వెలమ సామాజికవర్గంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వెలమ సామాజిక వర్గంపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు.
By: Tupaki Desk | 7 Dec 2024 7:25 AM GMTకాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి నేటితో ఏడాది పూర్తిచేసుకుంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగానూ సంబరాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వెలమలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై వారంతా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వెలమ సామాజిక వర్గంపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. పరుష పదజాలంతో వారిని దూషించారు. దీంతో ఆయనపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వెలమ సామాజికవర్గం భగ్గుమన్నది. తమ కులంపై పరుషంగా మాట్లాడిన శంకర్‌ను వెంటనే ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్ (ఐవా) సైతం డిమాండ్ చేసింది.
వెలమ సామాజికకవర్గంపై శంకర్ చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్ అయింది. ఆ వీడియోలో తాను ఓ శాసనసభ్యుడిని అనే విషయాన్ని మరిచి ఓ వర్గాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఐవా మండిపడింది. ప్రధానంగా వీడియోలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి. ‘వెలమల్లారా.. మిమ్మల్ని చంపి తీరుతాం.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తెలియకుండా వెలమల అంతుచూస్తాం. కాంగ్రెస్‌లో బలమైన నాయకులం ఉన్నాం. మేం బయటకొస్తే ఒక్కొక్కరి వీపు విమానాల మోత మోగుతాయి. వెలమల పని పక్కా పడుతాం. ఇంకా ఎక్కువ చేస్తే డైరెక్టుగా చెప్తున్నా.. షాద్‌నగర్ ఎమ్మెల్యేగా నేనే డైరెక్టుగా వెలమలపై భౌతికదాడులకు దిగుతా..’ అంటూ హెచ్చరించారు.
ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న ఐవా శుక్రవారం దోమలగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. శంకర్‌పై విచారణ జరిపి, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు హిమాయత్‌నగర్‌లోని ఐవా కార్యాలయంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు నీలగిరి దివాకర్‌రావు, తాండ్ర శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. శంకర్ వాడిన భాషతో వెలమ సామాజికవర్గ మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు. తమను కొడుతామంటూ ఎమ్మెల్యే శంకర్ సవాల్ చేశారని, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా ఉండి.. రౌడీయిజం చేస్తున్నాడా అని నిలదీశారు. మరోవైపు.. శంకర్ వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సైతం ఖండించారు.