కాంగ్రెస్ ఎన్నికల ఖర్చులు.585 కోట్లు.. లెక్కల్లోకి వెళితే..!
ఇంతకు ఈ భారీ మొత్తానికి సంబంధించి ఏ లెక్కల్లోకి వెళితే.. దేని కోసం ఎంత ఖర్చు చేశారన్న విషయంపై ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి.
By: Tupaki Desk | 8 Oct 2024 4:11 AM GMTఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన ఆసక్తికర అంశం ఒకటి వెలుగు చూసింది. నాలుగు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల (ఏపీ.. ఒడిశా.. అరుణాచల్ ప్రదేశ్.. సిక్కిం)తో పాటు లోక్ సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఖర్చు రూ.585 కోట్లుగా లెక్క తేలింది. దీనికి సంబంధించిన వివరాల్ని కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించింది. ఇంతకు ఈ భారీ మొత్తానికి సంబంధించి ఏ లెక్కల్లోకి వెళితే.. దేని కోసం ఎంత ఖర్చు చేశారన్న విషయంపై ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి.
మీడియా ప్రచారానికి.. ప్రకటనలకు రూ.410 కోట్లు.. సోషల్ మీడియా.. యాప్.. ఇతర మార్గాల్లో వర్చువల్ ప్రచారానికి దాదాపు రూ.46 కోట్లు ఖర్చు చేసినట్లుగా పార్టీ పేర్కొంది. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గే.. ముఖ్య నేతలు రాహుల్ గాంధీ.. ప్రియాంక తదితరుల స్టార్ క్యాంపెయినల్ల విమాన ప్రయాణాలకు దాదాపు రూ.105 కోట్లు ఖర్చు చేసినట్లుగా పార్టీ వెల్లడించింది.
అంతేకాదు.. ఎన్నికల్లో పోటీ కోసం రాహుల్ గాంధీతో సహా పలువురు కీలక ఎంపీ స్థానాలకు పోటీచేసే అభ్యర్థులకు రూ.11.20 కోట్లు అందజేసింది. ఇక.. హోర్డింగులు.. ప్రచార పోస్టర్లు.. బ్యానర్లు.. ఇలాంటి వాటి కోసం.. ఎన్నికల ప్రచార సామాగ్రి ప్రింటింగ్ కోసం రూ.68.62 కోట్లను ఖర్చు చేసినట్లుగా పేర్కొన్నారు. ఎన్నికల ప్రకటన వేళలో కాంగ్రెస్ పార్టీ వద్ద వివిధ డిపాజిట్లతో సహా వివిధ రూపాల్లో రూ.539.37 కోట్లు వచ్చాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. పన్ను రిటర్న్ ల వివాదం వేళ.. కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల్ని ఐటీ విభాగం ఫ్రీజ్ చేయటం తెలిసిందే. దీనిపై ఢిల్లీలోని ఐటీ అప్పిలేట్ ట్రైబ్యునల్ అప్పీలు చేయటంతో రిలీఫ్ లభించినట్లుగా చెబుతున్నారు.