మాజీమంత్రులే కాదు.. ఆఫీసర్లూ బాధ్యులే... ఎవ్వరినీ వదలని కాంగ్రెస్
ఇప్పటికే చాలా వాటిలో విచారణ ముగింపు దశకు చేరుకున్నాయి. అయితే.. ఈ అవినీతి, అక్రమాల్లో కేవలం మాజీమంత్రులు, మాజీ నేతలే కాకుండా అధికారులు కూడా భాగం అవ్వడం ఆందోళన కలిగిస్తోంది.
By: Tupaki Desk | 31 Oct 2024 8:14 AM GMTకాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ధరణి, గొర్రెల స్కామ్, జీఎస్టీ స్కామ్... ఇలా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ పథకాలపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. వేలాది కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందే ఎన్నో సందర్భాల్లో ఆరోపణలు చేసింది. ఇక అధికారంలోకి వచ్చాక వాటన్నింటిపై విచారణలు చేయిస్తోంది.
ఇప్పటికే చాలా వాటిలో విచారణ ముగింపు దశకు చేరుకున్నాయి. అయితే.. ఈ అవినీతి, అక్రమాల్లో కేవలం మాజీమంత్రులు, మాజీ నేతలే కాకుండా అధికారులు కూడా భాగం అవ్వడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో చాలా మంది ఐఏఎస్ అధికారులు, ఇంజినీరింగ్ అధికారులు విచారణలు ఎదుర్కొన్నారు. ఇంకా వారి విచారణ కొనసాగుతూనే ఉంది. లక్ష కోట్లతో చేపట్టిన ప్రాజెక్టుకు డ్యామేజీ ఏర్పడడంతో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. దాంతో కాళేశ్వరం నిర్మాణంలో భాగస్వాములైన వారందరినీ ఒక్కొక్కరుగా విచారిస్తోంది. ప్రధానం ఈఎన్సీని విచారించిన కమిషన్.. పలు కీలక అంశాలను రాబట్టింది. అయితే.. అధికారులు మాత్రం గత ప్రభుత్వంలోని పెద్దలు చెప్పినట్లుగానే తాము ఫాలో అయ్యామని విచారణ సందర్భంలో చెబుతున్నారు.
మరోవైపు.. ధరణి, గొర్రెల స్కామ్, జీఎస్టీ స్కామ్‌లో కూడా అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ప్రధానంగా జీఎస్టీ స్కామ్‌లో అయితే మాజీ సీఎస్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దొంగ బిల్లులతో వేలాది కోట్ల రూపాయలు పక్కదారి పట్టించారని ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంలో సీఐడీ విచారణ చేస్తోంది. ఇక ధరణిలోని లోపాల్లోనూ పలువురు ఐఏఎస్ అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చాలా మంది ధరణి లొసుగులను అలుసుగా తీసుకొని భూములను ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్లు చేసి అక్రమంగా సంపాదనకు పోయారని రెవెన్యూ శాఖపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. దాంతో ధరణిలోనూ అధికారుల ప్రమేయం ఉన్నట్లు నిర్ధారణ అయింది.
ఇక ఇటీవల ఫార్ములా ఈ-కారు రేసులో కూడా రూ.55 కోట్ల గోల్‌మాల్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే.. ఇందులోనూ ఓ మాజీ ఐఏఎస్ అధికారి కీ రోల్ పోషించడం గమనార్హం. ఆ అధికారి చెప్పడం వల్లే ఆర్థిక శాఖ అనుమతి లేకున్నా జీహెచ్ఎంసీ నుంచి రూ.55 కోట్లు డ్రా చేశారు. అయితే.. తాను కూడా అప్పటి మంత్రి ఆదేశాల ప్రకారమే నడుచుకున్నానని ఆ అధికారి చెబుతున్నారు. దాంతో ఈ కేసులోనూ ఓ సీనియర్ అధికారి ఇరుక్కున్నారు.
అలాగే.. రంగారెడ్డి జిల్లాలో మొన్నటివరకు కలెక్టర్‌గా పనిచేసిన ఐఏఎస్ అధికారి సైతం భూములను అక్రమంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులను బదలాయించారంటూ ఆరోపణలు ఉన్నాయి. స్వయంగా ఆ జిల్లాలోని కొండాపూర్ గ్రామ ప్రజలు ఆయనపై ఈడీకి ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. ఆయనతో పాటు మరో ఇద్దరు సీనియర్ ఐఏఎస్‌ల మీద కూడా వారు కంప్లయింట్ ఇచ్చారు. దాంతో ఈ కేసు కూడా సంచలనంగా మారింది. ఇప్పటికే విచారణలు ఎదుర్కొంటున్న వీరు.. ఇప్పుడు ఈడీ విచారణకు కూడా సిద్ధం కావాల్సి వచ్చింది. ఇలా.. ఏ కేసులో చూసినా అధికారుల పేర్లు వెలుగులోకి వస్తుండడంతో గత ప్రభుత్వంలో అసలు పాలన ఏ విధంగా జరిగిందో అర్థం చేసుకోక తప్పదు.