుంటారు! అక్కడ నుంచి రాహుల్ పాదయాత్ర చేస్తారు. ఈ క్రమంలోనే వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్‌ లో ప్రచారం నిర్వహిస్తారు. ఇక్కడ ప్రచారం ముగిసిన అనంతరం హెలికాప్టర్ లో హైదరాబాద్ చేరుకుని.. అక్కడ నుంచి నేరుగా ఢిల్లీ బయలుదేరి వెళతారు.

ఈ సందర్భంగా రాహుల్ పర్యటనపై మాజీమంత్రి కొండా సురేఖ వివరాలు వెల్లడించారు. ఇందులో భాగంగా నర్సంపేట నియోజకవర్గంలో పర్యటన అనంతరం రోడ్డు మార్గంలో వరంగల్ చౌరస్తాకు చేరుకుంటారని.. అక్కడ నుంచి పోచమ్మ మైదాన్ రుద్రమదేవి కూడలి వరకు రాహుల్ పాదయాత్ర ఉంటుందని వెల్లడించారు. పాదయాత్ర అనంతరం రుద్రమదేవి కూడలిలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తారని సురేఖ తెలిపారు!

రాహుల్ పర్యటన విషయాలు, వివరాలు అలా ఉంటే... మరోపక్క ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే ప్రత్యేక విమానంలో బెంగళూరు నుంచి హైదరాబాద్ చేరుకుంటారు. ఈ పర్యటనలో భాగంగా... టీపీసీసీ మేనిఫెస్టో కార్యక్రమంలో పాల్గొంటారు! ఈ మేనిఫెస్టోపై తెలంగాణ రాజకీయాల్లో హాట్ హాట్ చర్చలు నడుస్తున్న సంగతి తెలిసిందే. అనంతరం కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్‌ లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.