Begin typing your search above and press return to search.

కొలువుల కూర్పు..కాంగ్రెస్ కు కత్తిమీద సామే?

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర కావొస్తోంది. అయినా ఇప్పటికీ పదవుల భర్తీ పూర్తి కాలేదు.

By:  Tupaki Desk   |   7 March 2025 4:00 PM IST
కొలువుల కూర్పు..కాంగ్రెస్ కు కత్తిమీద సామే?
X

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర కావొస్తోంది. అయినా ఇప్పటికీ పదవుల భర్తీ పూర్తి కాలేదు. 6 మంత్రి పదవులు, పార్టీ పదవులు, కార్పొరేషన్, అధికార పదవులు ఖాళీగానే ఉన్నాయి. ఇక వాటి భర్తీకి ఇప్పుడు సమయం అసన్నమైనట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే కీలక హోం మంత్రి, ఎడ్యుకేషన్ వంటి కీలక శాఖలు సీఎం రేవంత్ రెడ్డి చేతిలోనే ఉండడంతో ఇంటా బయట విమర్శలు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం పదవుల భర్తీకి కసరత్తు చేస్తోంది. పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉండడంతో సీనియర్ నేతలంతా తమకు పదవులు కావాలని డిమాండ్ చేస్తున్నారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు తాము చేసిన సేవలు గుర్తించాలని, పార్టీ కోసం ఆర్థికంగా ఎంతో నష్టపోయామని..ఇలా ఎవరికి వారు తమ లాబీయింగ్ లు మొదలుపెట్టారు. ఈ తరుణంలో కాంగ్రెస్ పదవుల భర్తీకి రంగం సిద్ధం చేసింది.

పదవుల భర్తీకి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కులాల కోణంలోనే కసరత్తు చేస్తోంది. ముందుగా కేబినెట్ బెర్తుల్లో రెడ్లు, బీసీలకు రెండేసి పదవులు ఇవ్వాలనే విషయంలో తీవ్ర పోటీ ఎదురవుతోంది. బీసీలకు రెండు పదవులు ఇవ్వాల్సిందే అంటూ ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఇక ఎస్సీల్లో మాల, మాదిగలు, బీసీల్లో ఐదు ప్రధాన కులాలు, ఎస్టీల్లో లంబాడా సామాజికవర్గాలను నొప్పించకుండా పదవుల భర్తీ చేయాలని అధిష్ఠానం భావిస్తోంది. అలాగే మిగతా పదవులకు పార్టీ కోసం త్యాగం చేసిన వారికి, సీనియర్లకు చాన్స్ ఇవ్వనున్నారు. ఈనెల 10 కల్లా ఈ కసరత్తు పూర్తవుతుందని అంటున్నారు.

ఆరు క్యాబినెట్ పదవులు, ఒక డిప్యూటీ స్పీకర్, ఒక చీఫ్ విప్, ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి, రెండు లేదా మూడు ప్రభుత్వ సలహాదారులు, నాలుగు ఎమ్మెల్సీలు, నలుగురు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, నాలుగు ఎమ్మెల్సీలు, ఇద్దరు ఏఐసీసీ కార్యదర్శులు, ఇలా కీలక పదవులతో పాటు అనేక ఇతర కార్పొరేషన్ పదవులను కులాల సమీకరణంలో భర్తీ చేయాలని చూస్తున్నారు. అయితే ఏది ఎలా ఉన్నా.. మంత్రి పదవులకే మాత్రం విపరీతమైన గిరాకీ ఉంది. వివిధ సామాజిక వర్గాలు కూడా మంత్రి పదవి కోసమే డిమాండ్ చేస్తున్నాయి. ఎమ్మెల్సీ పదవుల లాంటివి ఇచ్చినా..వాటికి అంతగా ప్రాధాన్యం చూపే అవకాశం లేదు. ముఖ్యంగా బీసీ, ఎస్సీల్లో ఈ డిమాండ్ ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే ఎస్సీల్లో మాల, మాదిగలు తమకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఇక బీసీల్లో ప్రధానంగా యాదవ, మున్నూరు కాపు, ముదిరాజ్ సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వడం తప్పనిసరిగా మారింది. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఐదుగురు యాదవ ఎమ్మెల్యేలు, ఒక మంత్రి ఉండేవారు. ప్రస్తుతం ఈ సామాజిక వర్గంలో ఒక్క ఎమ్మెల్యే లేకపోగా..మంత్రి పదవి లేనేలేదు. దీంతో ఆ సామాజిక వర్గ పెద్దలు.. కేసీఆర్ తమకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని..కాంగ్రెస్ కొనసాగించడం లేదని భావిస్తున్నారు. ఇలా ప్రతీ సామాజిక వర్గంలోనూ ఇదే తీరు కనిపిస్తోంది.

మరి కులాల లెక్కలతో కాంగ్రెస్ పార్టీ అందరినీ మెప్పించగలుగుతుందా?నాయకులను ఒప్పించగలుగుతుందా? చూడాలి. కులాల కూడిక, తీసివేత లెక్కల్లో కాంగ్రెస్ ఏమాత్రం ఏమరుపాటుగా వ్యవహరించిన వారి ఆగ్రహానికి గురికాక తప్పదు అని విశ్లేషకులు భావిస్తున్నారు.