Begin typing your search above and press return to search.

పార్ల‌మెంటులో ప్ర‌ళ‌యం: అంబేద్క‌ర్‌ను నువ్వు తిట్టావ్‌.. కాదు నువ్వే అవ‌మానించావ్‌!!

ఇక‌, బుధ‌వారం ఉభ‌య స‌భ‌ల్లోనూ.. (లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌) కాంగ్రెస్ పార్టీ స‌భ్యులు తీవ్ర స్థాయిలో నిర‌స‌న వ్య‌క్తం చేశారు.

By:  Tupaki Desk   |   18 Dec 2024 5:01 PM GMT
పార్ల‌మెంటులో ప్ర‌ళ‌యం: అంబేద్క‌ర్‌ను నువ్వు తిట్టావ్‌.. కాదు నువ్వే అవ‌మానించావ్‌!!
X

పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాల్లో నిన్న మొన్న‌టి వ‌ర‌కు జ‌రిగిన గంద‌ర‌గోళం, నిర‌స‌నలు, ఆందోళ‌న‌లు ఒక ఎత్తు. కానీ, మంగ‌ళ‌వారం సాయంత్రం లోక్‌స‌భ‌లో చోటు చేసుకున్న ప‌రిణామాలు.. బుధ‌వారం పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌ల్లోనూ ప్ర‌ళ‌యాన్ని సృష్టించాయి. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్క‌ర్ చుట్టూ తిరుగుతున్న ఈ రాజ‌కీయాలు.. అధికార, ప్ర‌తిపక్ష‌ల మ‌ధ్య క‌ఠిన‌మైన వ్యాఖ్య‌లు, నింద‌న‌లు, నినాదాల‌తో పార్ల‌మెంటు టాప్ లేచిపోతోంది. అంబేద్క‌ర్‌ను మీరు తిట్టిపోస్తున్నారు.. అని ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ స‌భ్యులు ఆరోపిస్తే.. అస‌లు అంబేద్క‌ర్‌ను అవ‌మానించిందే మీరంటూ.. అధికార ప‌క్షం నిప్పులు చెరిగింది.

దీంతో పార్ల‌మెంటు స‌మావేశాల్లో బుధ‌వారం మొత్తంగా అంబేద్క‌ర్ చుట్టూనే వాడి వేడి వ్యాఖ్య‌లు ముసురుకున్నాయి. అస‌లు ఏం జ‌రిగిందంటే.. రాజ్యాంగానికి 75 ఏళ్లు నిండిన సంద‌ర్భంగా.. ఈ నెల 13 నుంచి ఈ విష‌యంపై ఇరు స‌భ‌ల్లోనూ చ‌ర్చ‌సాగు తోంది. ఈ చ‌ర్చ‌కు ఇప్ప‌టికే ముగింపు ప‌లికినా.. మంగ‌ళ‌వారం అనూహ్యంగా కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్ర‌నేత అమిత్‌షా మ‌రోసారి రాజ్యాంగం ప్ర‌స్తావ‌న తీసుకువ‌చ్చారు. రాజ్యాంగ నిర్మాత‌ను కాంగ్రెస్ ఘోరంగా అవ‌మానించింద‌ని.. ఆయ‌న విర‌క్తి చెందేలా వ్య‌వ‌హ‌రించి..ఆయ‌న‌ను మాన‌సికంగా క్షెభ పెట్టింద‌ని.. తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. దీనిని అప్పుడే కాంగ్రెస్ నాయ‌కులు నిర‌సించారు.

ఇక‌, బుధ‌వారం ఉభ‌య స‌భ‌ల్లోనూ.. (లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌) కాంగ్రెస్ పార్టీ స‌భ్యులు తీవ్ర స్థాయిలో నిర‌స‌న వ్య‌క్తం చేశారు. అమిత్ షా స‌భ‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని.. ఆయ‌న అంబేద్క‌ర్‌ను అవ‌మానించార‌ని వ్యాఖ్యానించారు. దీనికి అటు లోక్‌స‌భ‌లోనూ.. ఇటు రాజ్య‌స‌భ‌లోనూ.. అధికార ప‌క్షం నుంచి తీవ్ర ఎదురుదాడి క‌నిపించింది. అస‌లు అంబేద్క‌ర్‌ను అవ‌మానించింది... కాంగ్రెస్ పార్టీనేన‌ని బీజేపీ స‌భ్యులు ఎదురు దాడి చేశారు. అంబేద్క‌ర్ 1952లో ఎన్నిక‌ల్లో పోటీ చేస్తే.. ఆయ‌న‌నుకుట్ర పూరితంగా ఓడించింది కాంగ్రెస్ కాదా ? అని నిప్పులు చెరిగారు. రాజ్యాంగ నిర్మాత‌కు.. క‌నీసం భార‌త ర‌త్న ఇవ్వాల‌న్న స్పృహ కూడా కాంగ్రెస్‌కు లేకుండా పోయింద‌ని దుయ్య‌బ‌ట్టారు.

కాంగ్రెస్ వైఖ‌రితో విసిగిపోయిన‌.. అంబేద్క‌ర్ ఏకంగా.. బుద్ధిజాన్ని తీసుకుని..రాజ‌కీయాల‌కు దూరంగా ఉండిపోయార‌ని, న్యాయ శాఖ మంత్రిప‌ద‌విని కూడా తృణ ప్రాయంగా వ‌దులుకున్నార‌ని బీజేపీ స‌భ్యుడు, కేంద్ర మంత్రి కిర‌ణ్ రిజిజు రాజ్య‌స‌భ‌లోను, కేంద్ర మంత్రి, బీజేపీనాయ‌కుడు, అర్జున్‌రామ్ మేఘ్వాల్ లోక్‌స‌భ‌లోనూ.. గ‌ర్జించారు. ఇక‌, వీరు చేసిన వ్యాఖ్య‌ల‌కు మ‌రింత ద‌న్నుగా.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కూడా.. బుధ‌వారం సాయంత్రం లోక్‌స‌భ‌లో మాట్లాడుతూ.. అమిత్ షా చెప్పింది అక్ష‌ర స‌త్య‌మ ని.. అంబేద్క‌ర్‌ను అణువ‌ణువునా.. అన్యాయానికి గురి చేశార‌ని, ఆయ‌న‌ను తీవ్రంగా అవ‌మానించారి విరుచుకుప‌డ్డారు. దీనిని నిర‌సిస్తూ.. కాంగ్రెస్ స‌భ్యులు అరుపులు కేక‌ల‌తో స‌భ‌ను అట్టుడికించారు. క‌ట్ చేస్తే.. ఈ చ‌ర్చ వ‌ల్ల‌.. అటు అంబేద్క‌ర్ ఉన్న‌తి త‌రిగిపోయేది కాదు.. కానీ, ప్ర‌జా స‌మ‌స్య‌లే ఎవ‌రికీ ప‌ట్ట‌కుండా పోయాయ‌న్న‌ది నిర్వివాదాంశం!!