తాను మునిగి.. కేజ్రీని ముంచుతున్న కాంగ్రెస్!
తాను మునగడమే కాకుండా.. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీని కూడా కాంగ్రెస్ పార్టీ ముం చేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు
By: Tupaki Desk | 5 Feb 2025 11:30 PM GMTతాను మునగడమే కాకుండా.. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీని కూడా కాంగ్రెస్ పార్టీ ముంచేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత.. పలు చానెళ్లు చర్చ చేపట్టా యి. దీనిలో జాతీయ స్థాయి విశ్లేషకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుందని ఒక్క కేకే సర్వే మాత్రమే చెప్పిన దరిమిలా.. ఆప్ ఓటమి..కి కారణాలు వెతికే పని ప్రారంభించారు. దీనిలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తెరమీదికి వచ్చింది. జాతీయ స్థాయిలో 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆప్‌తో కలిసి కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగింది.
కానీ, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే సరికి మాత్రం ఆప్‌తో విభేదించింది. వాస్తవానికి కేజ్రీవాల్ 5-10 స్థానాలను ఇచ్చేందుకు ఆదిలో ముందుకు వచ్చారు. కానీ, కాంగ్రెస్ 25 స్థానాలకు పట్టుబట్టింది. దీంతో కేజ్రీవాల్ ఒంటరి పోరుకు రెడీ అయ్యారు. దీంతో బెట్టు పోయిన కాంగ్రెస్ తాము కూడా ఒంటరి పోరు చేస్తామనిప్రకటించి.. 70 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇది పెద్ద తప్పని అప్పట్లోనే విశ్లేషణలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ పావుకునేది ఏమీ లేదని.. ఉన్న ఓట్లను చీల్చడం ద్వారా బీజేపీకి మేలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని.. పెద్ద ఎత్తున వ్యాసాలు, విశ్లేషణలు కూడా వచ్చాయి.
అయినా.. కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గలేదు. పైగా.. బీజేపీని తాజా ఎన్నికల్లో పన్నెత్తు మాట అనకుండా.. అక్రమార్కుడు, అవినీతి పరుడు, అద్దాల బంగళా కట్టుకున్నాడంటూ.. రాహుల్ గాంధీ.. మాజీ సీఎం కేజ్రీవాల్‌పైనే విమర్శలు గుప్పించారు. ఈ వ్యవహారం ఢిల్లీ ప్రజలకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది. ఈ పరిణామాలను బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకుని.. కాంగ్రెస్‌ను పన్నెత్తుమాట అనుకుండా.. కేజ్రీవాల్‌పైనే విమర్శల బాణాలు వేసింది. ఫలితంగా.. ప్రజలకు కేజ్రీవాల్ విలన్ అయ్యారన్నది విశ్లేషకుల అంచనా. పోనీ.. ఈ పరంపరలో కాంగ్రెస్‌ను హత్తుకున్నారా? అంటే.. అసలు కాంగ్రెస్‌లో బలమైన నాయకత్వం లేకపోవడం.. సీఎం అభ్యర్థి ని కూడా ప్రకటించకపోవడంతో ప్రజలు ఆ పార్టీవైపు మొగ్గు చూపలేదు.
మొత్తంగా.. కాంగ్రెస్ వ్యహరించిన తీరు బీజేపీకి మేలు చేసే పరిస్థితిని తీసుకువచ్చిందని అంటున్నారు. క్లియర్ కట్గా బీజేపీ ఎగ్జిట్ పోల్స్‌లో ఇంత మెజారిటీ దక్కించుకునేందుకు కాంగ్రెస్, ఆప్‌లపై ప్రజలకు ఏర్పడిన అసహనమేనని పేర్కొన్నారు. తాను మునిగి.. తన జాతీయ మిత్రపక్షం ఆప్‌ను కూడా ముంచేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందని అంటున్నారు. ఈ పరిణామాలు ఎలా ఉన్నా.. బీజేపీ మాత్రం గెలుపు అంచుల వరకు చేరుకోవడం గమనార్హం. ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ.. దాదాపు బీజేపీ పట్టం కట్టగా.. కాంగ్రెస్ కేవలం 1 అరా స్థానాలకే పరిమితం కానుందన్న లెక్కలు హస్తం నేతలకు ఇబ్బందిగా మారాయి.