కాంగ్రెస్.. కాంగ్రెస్.. ఏం చేస్తున్నావ్?..: 'పారబోసి ఏరుకుంటున్నా!'
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తాజాగా కొన్ని ప్రవచనాలు బోధించారు.
By: Tupaki Desk | 30 Nov 2024 1:30 AM GMTమహారాష్ట్రలో ఘోర పరాజయం.. హరియాణాలో కాంగ్రెస్ సర్కారు ఏర్పాటు ఖాయమని సర్వేలు ఘంటా పథంగా ప్రకటించిన చోటా.. కుప్పకూలడం.. ఇక, జమ్ము కశ్మీర్‌లో మేలిమి ఓటు బ్యాంకు కునారిల్లడం.. ఇవీ.. గత ఆరు మాసాల్లో అతి పురాతన కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్న అతి పెద్ద అపజయాలు, పరాభవాలు. అయితే.. ఎప్పటికప్పుడు కాంగ్రెస్‌ను హెచ్చరిస్తున్న మీడియా ఉండనే ఉంది. విశ్లేషకులు కూడా ఉండనే ఉన్నారు. ఇలా చేయొద్దు.. మోడీకి ఆయుధాలు ఇవ్వొద్దంటూ.. పుంఖాను పుంఖాలుగా ఎడిటోరియల్స్ రాసిన పత్రికలు.. విశ్లేషణలు చేసిన మీడియా కూడా ఉండనే ఉంది.
కానీ, కాంగ్రెస్ నాయకులు చెవినెక్కించుకుంటేనా? పట్టించుకుంటేనా? కానీ, చిత్రంగా.. కాంగ్రెస్ పార్టీకి గత 10 సంవత్సరాలుగా ఏచేస్తున్నావంటే.. 'ఒలక బోసుకుని ఏరుకుంటున్నాన'ని చెప్పడం అలవాటైంది. చేతులు కాలుతుంటే.. ముందుగానే సంరక్షణ మార్గాలు వెతుక్కుంటారు. కానీ, చేతులు కాలే వరకువెయిట్ చేసి.. ఆ తర్వాత ఆకులు పట్టుకునే తరహాలో కాంగ్రెస్ పార్టీ వడివడిగా విజృంభిస్తోంది. మరో రెండు మాసాల్లో కీలకమైన ఢిల్లీ ఎన్నికలు ఉన్నాయి. అదేవిధంగా మరో ఏడాదిలో పశ్చిమ బెంగాల్ ఎన్నికలు కూడా ఉన్నాయి. అయినా.. పార్టీలో వ్యవస్థీకృత మార్పుల దిశగా అడుగులు పడడం లేదు.
ఖర్గే ఉవాచ.. తాజాగా!
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తాజాగా కొన్ని ప్రవచనాలు బోధించారు. మహారాష్ట్ర, హరియాణాలో జరిగిన ఘోర పరాభవంపై చర్చించామని.. 'నిశితంగా' దృష్టి పెట్టామని ఆయన చెప్పుకొచ్చారు. శుక్రవారం ఢిల్లీలో సెంట్రల్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)(ఇది కాంగ్రెస్‌లో అత్యంత కీలకమైన కమిటీ) సమావేశం జరిగింది. ఇందులో చర్చించింది.. మహారాష్ట్ర, హరియాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ చావు దెబ్బ తినడంపైనే. ఇంతకీ.. ఖర్గే ఉవాచ ఏంటంటే..
1) కాంగ్రెస్ లో క్రమ శిక్షణ సన్నగిల్లింది. 2) నాయకులలో నిబద్ధత లేకుండా పోయింది. 3) వ్యక్తిగత అజెండాలు పెరిగిపోయాయి. 4) అంతర్గత కుమ్ములాటలు పెరిగాయి. 5) నాయకులు యాంత్రీకరణ అయ్యారు. అని ఖర్గే చెప్పుకొచ్చారు. ఇవే కాంగ్రెస్ పార్టీ కొంపముంచాయని, మున్ముందు ఇండియా కూటమిపైనా(కాంగ్రెస్ సారథ్యం) ప్రభావం చూపుతాయని అన్నారు. వీటి నుంచి బయట పడేందుకు ఏం చేయాలన్న దానిపై నాయకులు దృష్టి పెట్టాలని సున్నితంగా వ్యాఖ్యానించారు.
కట్ చేస్తే.. అసలు ఖర్గే చెప్పిన, చెబుతున్న ఈ విషయాలపై దశాబ్ద కాలంగా మీడియా ఘోషిస్తూనే ఉంది. కాంగ్రెస్ వాదులు, ప్రజాస్వామ్య వాదులు కూడా.. కాంగ్రెస్ విషయంలో పైన చెప్పిన ఐదు పాయింట్లను ఉద్ఘాటిస్తూనే ఉన్నారు. ఇలా అయితే ఎలా? అంటూ.. జాతీయ స్థాయి మీడియాలో విశ్లేషకులు, విమర్శకులు నిప్పులు చెరిగారు. ఎన్నికలకు ముందు పార్టీలు మారుతున్న నాయకులను కట్టడి చేయడంలో విఫలమవుతున్నారని, ప్రజల నాడిని పట్టుకోలేక పోతున్నారని చెప్పినా.. ఖర్గే నుంచిరాహుల్ వరకు అంతా మాకు తెలుసు! అన్నట్టే వ్యవహరించారు. ఇప్పుడు వెనుదిరిగి చూసుకున్నా.. అవే విషయాలు కనిపిస్తున్నాయి. మరి మహా పురాతన పార్టీ మారేదెన్నడు.. మార్పు ఎన్నడు? అనేది చూడాలి.