కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. గ్రామ సభలో ఎమ్మెల్యేపై దాడి
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్న సమయంలో కొందరు కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు కౌశిక్ రెడ్డి పైకి టమోటాలను విసిరారు.
By: Tupaki Desk | 24 Jan 2025 10:32 AM GMTభారతీయ రాష్ట్ర సమితికి చెందిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కొందరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టమోటాలతో దాడికి పాల్పడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం హనుమకొండ జిల్లా కమలాపూర్ లో గ్రామసభను నిర్వహించారు. ఈ సభలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి భారతీయ రాష్ట్ర సమితికి చెందిన కార్యకర్తలతో కలిసి వచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్న సమయంలో కొందరు కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు కౌశిక్ రెడ్డి పైకి టమోటాలను విసిరారు. వెంటనే అప్రమత్తమైన బిఆర్ఎస్ శ్రేణులు ఎమ్మెల్యేకు రక్షణగా నిలిచారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై భారతీయ రాష్ట్ర సమితి కార్యకర్తలు కుర్చీలు విసిరారు. ఇరువర్గాలు పోటా పోటీగా నినాదాలు చేయడంతో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు భారీగా అక్కడకు చేరుకొని బందోబస్తు నిర్వహించారు. ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేయడంతో పాటు నాయకులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.
కమలాపూర్‌లో నిర్వహించిన గ్రామ సభకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కార్యకర్తలతో సహా హాజరయ్యారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గ్రామసభలో ఇందిరమ్మ ఇళ్ల జాబితాను అధికారులు వెల్లడించడంతో దానిపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ అధికారులపై ప్రశ్నలు కురిపించారు. అక్కడే ఉన్న కాంగ్రెస్ నేతలు కౌశిక్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఎంతమందికి ఇల్లు ఇచ్చారు అని ప్రశ్నించారు. గతంలో ప్రశ్నించని వాళ్లు ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తున్నారంటూ ఎమ్మెల్యే అని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగా గ్రామసభలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
ఈ సమయంలోనే కొందరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కౌశిక్ రెడ్డి పై టమోటాలు విసిరారు. దీంతో కౌశిక్ రెడ్డి వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా తీవ్రంగానే స్పందించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై కుర్చీలను విసిరేయడంతో ఒక్కసారిగా అలజడి వాతావరణం నెలకొంది. పరిస్థితి అదుపు తప్పుతోందనుకుంటున్న తరుణంలో పోలీసులు భారీ సంఖ్యలో ఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. నాయకులకు కూడా సర్ది చెప్పి గొడవను శాంతింప చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు అయింది. ఇరువర్గాలు వెనక్కి వెళుతున్న సమయంలో పెద్ద ఎత్తున నినాదాలు చేసుకుంటూ వెళ్లారు. ఈ ఘటన ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంసంగా మారింది.