ఆప్ ఓడితే ఆడిపోసుకునేది కాంగ్రెస్ నే !
అది కాస్తా హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమితో మెల్లగా మొదలై మహారాష్ట్రలో ఓటమితో తారస్థాయికి చేరుకుంది.
By: Tupaki Desk | 7 Feb 2025 3:15 AM GMTకాంగ్రెస్ ఇపుడు ఇండియా కూటమిలోని ఇతర పార్టీలకు టార్గెట్ గా మారుతోంది. ఇండియా కూటమిలో పెద్దన్న పాత్ర పోషించేందుకు తహతహలాడుతున్న పార్టీలు చాలా కాలంగా కాంగ్రెస్ రాజకీయ విధానాలను గట్టిగా విమర్శిస్తూ వస్తున్నాయి. అది కాస్తా హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమితో మెల్లగా మొదలై మహారాష్ట్రలో ఓటమితో తారస్థాయికి చేరుకుంది.
ఇపుడు ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఓడిపోతే కనుక కాంగ్రెస్ మీద అంతా కలసి ఆడిపోసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ మీద అపుడే సమాజ్ వాది పార్టీకి చెందిన నేతలు విమర్శలు చేస్తున్నారు. ఎస్పీ నాయకులు ఎంతదాకా విమర్శల దాడిని పెంచారంటే కాంగ్రెస్ ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి బీ టీం గా పనిచేసిందని హాట్ కామెంట్స్ చేశారు.
బీజేపీకి లాభం చేకూర్చడానికే కాంగ్రెస్ పోటీ అని తేల్చేశారు. ఆప్ కి మద్దతు ఇవ్వకుండా ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేసింది. దాంతో చాలా చోట్ల ఓట్లు చీలి బీజేపీ లాభపడింది అని అంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ సర్వేలు ఆప్ ఓటమి పాలు అవుతుందని చెబుతున్నాయి. దాంతో ఇండియా కూటమి మిత్రులు కాంగ్రెస్ మీద విమర్శలు మొదలెట్టారు.
నిజంగా ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలు ఎగ్జాక్ట్ పోల్స్ లోనూ వస్తే మాత్రం ఇండియా కూటమిలో మిత్రులు అంతా కాంగ్రెస్ మీద పెద్ద ఎత్తున విరుచుకుపడడం ఖాయమని అంటున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ కే ఇండియా కూటమిలోని చాలా పార్టీలు మద్దతుగా నిలిచాయి. అదే సమయంలో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసింది.
కాంగ్రెస్ కి సీట్లు పెద్దగా రావు అని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అయితే ఓట్ల చీలికతో బీజేపీకి కాంగ్రెస్ పోటీ మేలు చేసేలా ఉందని విశ్లేషణలు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పటికే ఇండియా కూటమిలో లుకలుకలు బయటకు వస్తున్నాయి. కాంగ్రెస్ పెద్దన్నగా ఉంటే బీజేపీని ఎదుర్కోవడం కష్టమని మిత్రులు అంటున్నారు మమతా బెనర్జీకి సారధ్యం చేపట్టాలని ఉంది.
దాంతో ఆమెకు బాధ్యతలు అప్పగించమని అంతా కోరుతున్నారు. ఢిల్లీ ఎన్నికల తరువాత ఇండియా కూటమిలో కీలక మార్పులు జరిగే అవకాశాలను కూడా ఎవరూ కొట్టిపారేయడం లేదు. అదే సమయంలో కాంగ్రెస్ నుంచి సారథ్య బాధ్యతలు తీసుకునే అవకాశాలు కూడా ఎక్కువ అవుతాయి అంటున్నారు. అపుడు కాంగ్రెస్ చూస్తూ ఊరుకుంటుందా లేక తమ పట్టుని నిలబెట్టుకుంటుందా అన్నది కూడా ఆసక్తికరమే. కాంగ్రెస్ నే సారధ్యం వహించాలని కోరే పార్టీలూ ఇండియా కూటమిలో ఉన్నాయి.
దాంతో కాంగ్రెస్ తో ఈ విషయంలో విభేదించే పార్టీలు వేరు పడతాయా ఇండియా కూటమిలో చిచ్చుకు ఆ మీదట చీలికకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దారి తీస్తాయా అన్నది ఇపుడు హాట్ టాపిక్ గా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.