Begin typing your search above and press return to search.

ఎన్సీకి కాంగ్రెస్ షాక్.. ప్రభుత్వంలో చేరబోమంటూ..

ఈ క్రమంలో ప్రభుత్వంలో చేరే విషయంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాణ స్వీకారం వేళ ఎన్సీకి షాక్‌నిచ్చింది.

By:  Tupaki Desk   |   16 Oct 2024 5:45 AM GMT
ఎన్సీకి కాంగ్రెస్ షాక్.. ప్రభుత్వంలో చేరబోమంటూ..
X

జమ్మూకశ్మీర్ ఎన్నికలు ముగిసి.. ఇటీవలే ఫలితాలు కూడా వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఎన్సీ-కాంగ్రెస్ కూటమి సత్తాచాటింది. బీజేపీని మట్టికరిపించారు. దీంతో ప్రభుత్వం ఏర్పాటుకు సమయం ఆసన్నమైంది. అందులోభాగంగా నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ఈ రోజు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వంలో చేరే విషయంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాణ స్వీకారం వేళ ఎన్సీకి షాక్‌నిచ్చింది.

జమ్మూకశ్మీర్‌లో మొత్ం 90 సీట్లు ఉండగా.. కూటమి 48 సీట్లను గెలుచుకుంది. వీరితోపాటు స్వతంత్రంగా గెలిచిన మరో ఆరుగురు కూడా ఒమర్ అబ్దుల్లాకే మద్దతునిస్తున్నారు. దీంతో వీరి బలం 54కు చేరింది. అయితే.. ఎన్సీతో జతకట్టిన కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కేవలం ఆరు స్థానాలకే పరిమితమైంది. ఈ క్రమంలో ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలో ఏర్పాటువుతున్న ప్రభుత్వంలో చేరడమా..? బయట నుంచే మద్దతు ఇవ్వడమా అనేది కాంగ్రెస్ ఆలోచనలో పడింది. అయితే ఈ విషయంపై ఇప్పటికే కీలక నిర్ణయం సైతం తీసుకుంది. బయట నుంచే ఎన్సీకి మద్దతుగా నిలిచేందుకు సిద్ధమైంది.

ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఒమర్ అబ్దుల్లా తన కేబినెట్‌లో కాంగ్రెస్ పార్టీకి ఓ స్థానాన్ని సైతం కేటాయించారు. ఓ ఎమ్మెల్యేకు మంత్రి పదవిని కూడా ఇవ్వబోతున్నారు. కానీ.. ప్రభుత్వంలోనే చేరలేకపోతున్నామని ఆ మంత్రి పదవిని కూడా తిరస్కరించారు. కాంగ్రెస్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఒమర్ ప్రమాణస్వీకారం కార్యక్రమం నేడు ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతోపాటు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా కూడా హాజరవుతున్నారు.

అయితే.. గత పదేళ్లుగా జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలననే కొనసాగుతూ వచ్చింది. పదేళ్ల తరువాత ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇక్కడ చివరగా 2014లో ఎన్నికలు నిర్వహించారు. ఆ సమయంలో పీడీపీ-బీజేపీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి. 2019లో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే రాజ్యాంగంలోని 370 ఆర్టికల్‌ను రద్దు చేశారు. దాంతో ఆ ఏడాది షెడ్యూల్ ప్రకారం నిర్వహించాల్సిన ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎట్టకేలకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పుతో ఇక్కడ ఎన్నికలు నిర్వహించారు. మరోవైపు.. జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ కేంద్రం రెండు రోజుల క్రితమే గెజిట్ కూడా విడుదల చేసింది. దీంతో ఎన్సీకి ఉన్న అడ్డంకులు కూడా తొలగాయి.