Begin typing your search above and press return to search.

వైసీపీలోకి కాంగ్రెస్ మాజీ మంత్రి...?

ఉమ్మడి అనంతపురం జిల్లా శింగనమలలో 2024 ఎన్నికల్లో అనూహ్యంగా టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులుకి జగన్ టికెట్ కేటాయించారు.

By:  Tupaki Desk   |   9 Dec 2024 3:52 AM GMT
వైసీపీలోకి కాంగ్రెస్ మాజీ మంత్రి...?
X

ఉమ్మడి అనంతపురం జిల్లా శింగనమలలో 2024 ఎన్నికల్లో అనూహ్యంగా టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులుకి జగన్ టికెట్ కేటాయించారు. దీని మీద అతి పెద్ద చర్చ సాగింది. ఆనాడు ఎన్నికల్లో ఇదే అంశాన్ని అప్పటి ప్రతిపక్షాలు కూడా లేవనెత్తాయి. దాంతో డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని వైసీపీ రివర్స్ లో ఎటాక్ చేసి ఆయన చదువుకున్న విద్యావంతుడని అందుకే టికెట్ ఇచ్చామని చెప్పుకుంది.

ఇక్కడ 2019 ఎన్నికల్లో జొన్నలగడ్డ పద్మావతికి టికెట్ ఇస్తే వైసీపీ నుంచి ఆమె ఎమ్మెల్యే అయ్యారు. అయితే 2024లో మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే పట్ల వ్యతిరేకత ఉందని భావించి జగన్ ఈ కొత్త ప్రయోగం చేశారు. రాజకీయాలకు కొత్త అయిన టిప్పర్ డ్రైవర్ కి టికెట్ ఇచ్చి గెలిపిద్దామనుకున్నారు. కానీ కూటమి ప్రభంజనంలో సీన్ రివర్స్ అయింది.

ఇక ఎన్నికలు అయిన ఆరు నెలల తరువాత ఇపుడు వరసబెట్టి జగన్ వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలలో కొత్త ఇంచార్జిలను నియమిస్తున్నారు. ఆ విధంగా చూస్తే కనుక శింగనమలలో కూడా కొత్త ఇంచార్జి వైసీపీ నుంచి వస్తారు అని అంటున్నారు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కోవాలీ అంటే బలమైన అభ్యర్ధిని దించాలని జగన్ ఆలోచిస్తున్నారు అని చెబుతున్నారు.

ఎందుకంటే వీరాంజనేయులు మంచి వారు అయినా ఆర్ధికంగా స్తోమత తగినంత లేని వారు అని అంటున్నారు. అందుకే ఆయన ప్లేస్ లో స్ట్రాంగ్ లీడర్ కోసం వైసీపీ అధినాయకత్వం దృష్టి పెట్టింది అని అంటున్నారు. అయితే నియోజకవర్గంలో జరుగుతున్న ప్రచారం బట్టి చూస్తే కనుక మాజీ మంత్రి సాకే శైలజానాధ్ ని వైసీపీలోకి ఆహ్వానించి ఆయనకు ఈ బాధ్యతలు అప్పగిస్తారు అని అంటున్నారు.

ఇది నిజంగా నియోజకవర్గంలోనే కాదు ఏపీలోనే కొత్త షాక్ ఇచ్చే వార్తగానే చూస్తున్నారు. కాంగ్రెస్ నుంచి మంచి పేరున్న నేతగా శైలజానాథ్ కి గుర్తింపు ఉంది. ఆయన వైసీపీలో చేరుతారు అంటే అది కచ్చితంగా ఆ పార్టీకి ప్లస్ పాయింట్ అవుతుంది. గతంలోనూ ఈ తరహా పుకార్లు వచ్చినా వర్కౌట్ కాలేదు. కానీ ఈసారి మాత్రం శైలజనాధ్ వైసీపీలో చేరుతారు అని అంటున్నారు.

ఈ ప్రచారంలో కనుక నిజం ఉంటే మాత్రం జనవరి నెలలో సాకే శైలజానాధ్ వైసీపీ తీర్ధం పుచ్చుకుంటారు అని అంటున్నారు. మరి సాకే కనుక శింగనమల అసెంబ్లీ నియోజకవర్గం బాధ్యతలు స్వీకరిస్తే కచ్చితంగా అది ఫ్యాన్ పార్టీకి ఊపు తెచ్చేందుకు వీలు అవుతుందని టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణిని ధీటుగా ఎదుర్కొనేందుకు ఉపకరిస్తుందని అంటున్నారు.