Begin typing your search above and press return to search.

వారికి టికెట్లు ఇచ్చుడు లేదు.. కాంగ్రెస్ కార్యకర్తలకు ఎమ్మెల్యే షాక్

తెలంగాణ రాష్ట్రం ఓ వైపు బతుకమ్మతో.. మరోవైపు గాంధీ జయంతితో పండుగ వాతావరణంలో ఉంది.

By:  Tupaki Desk   |   2 Oct 2024 11:24 AM GMT
వారికి టికెట్లు ఇచ్చుడు లేదు.. కాంగ్రెస్ కార్యకర్తలకు ఎమ్మెల్యే షాక్
X

తెలంగాణ రాష్ట్రం ఓ వైపు బతుకమ్మతో.. మరోవైపు గాంధీ జయంతితో పండుగ వాతావరణంలో ఉంది. ఒకేరోజు రెండు వేడుకలు రావడంతో రాష్ట్రంలో హడావిడి పరిస్థితి కనిపిస్తోంది. బతుకమ్మ కోసం మహిళలంతా రెడీ అవుతుండగా.. ప్రముఖులు, ప్రజాప్రతినిధులు గాంధీకి నివాళి అర్పించే పనిలో ఉండిపోయారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా కార్యకర్తల్లో చర్చకు దారితీశాయి.

కొక్కిరాల ప్రేమ్‌సాగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మంచిర్యాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయన ఎమ్మెల్సీగా పనిచేశారు. ఎన్నికల వేళ ఎంతో మంది నేతల నుంచి సొంత పార్టీలోనే పోటీని ఎదుర్కొన్నారు ఆయన. చివరకు పార్టీ టికెట్‌ను దక్కించుకున్నారు. చివరి వరకు కొనసాగిన ఉత్కంఠలో చివరకు ప్రేమ్‌సాగర్‌రావునే టికెట్ వరించింది. దాంతో ఆయన అసెంబ్లీ బరిలో నిలిచారు. గెలుపొందాక.. అసెంబ్లీ ఎన్నికల హామీల వేళ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నారు. అందులోభాగంగా మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీలలో ప్రతిరోజూ స్వచ్ఛనీరు ఇస్తానని ఇచ్చిన మాటకు కట్టుబడి.. ఆ పథకాన్ని ప్రారంభించారు. అలా ఒక్కొక్కటిగా హామీలను అమలు చేస్తున్నారు. అయితే.. ఈ రోజు గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన స్థానిక సంస్థల ఎన్నికలపై సంచలన నిర్ణయం తీసుకున్నారు.

మంచిర్యాల నియోజకవర్గం పరిధిలోని దండేపల్లిలో ఇటీవల ఇకపై మద్యపానం తీసుకోబోమంటూ అక్కడి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతిజ్ఞ చేశారు. గాంధీజీ కన్న కలలు సాకారం చేయడానికి మద్యానికి దూరంగా ఉంటామని వారు నిర్ణయించుకొని ప్రతిజ్ఞ చేశారు. ఆదర్శంగా జీవిస్తామని చెప్పారు. కక్షలు, గొడవలు లేకుండా ప్రశాంత జీవితం గడుపుతామని మాట ఇచ్చారు. అయితే.. వారందరికీ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ షాక్‌నిచ్చే న్యూస్ చెప్పారు. ఎమ్మెల్యే మాటలతో కార్యకర్తలంతా ఏం చేయాలో తోచక అయోమయంలో పడ్డారు.

దండేపల్లి కార్యకర్తలు మద్యపానానికి దూరంగా ఉండడాన్ని స్వాగతించిన ఎమ్మెల్యే.. ఆ ప్రతిజ్ఞను కనుక ఉల్లంఘిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వబోమని ఖరాఖండిగా చెప్పారు. అలాగే.. భవిష్యత్తులోనూ ఏ పదవులు ఇచ్చేది లేదని తెలిపారు. ఎమ్మెల్యే ఒక్కసారిగా అలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఆ కార్యకర్తలంతా ఒక్కసారిగా నాలుక కరుచుకున్నారని సమాచారం. గొప్పలకు పోయి ప్రతిజ్ఞ కానీ చేశామని వారిలో వారే గుసగుసలాడుకుంటున్నట్లు కనిపించింది.