Begin typing your search above and press return to search.

షర్మిలమ్మ లిస్ట్ ని కాంగ్రెస్ పక్కన పెట్టేసిందా...ఏం జరుగుతోంది ?

ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా ఎకాఎకిన వైఎస్ షర్మిల అయిపోయారు. దానికి కారణం ఆమె తండ్రి వైఎస్సార్ కావడం.

By:  Tupaki Desk   |   30 Aug 2024 7:25 AM GMT
షర్మిలమ్మ లిస్ట్ ని కాంగ్రెస్ పక్కన పెట్టేసిందా...ఏం జరుగుతోంది ?
X

ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా ఎకాఎకిన వైఎస్ షర్మిల అయిపోయారు. దానికి కారణం ఆమె తండ్రి వైఎస్సార్ కావడం. అలాగే అన్న వైఎస్ జగన్ ఏపీ సీఎం గా ఉండడం. ఈ రెండు నీడలే ఆమెను కాంగ్రెస్ గొడుగు కిందకు చేర్చాయి. ఉన్నట్లుండి పెద్ద పదవికే అప్పగించాయి. ఏపీలో కాంగ్రెస్ కి ఏముందని అనుకోవచ్చు. ఏమి ఉన్నా లేకపోయినా పీసీసీ చీఫ్ అంత సులువుగా దక్కే పదవి కాదు.

ఏపీ కాంగ్రెస్ నే నమ్ముకుని ఇంకా చాలా మంది సీనియర్ లీడర్లు ఉన్నారు. వారంతా మరే పార్టీలోకి వెళ్లేది ఉండదు. ఇక షర్మిలను ఏపీకి తేవడంలో కాంగ్రెస్ ఒక టాస్క్ ని సక్సెస్ ఫుల్ గా నెరవేర్చుకుంది. అదే వైఎస్ జగన్ ని గద్దె దించడం. అధికారంలో లేని వైసీపీ నుంచి నేతలు వలస బాట పడతారని కాంగ్రెస్ కి ఏదో నాడు వారంతా జమ అవుతారని కేంద్ర నాయకత్వం భావిస్తోంది.

ఇక ఏపీలో వైసీపీ ఓటమి పాలు అయింది కాబట్టి షర్మిలకు అప్పగించిన రెండవ టాస్క్ వైసీపీ నుంచి నేతలను కాంగ్రెస్ వైపు మళ్ళించడం. ఆ పనిలో షర్మిల ఎంత మేరకు సక్సెస్ అయ్యారంటే జవాబు ఎవరికి వారుగా తెలుసుకోవాల్సిందే. కాంగ్రెస్ ఏపీ పట్ల ఎంత ఫోకస్ పెట్టిందో అన్నది వైఎస్సార్ జయంతిని ఏపీలో గ్రాండ్ గా జరపడం, దానికి తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి సహా కీలక మంత్రులు నేతలను పిలవడం అన్నీ చూశారు.

అంత ఖర్చు పెట్టి ఆర్భాటంగా కార్యక్రమాలు చేసినా ఒక్కరంటే ఒక్క నాయకుడు కాంగ్రెస్ వైపు చూడలేదు. వలసలు అన్నీ టీడీపీ వైపుగానే సాగుతున్నాయి. వైసీపీ నుంచి ఇంకా ఏమైనా సాగితే జనసేన లేక బీజేపీ దిశగా వెళ్తున్నాయి.

మరి లోపం ఎక్కడ ఉంది అంటే షర్మిల సింగిల్ పాయింట్ అజెండా నుంచి బయటకు రాకపోవడం వల్లనే అని అంటున్నారు. ఆమె ఎన్నికల నుంది అధికారంలో ఉన్న వైసీపీని జగన్ ని విమర్శిస్తే అది బాగా పండింది. హిట్ అయింది. కానీ ఇపుడు ఏపీలో వైసీపీ విపక్షంలో ఉంది. దాంతో రూట్ మార్చాలి. వ్యూహాలు మార్చాలి. కానీ షర్మిల పీసీసీ చీఫ్ గా ఉంటూ సొంత అజెండాను వ్యక్తిగత వైరాన్ని ముందుకు తెస్తున్నారని కాంగ్రెస్ లో నేతలు అంటున్నారు.

దాని వల్లనే వైసీపీ నుంచి వలసలు రావడం లేదు అని అంటున్నారు. వైసీపీ నేతలకు కాంగ్రెస్ లోకి రావాలని ఉన్నా షర్మిల వైఖరి కూడా నచ్చక సైలెంట్ అవుతున్నారు అన్న మాట కూడా ప్రచారంలో ఉందిట. ఇక ఇటీవల ఢిల్లీలో జరిగిన పీసీసీ మీటింగ్ కి అటెండ్ అయిన షర్మిల ఏపీ పీసీసీ పదవులను తన వారితో భర్తీ చేయడానికి యాభై మందితో ఒక లిస్ట్ ని ఇచ్చారు అని అంటున్నారు. ఆ లిస్ట్ లో ఉన్న వారికి పదవులు ఇస్తే తాను సాఫీగా ఏపీలో కాంగ్రెస్ రధాన్ని నడుపుతాను అని ఆమె అంటున్నారని ప్రచారంలో ఉంది.

అయితే ఆ లిస్ట్ కి కేంద్ర నాయకత్వం ఆమోదముద్ర వేయలేదని అంటున్నారు. అందులో ఉన్న వారు షర్మిల అనుచరులు తప్ప కాంగ్రెస్ కోసం పనిచేసే వారికి న్యాయం జరగలేదని పార్టీలోని సీనియర్లు చెప్పడం వల్లే ఆ లిస్ట్ ఆగింది అని అంటున్నారు. సుంకర పద్మశ్రీ వంటి వారిని షర్మిల తప్పించడం, అలాగే పార్టీలో మొదటి నుంచి ఉన్న నేతలను సైడ్ చేయడం వంటి వాటి మీద కూడా కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదులు వెళ్లాయని అంటున్నారు.

దాంతో నాలుగు రాష్ట్రాల ఎన్నికల తరువాతనే ఏపీ పీసీసీ పదవుల భర్తీకి కాంగ్రెస్ ఆసక్తి చూపుతుందని అంటున్నారు. ప్రస్తుతానికి అయితే షర్మిల పీసీసీ చీఫ్ గా ఉన్నారు. మిగిలిన కార్యవర్గాన్ని నియమించాల్సి ఉంది. మరి ఆమె మాటకు ఓకే అని కాంగ్రెస్ అధినాయకత్వం ఆమె చెప్పిన పేర్లకు ఆమోద ముద్ర వేస్తుందా లేక అందరి అభిప్రాయాలను తీసుకుని ఒక సమిష్టి నాయకత్వానికి గుర్తుగా లిస్ట్ ప్రకటిస్తుందా అన్నది చూడాలని అంటున్నారు.

ఏది ఏమైనా కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం మాత్రం సమిష్టిగానే ఏపీ కాంగ్రెస్ ముందుకు సాగాలని కోరుకుంటోందని అంటున్నారు. అలాగే సింగిల్ పాయింట్ అజెండాలు కాకుండా కాంగ్రెస్ వృద్ధి కోసం అంతా పనిచేయాలని సూచిస్తోదని అంటున్నారు. మరో రెండు నెలల తరువాత కాంగ్రెస్ ఏపీ మీద ఫుల్ ఫోకస్ పెడుతుందని అంటున్నారు. మరి కాంగ్రెస్ కనుక సమిష్టి నాయకత్వం అంటే ఏపీ కాంగ్రెస్ లో ఏమి జరుగుతుంది అన్నది చూడాల్సి ఉంది.