కర్నాటకలో సీఎం కుర్చీ కోసం ఆట మొదలైంది !
అయితే అధికారం చెరి సగం కాలానికి అని ఒక తెర వెనక ఒప్పందం కుదిరింది అన్న ప్రచారం కూడా సాగింది.
By: Tupaki Desk | 3 Feb 2025 4:30 PM GMTదక్షిణాదిన కర్ణాటకలో రెండేళ్ళ క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అలా బోణీ కొట్టి ఆ ప్రభావంతో తెలంగాణాలోనూ జెండా ఎగరేసింది. ఏడున్నర పదుల వయసు ఉన్న సిద్ధరామయ్యను కాంగ్రెస్ అధినాయకత్వం ముఖ్యమంత్రిగా చేసింది. అయితే ఆనాడు కాంగ్రెస్ పీసీసీ ప్రెసిడెంట్ గా డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పదవి కోసం చివరి దాకా పోటీ పడ్డారు. అయితే అధికారం చెరి సగం కాలానికి అని ఒక తెర వెనక ఒప్పందం కుదిరింది అన్న ప్రచారం కూడా సాగింది.
ఇక చూస్తే శివకుమార్ కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి కీలక శాఖలతో సమానమైన ప్రాధాన్యతను కల్పించారు. అయితే సిద్ధరామయ్య పదవీ కాలం ఈ నవంబర్ నాటికి రెండున్నరేళ్ళు పూర్తి అవుతుంది. దాంతో ఆ పదవిని డీకే శివకుమార్ కి ఇస్తారు అని ఆయన వర్గీయుల ప్రచారం జోరందుకుంది.
మరో వైపు డీకే వ్యతిరేక వర్గాలు కూడా కాంగ్రెస్ లో హడావుడి చేస్తున్నాయి. సిద్ధరామయ్యకు అనుకూలంగా ఉండే కొందరు మంత్రులు అయితే సిద్ధరామయ్య విషయంలో కాంగ్రెస్ అధినాయకత్వానికి ఫిర్యాదు చేయడానికి సిద్ధపడుతున్నారు. ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండకుండా తమ శాఖలలో జోక్యం చేసుకుంటున్నారు అని వారు ఆరోపిస్తున్నారు.
అంతటితో ఆగకుండా పీసీసీ చీఫ్ ఉప ముఖ్యమంత్రి ఒక్కరే సరిగ్గా నిర్వహించలేరని అందువల్ల ఆ పదవిని ఆయనకు కాకుండా వేరే వారికి ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నారు. ఇక డీకే అనుకూలురు ఒక వర్గంగా ఉంటే వ్యతిరేకులు మరో వర్గంగా ఉన్నారు. డీకే వ్యతిరేక వర్గానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పరోక్షంగా మద్దతు ఇస్తున్నారు అని కూడా ప్రచారం సాగుతోంది.
వరసబెట్టి డీకే వ్యతిరేకులు జరుపుతున్న విందు రాజకీయాలకు సిద్ధరామయ్య మద్దతు ఉందని డీకే వర్గీయులు అనుమానిస్తున్నారు. మొత్తం మీద చూస్తే కాంగ్రెస్ లో సీఎం కుర్చీలాట మొదలైంది అని అంటున్నారు. ఇక దానితో పాటుగా పీసీసీ చీఫ్ పదవి విషయంలోనూ పోటీ స్టార్ట్ చేశారు. ఆ పదవి మీద సహకార మంత్రి రాజణ్ణ, మరో మంత్రి సతీష్ జార్జి హోళీ కూడా కన్నేసి తమదైన శైలిలో పావులు కదుపుతున్నారు. ముందు పీసీసీ పీఠం అందుకుంటే వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కావచ్చు అన్నది వీరి ముందస్తు ఆలోచనగా చెబుతున్నారు.
