16 మంది ఎమ్మెల్యేలను మలుపుకోవడం ఎలా ?
ఈ నేపథ్యంలోనే పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల క్రిష్ణమోహన్ రెడ్డి యూటర్న్ తీసుకోగా ఆయనను మళ్లీ పార్టీలోకి తీసుకువచ్చారు.
By: Tupaki Desk | 13 Sep 2024 5:10 AM GMTతెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నుండి 26 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని, బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకుని ప్రతిపక్ష పార్టీ లేకుండా చేసుకోవాలన్న పట్టుదలతో సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించాడు. లోక్ సభ ఎన్నికలకు ముందు, ఎన్నికల తరువాత మొత్తంగా 10 మంది ఎమ్మెల్యేలను ఆకర్షించగలిగారు.
ఈ నేపథ్యంలోనే పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల క్రిష్ణమోహన్ రెడ్డి యూటర్న్ తీసుకోగా ఆయనను మళ్లీ పార్టీలోకి తీసుకువచ్చారు. మరో 16 మంది ఎమ్మెల్యేలను మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు ఫలించడం లేదు. పార్టీలో చేరిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి క్యాబినెట్ హోదాతో వ్యవసాయ సలహాదారు పదవి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ కు డెయిరీ డెవలప్ మెంట్ ఫెడరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు.
పీఏసీ చైర్మన్ పదవి పార్టీ మారిన అరికెపూడి గాంధీకి ఇవ్వడం వివాదానికి దారితీసింది. ఈ పరిస్థితులలోనే పార్టీ మారిన ముగ్గురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుల అనర్హత పిటీషన్లను నాలుగు వారాలలో తేల్చాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఒక వేళ నిర్ణయం తీసుకోకుంటే తామే సుమోటోగా మరోసారి విచారిస్తామని వెల్లడించింది.
దీంతో అక్టోబర్ 9వ తేదీలోగా 16 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకుంటే అప్పుడు బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అవుతుంది. లేదంటే పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు డేంజర్ బెల్స్ మోగినట్లే. మొదట ముగ్గురు ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు కాస్తా అటూ ఇటూ ఖాయం అనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే మరో 16 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునే అంశం మీద కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించేందుకు సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనకు వెళ్లాడు. పార్టీ ఫిరాయింపుల మీద దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాలు చెబుతున్న నేపథ్యంలో తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీకి ఇరకాటంగా మారాయి. అందుకే తెలంగాణలో ఈ చేరికలను తొందరగా ముగించి ఈ చర్చకు పుల్ స్టాప్ పెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ మీద వత్తిడి తెస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే మరో 16 మందిని వీలయినంత తొందరలో చేర్చుకోవాలని రేవంత్ పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తుంది.