Begin typing your search above and press return to search.

కేటీఆర్ కారుపై దాడికి యత్నం

తెలంగాణలో హైడ్రా కూల్చివేతలు రాజకీయ దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   1 Oct 2024 8:02 AM GMT
కేటీఆర్ కారుపై దాడికి యత్నం
X

తెలంగాణలో హైడ్రా కూల్చివేతలు రాజకీయ దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ కూల్చివేతలపై హైకోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. అయినా సరే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం దూకుడు తగ్గించడం లేదు. ఈ క్రమంలోనే మూసీ నది ప్రక్షాళనకూ కాంగ్రెస్ సర్కార్ రెడీ అయింది. మూసా నగర్ లోని రివర్ బెడ్ లోని నిర్మాణాల కూల్చివేత ఈ రోజు చేపట్టింది. ఈ క్రమంలోనే అంబర్ పేట పరిధిలోని మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలతో మాజీ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఆ సందర్భంగా కేటీఆర్ కారును కాంగ్రెస్ నేతలు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

రేవంత్ కాదు..ఆయన తాత వచ్చినా ఏం చేయలేరు అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేటీఆర్ కారుపై ఎక్కి అడ్డుకున్నారు. కేటీఆర్ కారు బ్యానెట్ పై ఎక్కిన కాంగ్రెస్ కార్యకర్తలు కారుపై దాడికి యత్నించారు. కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ వారు నినాదాలు చేశారు. మంత్రి కొండా సురేఖకు క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే వారిని పోలీసులు అడ్డుకోవడంతో గొడవ సద్దుమణిగింది.

అంబర్ పేటలో పర్యటించిన కేటీఆర్...ఏ బుల్డోజర్ వచ్చినా అందరూ కలిసి అడ్డుకోవాలని, ఎక్కడకు వెళ్లకుండా అక్కడే ఉండాలని సూచించారు. ఇంటిని కూల్చడానికి వచ్చే బుల్డోజర్ ను బొందపెట్టాలని పిలుపునిచ్చారు. దసరా పండుగను పేదలు సంతోషంగా జరుపుకోలేనిని దుస్థితిని రేవంత్ రెడ్డి తీసుకువచ్చారని కేటీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్ లో ఒక్క ఓటు కూడా రాలేదని ఇక్కడ ప్రజల బ్రతుకులను రేవంత్ రెడ్డి ఆగం చేస్తున్నాడని కేటీఆర్ ఆరోపించారు.

6 గ్యారెంటీలలో ఏమీ అమలు చేయలేదని, తులం బంగారం అని ఇనుము కూడా ఇవ్వలేదని, పెన్షన్లు 4 వేల రూపాయలకు పెంచుతానని ఇంకా అమలు చేయలేదని విమర్శించారు. మూసీలో దోచుకో ఢిల్లీలో పంచిపెట్టు అన్న రీతిలో కొత్త దుకాణం తెరిచాడని రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. పేదల ఇళ్లు కూల్చి ఎవరికి దోచిపెడుతున్నారని కేటీఆర్ నిలదీశారు. పేదల ఇళ్లు కూల్చాలని ఇందిరమ్మ చెప్పిందా సోనియమ్మ చెప్పిందా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు మూసీ నది ప్రక్షాళన అంటూ 50 వేల కోట్ల రూపాయలు దోచుకునేందుకు రేవంత్ రెడ్డి చూస్తున్నాడని కేటీఆర్ ఆరోపించారు.