ఎమ్మెల్యేలు Vs మంత్రులు.. దక్షిణ తెలంగాణ మంత్రిపై గుస్సా!
స్థానిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో పార్టీలో నేతల మధ్య విభేదాలు మంచివికావని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు.
By: Tupaki Desk | 7 Feb 2025 7:30 PM GMTతెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు అంతులేని టీవీ సీరియల్స్ ను తలపిస్తున్నాయి. రోజుకో ఇష్యూతో ఎమ్మెల్యేలు రోడ్డెక్కుతుండటం రాష్ట్ర పార్టీకి, ప్రభుత్వాధినేతలకు తలనొప్పిగా మారుతోందని చెబుతున్నారు. ముఖ్యంగా గత వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఎటు దారితీస్తాయోనన్న టెన్షన్ ఆ పార్టీలో కనిపిస్తోందంటున్నారు. స్థానిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో పార్టీలో నేతల మధ్య విభేదాలు మంచివికావని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు.
ఎన్నో పోరాటాలు.. మరెన్నో త్యాగాల తరువాత.. లేకలేక వచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోడానికి కాంగ్రెస్ నేతలు ఆపసోపాలు పడుతున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పార్టీలో ఎమ్మెల్యేలు, మంత్రులు అనుసరిస్తున్న తీరు కార్యకర్తలకు రుచించడం లేదని చెబుతున్నారు. దాదాపు ప్రతి చోట ఎమ్మెల్యేలు, మంత్రులకు మధ్య సమన్వయం ఉండటం లేదని ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా దక్షిణ తెలంగాణకు చెందిన ఓ మంత్రి తీరుపై ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. ఆయన రాష్ట్రంలోని ఇతర మంత్రులను కూడా పట్టించుకోవడం లేదని అంటున్నారు. నేరుగా ఢిల్లీ హైకమాండ్ తోనే మాట్లాడుతూ తన పని చేసుకుపోతున్నారని, మిగిలిన వారిని లెక్క చేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ మధ్య రహస్యంగా ఎమ్మెల్యేలు సమావేశమైనట్లు చెబుతున్నారు. ఆ పది మంది సమావేశం తర్వాత మిగిలిన ఎమ్మెల్యేలు కూడా సదరు మంత్రి తీరును జీర్ణించుకోలేకపోతున్నామని పార్టీ నేతల వద్ద వాపోతున్నారని ప్రచారం జరుగుతోంది.
గత ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చిన సదరు మంత్రి.. ప్రభుత్వ వ్యవహారాలు, పార్టీ కార్యక్రమాలు ఏదైనా సరే స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారని, మిగతా వారితో పనిలేదన్నట్లు వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యేలు మండిపడుతున్నట్లు చెబుతున్నారు. ఆయన జిల్లాలో ఒకరిద్దరితో తప్ప మిగిలిన ఎమ్మెల్యేలు ఎవరితోనూ పెద్దగా సంబంధాలు కొనసాగించడం లేదని అంటున్నారు. తన వ్యాపారాలు, తన రాజకీయ భవిష్యత్తే ముఖ్యమన్నట్లు ఆ మంత్రి వ్యవహరిస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఇక మిగిలిన మంత్రులు కూడా ఇదే దారిలో పయనిస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తం 11 మంది మంత్రుల్లో ఏ ఒక్కరిపైనా ఎమ్మెల్యేల్లో సానుకూల అభిప్రాయం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కొక్కరితో ఒక్కో సమస్య ఎదురవుతోందని అంటున్నారు. దీంతో ఎమ్మెల్యేలు కూడా మంత్రులతో సంప్రదించకుండా తమ స్థాయిలో పనులు చేయించుకుంటున్నారని తెలుస్తోంది. అయితే దీనికంతటికీ పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం లేకపోవడం ఓ కారణంగా చెబుతున్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుత పరిస్థితులు కార్యకర్తలను టెన్షన్ పెడుతున్నాయి.