Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ పెరుగుతోంది...సీటు జారుతోందా ?

ఇండియా కూటమి కట్టి కాంగ్రెస్ భారీగా రాజకీయ లబ్దిని పొందుతోంది.

By:  Tupaki Desk   |   6 Oct 2024 4:43 PM GMT
కాంగ్రెస్ పెరుగుతోంది...సీటు జారుతోందా ?
X

దేశంలో కాంగ్రెస్ పెరుగుతోంది. ఎవరు ఏ సర్వేలు చేయకుండానే ఏ రకమైన జోస్యం చెప్పకుండానే ఈసారి దేశంలో ఎపుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తుంది అన్నది అందరి నోటా వినిపిస్తున్న మాట. ఇండియా కూటమి కట్టి కాంగ్రెస్ భారీగా రాజకీయ లబ్దిని పొందుతోంది. అది ఎప్పటికపుడు మరింతగా బలపడుతోంది.

కాంగ్రెస్ ఉత్తరాదిన పోగొట్టుకున్న చోటనే జెండా పాతుతోంది. దాంతో ఇపుడు తెలుగు రాజకీయాల్లో కూడా కాంగ్రెస్ పాత్ర అమాంతం పెరుగుతుంది అని అంటున్నారు. తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోనే ఉంది. కర్ణాటకలో పవర్ లోకి వచ్చింది. కేరళలో లోక్ సభ ఎన్నికల్లో బెటర్ పొజిషన్ లోకి వచ్చి మెజారిటీ ఎంపీ సీట్లు గెలుచుకుంది. తమిళనాడులో డీఎంకే స్టాలిన్ తో కలసి బాగానే సీట్లు సంపాదించుకుంది.

ఇక మొత్తం దక్షిణాదిన చూస్తే ఏపీ మీదనే కాంగ్రెస్ కన్ను ఉంది. దేశంలో రాజకీయం మారితే దాని ప్రభావం కచ్చితంగా ఏపీ మీద కూడా ఉంటుందన్న విశ్లేషణలు ఉన్నాయి. ఏపీ ఒకనాడు కాంగ్రెస్ కి కంచుకోట. ఇపుడు దేశవ్యాప్తంగా జనాల అభిప్రాయాలు మారినపుడు ఏపీ కూడా దానికి అనుగుణంగా స్పందిస్తుంది అన్నది కూడా ఉంది.

మరో వైపు చూస్తే 2029 నాటికి కేంద్రంలో కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఏపీలో కూడా ఎంతో కొంత పుంజుకుంటుంది అన్నది కూడా ఉంది. ఇక కాంగ్రెస్ ఎదుగుతోంది అంటే ఏపీలో కూడా కొత్త మిత్రులు దొరుకుతారు అన్న ఆశలు ఉన్నాయని అంటున్నారు.

ఇక కాంగ్రెస్ కి మంచి రోజులు వస్తే ఏపీలోని సీనియర్లకు కూడా పొలిటికల్ గా అకామిడేషన్ దొరుకుతుంది అన్న చర్చ కూడా ఉంది. ఈ క్రమంలో ఏపీలో మళ్ళీ సీనియర్లు చురుకుగా స్పందిస్తున్నారు. కాంగ్రెస్ కే భవిష్యత్తు ఉందని వారు అంటున్నారు. కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ లాంటి వారు కాంగ్రెస్ దే రేపటి రోజులు అని ధీమాగా చెబుతున్నారు.

ఈ పరిణామాల నేపధ్యంలో ఏపీలో కాంగ్రెస్ పీఠం మీద కూడా చాలా మంది సీనియర్ల కన్ను పడింది అని అంటున్నారు. గతంలో పీసీసీ చీఫ్ పదవి మాకు వద్దు అని చెప్పిన వారు సైతం ఇపుడు కావాలని అంటున్నారు. దానికి జాతీయ స్థాయిలో మారిన రాజకీయమే అని అంటున్నారు.

ఏపీలో కాంగ్రెస్ కి సీనియర్లకు కొదవ లేదు. అంతా దశాబ్దాలుగా అనుభవం గడించిన వారే. అందరూ అనేక పదవులు పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా చేపట్టి పండిన వారే. ఇపుడు వారిలో చాలా మంది పీసీసీ చీఫ్ కోసం రేసులోకి వస్తున్నారు అని అంటున్నారు.

కాంగ్రెస్ కూడా తొందరలోనే బలహీనంగా ఉన్న చోట్ల సంస్థాగతంగా మార్పులు చేస్తుంది అని అంటున్నారు. ఇక ఏపీలో చూస్తే షర్మిల పీసీసీ చీఫ్ అయి తొమ్మిది నెలలు అయ్యాయి. ఆమె బాధ్యతలు చేపట్టిన కొత్తల్లో పార్టీకి జోష్ వచ్చింది. అయితే ఆ తరువాత ఊపు కనిపించడం లేదు అన్న చర్చ ఉంది.

వైసీపీ అధికారంలో ఉన్నపుడు షర్మిల ప్రత్యర్ధిగా ఉంటూ గడగడలాడించారు. అయితే ఇపుడు జగన్ విపక్షంలోకి వచ్చేశారు. ఆయనను అధిగమించేలా విపక్షం పాత్ర కాంగ్రెస్ పోషించాల్సి ఉంటుంది. అలా చేయాలీ అంటే టీడీపీ కూటమి మీద విమర్శలు చేయాలి. అవసరం అయితే ఉద్యమాలు చేయాలి.

పార్టీలోని సీనియర్లను కలుపుకుని పోవాలి. అయితే ఆమె గత నాలుగు నెలల విపక్ష పాత్రలో చేయాల్సింది చేస్తున్నారు కానీ పెద్దగా ప్రొజెక్ట్ కావడం లేదు అని అంటున్నారు. దాంతో పాటు సీనియర్లు కూడా తమను కలుపుకుని పోవడం లేదని ఫీల్ అవుతున్నారు అని అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో సీనియర్ నేతలలో ఒకరికి బాధ్యతలు అప్పగించాలన్న డిమాండూ ఉంది అని అంటున్నారు.

ఇక్కడ షర్మిల కాదు సమస్య. కాంగ్రెస్ ఎదుగుతోంది కాబట్టి పీసీసీ పీఠం అందుకోవాలన్నదే ఆలోచన అని కూడా అంటున్నారు. మరి రానున్న నెలలలో రాహుల్ గాంధీ ఏపీ టూర్ ఉంటుందని అంటున్నారు. ఆయన వచ్చి వెళ్ళాక ఏమైనా మార్పులు ఉంటాయా లేక షర్మిలతో పాటు ఇతర సీనియర్లకు కూడా సముచితమైన బాధ్యతలు అప్పగించి కాంగ్రెస్ ని ఇంకా పటిష్టం చేస్తారా అన్నది చూడాల్సి ఉంది అంటున్నారు.