Begin typing your search above and press return to search.

మూడోసారీ గుండుసున్నా.. మారని రాహుల్ వైఖరి

విషయం ఏదైనా కానీ ఒకసారి ఎదురుదెబ్బ తగిలినంతనే.. రెండో సారి ఆ దెబ్బ తగలకుండా జాగ్రత్త తీసుకోవటం తెలివైనోడు చేసే పని.

By:  Tupaki Desk   |   9 Feb 2025 5:15 AM GMT
మూడోసారీ గుండుసున్నా.. మారని రాహుల్ వైఖరి
X

విషయం ఏదైనా కానీ ఒకసారి ఎదురుదెబ్బ తగిలినంతనే.. రెండో సారి ఆ దెబ్బ తగలకుండా జాగ్రత్త తీసుకోవటం తెలివైనోడు చేసే పని. అదేం సిత్రమో కానీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఒకటి కాదురెండుసార్లు కాదు.. ఎన్నిసార్లు ఎదురుదెబ్బలు తగిలినా.. పాఠాలు నేర్వని ఆయన తీరు చూస్తే.. ఇదేంది రాహుల్ భయ్యా? అని అనుకోకుండా ఉండలేం. సొంతబలాన్ని సరిగా మదింపు చేసుకోలేకపోవటమే కాంగ్రెస్ పార్టీని వేధిస్తునన అసలుసిసలు సమస్యగా చెప్పాలి. సొంత బలం తగ్గినప్పుడు.. మిత్రుల సహకారం తీసుకొని.. పుంజుకోవటం గతంలో చేసిన పని.

అలవాటైన ఆ పనిని ఫాలో కాకుండా..కొత్తగా.. భిన్నంగా ఏదో చేయాలన్న తీరుతో కాంగ్రెస్ కు వరుస ఓటములు మాత్రమే కాదు.. గుండు సున్నాలకు పరిమితం కావటం ఈ మధ్యన ఎక్కువైంది. ఢిల్లీ రాష్టానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవని దుస్థితి. ఒకప్పుడు ఢిల్లీ రాష్ట్రాన్ని మూడుసార్లు వరుస విజయాన్ని సాధించి.. హ్యాట్రిక్ ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన ఘన చరిత్ర ఉన్న పార్టీకి..తాజాగా ఎదురైన పరాభావం ఎలాంటిదన్నది ఇట్టే అర్థమవుతుంది.

1998 నుంచి పదిహేనేళ్ల పాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ పార్టీకి.. ఒక్కటంటే ఒక్క సీటు కోసం గెలుచుకోకపోవటం దేనికి నిదర్శనం? అన్నది ప్రశ్న. ఇక్కడో ఆసక్తికరమైన అంశాన్ని ప్రస్తావించాలి. గత ఎన్నికలతో పోలిస్తే తాజా ఎన్నికల్లో మెరుగైన ఓట్ల శాతాన్ని పార్టీ నమోదు చేసింది. కానీ.. ఖాతాను మాత్రం తెరవలేకపోయింది. అంటే.. ప్రజల్లో పార్టీ చచ్చిపోలేదు.కానీ.. పార్టీకి ఉండాల్సిన వ్యూహమే సరిగా లేదని చెప్పాలి. 2015, 2020లలో ఒక్క సీటు కూడా గెలవని కాంగ్రెస్.. ఈసారి ఎన్నికల్లో మాత్రం కనీసం పది స్థానాల్లో అయినా విజయం సాధించాలన్న లక్ష్యంతో పని చేసింది.

కానీ.. ఒంటరిగా కాకుండా అధికార ఆమ్ ఆద్మీపార్టీలో చేతులు కలిపి ఉంటే.. పరిస్థితి మాత్రం ఇప్పటి మాదిరి దారుణంగా మాత్రం ఉండేది కాదని మాత్రం చెప్పక తప్పదు. తాము కోరుకున్న సీట్లు ఇచ్చేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ నో చెప్పటంతో కాంగ్రెస్ ఒంటరిగా బరిలోకి దిగింది. ఇది రెండు పార్టీలకు నష్టం చేకూరేలా చేసిందని చెప్పాలి. ఎన్నికల్లో ప్రధాన పోటీ మొత్తం ఆమ్ ఆద్మీ వర్సెస్ బీజేపీ అన్నట్లు సాగింది. దీంతో కాంగ్రెస్ ను పట్టించుకున్నది లేదు.

ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకొని ఉన్న పక్షంలో కనీసం ఖాతా అయినా ఓపెన్ చేసేదని మాత్రం చెప్పక తప్పదు. 1998లో 52 స్థానాల్ని సొంతం చేసుకున్న పార్టీ.. 2003లో 47 స్థానాల్ని.. 2008లో 43 స్థానాల్లో విజయం సాధించి.. ముచ్చటగా మూడుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 2013లో జరిగిన ఎన్నికల్లో తొలిసారి సింగిల్ డిజిట్ సీట్ల (8)కు పరిమితైంది. ఆ తర్వాత 2015, 2020, తాజాగా (2025) మూడుసార్లు గుండుసున్నాలకు పరిమితమైంది. సరైన వ్యూహం లేకుంటే మరోసారి గుండుసున్నాకు పరిమితం కాక తప్పదు. ఈ సందర్భంగా కళ్లు తెరవాల్సింది.. పక్కా వ్యూహరచన చేయాల్సింది రాహుల్ గాంధీ మాత్రమేనని చెప్పకతప్పదు.