షర్మిల `వద్దు`.. కాంగ్రెస్ నేతల గుసగుస.. !
కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విషయంపై కాంగ్రెస్ నాయకులు తలోమాట మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఈ ఏడాది జరిగిన ఎన్నికల తర్వాత.. పార్టీకి ఎలాంటి మార్కులు పడలేదు.
By: Tupaki Desk | 3 Oct 2024 5:30 AM GMTకాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విషయంపై కాంగ్రెస్ నాయకులు తలోమాట మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఈ ఏడాది జరిగిన ఎన్నికల తర్వాత.. పార్టీకి ఎలాంటి మార్కులు పడలేదు. షర్మిల రాకతో పెరిగిన ఓటు బ్యాంకు కూడా లేదు. దీంతో ఎన్నికలకు ముందున్న జోష్ కాంగ్రెస్‌లో పెద్దగా కనిపించలేదు. అప్ప ట్లో నాయకులు షర్మిల చుట్టూ తిరిగారు. ఆమె వస్తే చాలు.. దర్శనం ఇస్తే చాలు అన్నట్టుగా వ్యవహరించారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు.
ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్లకు కేరాఫ్. అలాంటి రెడ్లు కూడా ఇప్పుడు షర్మిల `వద్దు` అనే మాట వినిపిస్తుండడం గమనార్హం. ఇటీవల రెండు మాసాలుగా అంతర్గత చర్చల్లోనూ షర్మిలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సరే.. ఇదంతా పోసుగోలు అని షర్మిల బ్యాచ్ కొట్టేసినా.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను తాజాగా సీనియర్ నాయకుడు, మాజీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అధిష్టానానికి లేఖ రూపంలో రాసుకొచ్చారు.
`షర్మిల` అజెండాను గమనించండి! అని ఆయన పేర్కొన్నట్టు పార్టీలో చర్చగా మారింది. నిజానికి పార్టీ ఓటు బ్యాంకు పెరగాల్సిన సమయం ఇదేనన్నది సీనియర్లు చెబుతున్న మాట. వచ్చే ఏడాదిన్నరలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రజలను మోటివేట్ చేసేలా ఎలాంటి కార్య క్రమాలకు ఆమె దిగడం లేదన్నది సీనియర్లు చెబుతున్న మాట. తనకు నచ్చిన రీతిలో అజెండాను రూపొందించుకుంటున్నారన్న వాదనను వీరు ఆది నుంచి వినిపిస్తున్నారు.
ఇక, ఇప్పుడు కూడా అదే అజెండాతో ముందుకు సాగుతున్నారని విజయవాడ నాయకులు కూడా తాజాగా అభిప్రాయపడుతున్నారు. ఇలా అయితే.. మరో పదేళ్లకు కూడా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు పెరగదని చెబుతున్నారు. ``అధిష్టానం అన్నీ గమనిస్తున్నట్టు మేం భావిస్తున్నాం. కానీ, ఇలాంటి పద్ధతి కరెక్ట్ కాదు`` అని విజయవాడకు చెందిన కాంగ్రెస్ ముఖ్య నాయకుడు మీడియా ముందే అనేశారు. తాజాగా విశాఖలో ఉక్కు కార్మికులకు మద్దతుగా షర్మిల వెళ్లిన విషయం తమకు తెలియదని ఆయన చెప్పారు. ఇలా అయితే.. పార్టీలో ఐక్యత లోపిస్తుందన్నది ఆయన ఆవేదనగా ఉంది.