ఇక లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటి అంటే కర్ణాటకు తదుపరి సీఎం గా డీకే శివకుమార్ బాధ్యతలు చేపడతారని ఆయన వర్గీయుడు అయిన హెచ్ సీ బాలక్రిష్ణ సంచలన వ్యాఖ్యలను చేశారు. సిద్ధరామయ్యతో సరిసమానంగా డీకే పార్టీని అధికారంలోకి తీసుకుని రావడానికి తన వంతుగా ఎంతో కృషి చేశారు అని ఆయన గుర్తు చేస్తున్నారు. ఆయన ఆయన రామనగర్ జిల్లా చెన్నపట్నంలో నిర్వహించిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేసి పార్టీలో ప్రభుత్వంలో చిచ్చు రాజేశారు అని అంటున్నారు. అయితే దీని మీద డీకే మీద తాము ఫిర్యాదు చేయబోతున్నట్లుగా మంత్రి రాజణ్ణ ప్రకటించడం విశేషం.
మరో వైపు ముఖ్యమంత్రి పదవి మీద డీకేకి పోటీగా మరి కొందరు తమ పేర్లను ముందు పెట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. పరమేశ్వర్, జార్జి హోళీ, మహాదేవప్ప తదితర కాంగ్రెస్ నేతలు విందు సమావేశాలు ఏర్పాటు చేయడం వెనక సీఎం పీఠం మీద గురి ఉందని అంటున్నారు. ఈ తరహా విందు సమావేశాలలో ఒకదానికి సీఎం హోదాలో సిద్ధరామయ్య కూడా హాజరై వారికి మద్దతుగా నిలవడం కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాల్లో సరికొత్త మలుపు అంటున్నారు విందు సమావేశాలు నిర్వహించడంలో తప్పు ఏముందని ఆయన అంటున్నారు.
ఇక డీకేకి వ్యతిరేకంగా దళిత సీఎం అన్న నినాదాన్ని కోరి వ్యతిరేక వర్గీయులు తీసుకుని వస్తున్నారు అని డీకే వర్గీయులు అంటున్నారు. మరో వైపు చూస్తే పర్యాటక శాఖ మంత్రి హెచ్ కే పాటిల్ కర్ణాటక తదుపరి సీఎం అని గదగలో ఇమ్మడి సిద్ధరామేశ్వరస్వామి జోస్యం చెప్పడంతో కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాలు మరింత వేడెక్కాయి.
కాంగ్రెస్ రాజకీయం ఇలా ఉంటే సిద్ధరాయ మీద ముడా కుంభకోణతో టార్గెట్ చేసిన ఆ రాష్ట్ర బీజేపీ ఇపుడు ఇరకాటంలో పడిపోయింది. ఈ కుంభకోణంలో సీఎం ఆయన కుటుంబ సభ్యుల పాత్ర లేదని లోకాయుక్త రిపోర్టు ఇవ్వడంతో కమలం ఖంగు తింది. ఇక కమల రాజకీయాలు సైతం కర్ణాటకలో ఏమంతా బాగా లేవు. మాజీ సీఎం యడ్యూరప్ప ఆయన వ్యతిరేక వర్గంగా సాగుతున్నాయి. కర్ణాటక బీజేపీ అధ్యక్ష పీఠం కాపాడుకునేందుకు బీవై విజయేంద్ర తన ప్రయత్నాలు చేస్తున్నారు.
మరో వైపు యడ్యూరప్పను ఆయన అనుచరులను దూరం చేస్తే బీజేపీకి నష్టమని ఆయన వర్గీయుడు అయిన ఎంపీ రేణుకాచార్య అంటున్నారు. అలాగే జనతాదళ్ ఎస్ లో రాష్ట్ర అధ్యక్ష పదవి యువనేత నిఖిల్ గౌడకు జాతీయ అధ్యక్ష పదవిని కేంద్ర మంత్రి కుమారస్వామికి అప్పగించాలని ఆ పార్టీ అధినాయకుడు దేవేగౌడ ప్రయత్నాలు చూస్తున్నారు. మొత్తానికి కర్ణాటకలో అన్ని పార్టీలలో రాజకీయం రసకందాయంలో ఉంది.