తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ సర్వే.. ఎందుకోసమంటే..?
కానీ.. ఇప్పుడు సర్వేలు జరుగుతుండడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంతకీ ఆ సర్వేలు ఎవరు చేయిస్తున్నారు..? ఎందుకు చేయిస్తున్నారు..? ఓ సారి తెలుసుకుందాం.
By: Tupaki Desk | 3 Nov 2024 5:30 PM GMTతెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం సర్వేల జాతర నడుస్తోంది. ఎవరైనా ఎన్నికలకు ముందు సర్వేలు చేపట్టడం కామన్. ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి..? ప్రజల మద్దతు ఎవరికి ఉంది..? అని సర్వేల ద్వారా తెలుసుకోవడం ఆనవాయితీ. కానీ.. తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి పది నెలలు గడిచింది. కానీ.. ఇప్పుడు సర్వేలు జరుగుతుండడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంతకీ ఆ సర్వేలు ఎవరు చేయిస్తున్నారు..? ఎందుకు చేయిస్తున్నారు..? ఓ సారి తెలుసుకుందాం.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి పది నెలలు గడిచింది. మరో రెండు నెలల్లో ఏడాది పూర్తిచేసుకోబోతోంది. ఈ క్రమంలో ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న ఫీలింగును తెలుసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే చేయిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలు ఏమనుకుంటున్నారు..? పథకాల లక్ష్యాలు ఎలా ఉన్నాయి..? పథకాలపై వారి ఫీడ్ బ్యాక్ ఏంటి..? గత పదేళ్లకు ఇప్పటికి సంతృప్తికరంగా ఉన్నారా..? ఇంకా ప్రజలు ఏం కోరుకుంటున్నారు..? బీఆర్ఎస్ నాయకుల వైఖరి మీద ఏం అనుకుంటున్నారు..? ఈ పది నెలల కాలంలో ప్రభుత్వ సక్సెస్‌లు ఏంటి..? ప్రభుత్వ వైఫల్యాలు ఏంటి..? లోకల్ ప్రజాప్రతినిధుల పనితీరు ఎలా ఉంది..? మంత్రులు ఎలా స్పందిస్తున్నారు..? స్థానిక నేతలు ప్రజలను పట్టించుకుంటున్నారా..? ఆరు గ్యారంటీలపై ప్రజల్లో ఎలాంటి టాక్ ఉంది..? ఇలా తదితర ప్రశ్నలతో రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నల్‌గా ఈ సర్వే చేస్తున్నారు. సర్వేలో వచ్చిన అభిప్రాయాలతో భవిష్యత్తులో పాలనాపరంగా మార్పులు.. కావాల్సిన పథకాలకు రూపకల్పన చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. అంతేకాకుండా పదేండ్ల తరువాత అధికారంలోకి రావడంతో.. సక్సెస్ ఫుల్‌గా వన్ ఇయర్ పూర్తి చేసుకుంటుండడంతో వన్ ఇయర్ సంబరాలను కూడా గ్రాండుగా నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తోంది.
మరోవైపు.. బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల తర్వాత ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి పదేళ్ల పాటు గులాబీ పార్టీనే అధికారంలో కొనసాగింది. అయితే.. గత పది నెలలుగా ప్రతిపక్ష నేతగా కేసీఆర్ పెద్దగా ప్రజల్లో వచ్చిన దాఖలాలు లేవు. అధికారం కోల్పోయినప్పటి నుంచి ఒకటి రెండు సందర్భాల్లో మినహా ఆయన కనిపించలేదు. అనారోగ్య కారణాలు వేధించడం.. కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆయన ఫామ్‌హౌజ్ దాటి రావడం లేదని ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. సరే.. కారణాలు ఏవైనప్పటికీ కేసీఆర్ రాకకోసం ఆయన అభిమానులు మాత్రం ఎదురుచూస్తూనే ఉన్నారు.
ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ పార్టీ కూడా రాష్ట్రంలో సీక్రెట్ సర్వే చేయిస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును తెలుసుకునేందుకు ఈ సర్వే చేయిస్తోంది. గతంలో బీఆర్ఎస్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలపైనా ఆరా తీస్తోంది. ముఖ్యంగా.. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన పనితీరు ఎలా ఉంది..? కొత్త ప్రభుత్వం ఎలా కొనసాగుతోంది..? ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలయ్యాయి..? ఆయన భాష తీరు, ప్రతిపక్షాలపై, కేసీఆర్‌పై చేస్తున్న కామెంట్లతో ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది..? ఒకవేళ రేవంత్ స్థానంలో వేరే వ్యక్తి సీఎం అయితే ఎలా ఉంటుంది..? ఇచ్చిన గ్యారంటీలు పూర్తిస్థాయిలో అమలువుతున్నాయా..? లబ్ధిదారులకు పథకాలు అందుతున్నాయా..? తెలంగాణ అభివృద్ధి రేవంత్‌తో సాధ్యం అవుతుందా..? పరిశ్రమలను తీసుకురావడంలో ఏ మేరకు సఫలీకృతం అయ్యారు..? రాష్ట్రంలో పెట్టుడులు పెట్టడానికి వచ్చిన కంపెనీలు మళ్లీ ఇతర రాష్ట్రాలకు తరలడానికి గల కారణాలు..? నిరుద్యోగులకు, విద్యార్థులకు ఏ మేరకు భరోసానిచ్చారు..? అటు రైతులకు ఇచ్చిన హామీలు పూర్తిస్థాయిలో అమలయ్యాయా..? మూసీ, హైడ్రాలపై ప్రజల్లో అభిప్రాయం ఎలా ఉంది..? ఇళ్లను కూల్చడంపై ప్రజలు ఏమనుకుంటున్నారు..? ఇలా మరికొన్ని ప్రశ్నలతో ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరిస్తోంది. అయితే.. ఈ సర్వే రిపోర్టు ఆధారంగానే బీఆర్ఎస్ భవిష్యత్ ప్రణాళికలు రూపొందించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అధినేత కేసీఆర్ ప్రత్యేక ఆసక్తితో ఈ సర్వే చేయిస్తున్నారని, ఈ రిపోర్టు ఆధారంగానే మరికొద్ది రోజుల్లో ఆయన ప్రజల్లోకి వచ్చి ప్రభుత్వంపై విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయని పార్టీలో చర్చ జరుగుతోంది. ఏదిఏమైనా రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు సర్వేలు నిర్వహించడం మరింత హాట్ టాపిక్ అయ్యాయి.