Begin typing your search above and press return to search.

ఇండియా కూటమి దారెటు..? మిత్రపక్షాలు కాంగ్రెస్‌కు ఎందుకు దూరం అవుతున్నాయి..?

గత డిసెంబర్ నెలలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికల జరిగాయి. ప్రధాన రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ఒక్క తెలంగాణలో మాత్రమే గెలుపు సాధించింది.

By:  Tupaki Desk   |   22 Oct 2024 11:30 AM GMT
ఇండియా కూటమి దారెటు..? మిత్రపక్షాలు కాంగ్రెస్‌కు ఎందుకు దూరం అవుతున్నాయి..?
X

గత డిసెంబర్ నెలలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికల జరిగాయి. ప్రధాన రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ఒక్క తెలంగాణలో మాత్రమే గెలుపు సాధించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ విజయం సాధించింది. మధ్యప్రదేశ్‌లో సంప్రదాయానికి తెరదించి బీజేపీని ఓడించి.. అధికారం చేపట్టాలని కాంగ్రెస్ కలలు కన్నప్పటికీ అది సాధ్యపడలేదు. అటు ఛత్తీగఢ్‌లోనూ కాంగ్రెస్‌ అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. మరోవైపు.. రాజస్థాన్‌లో కూడా రెండో సారి గెలిచి తీరాలనుకున్న కాంగ్రెస్‌కు కలలు నెరవేరలేదు.

కేంద్రంలో బీజేపీని గద్దెదించడమే లక్ష్యంగా 28 పార్టీలు ఏకమై ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంట్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (ఇండియా) పేరిట కూటమిని ఏర్పాటు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావించారు. కానీ.. పార్టీలు హోరాహోరీగా ప్రచారాలు చేసినా.. కూటమి పేరు చెబుతూ కాంగ్రెస్ ప్రతీ రాష్ట్రాన్ని చుట్టివచ్చినా చివరకు బొక్కబోర్లా పడక తప్పలేదు. అధికారాన్ని తప్పకుండా చేజిక్కించుకుంటామన్న కూటమి నేతల మాటలు నిజం కాలేదు. దాంతో మూడో సారి ప్రధానమంత్రి పదవిని మోడీనే చేపట్టాల్సి వచ్చింది. హ్యాట్రిక్ విజయంతో కమలం జెండా ఎగురవేశారు.

ఆ ఎన్నికల ఫలితాలు అలా ఉంటే.. ఇటీవల జమ్మూకశ్మీర్, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. హర్యానాలో రాష్ట్రంలో తప్పకుండా ఇండియా కూటమి విజయం సాధిస్తుందని కాంగ్రెస్ బలంగా నమ్మింది. అటు సర్వేలు సైతం కూటమికి అనుకూలంగానే ఫలితాలు వెల్లడించాయి. ఎగ్జిట్ పోల్స్‌లోనూ అదే విషయం తేటతెల్లమైంది. అటు ఫలితాలు వెల్లడవుతున్న క్రమంలోనూ ముందు కాంగ్రెస్ పార్టీలోనే లీడులో కొనసాగింది. దాంతో ఆ పార్టీ నేతలంతా సంబరాలు చేసుకున్నారు. ఆ తరువాత ట్రెండ్ పూర్తిగా రివర్స్ అయింది. ఎక్కడా కాంగ్రెస్ కూటమి ప్రభావం చూపలేదు. ఫలితంగా అనూహ్యంగా బీజేపీ విజయం సాధించింది. ఇటు జమ్మూకశ్మీర్‌లోనూ కనీసం స్వతంత్రులు సాధించిన సీట్ల సంఖ్య కూడా కాంగ్రెస్ సాధించలేకపోయింది.

గెలుపు ఖాయమనుకున్న హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం కూటమి నేతలను కలవరపరిచింది. అంతేకాదు.. కూటమిలో చిచ్చుకూడా రేపింది. కాంగ్రెస్ అహంకారం, అతివిశ్వాసం వల్లే ఓడిపోవాల్సి వచ్చిందని మిత్రపక్షాలు దుమ్మెత్తిపోశాయి. కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీలను కేవలం వాడుకుంటున్నదని ఆరోపించాయి. దీంతో ఇండియా కూటమిలో చీలికలు వచ్చాయి. ఇప్పటికే ఢిల్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేస్తామని ఆప్ ప్రకటించింది. అతివిశ్వాసంతో ఉన్న కాంగ్రెస్‌పై, అహంకార బీజేపీపై ఒంటరిగా పోటీ చేసి గెలుపొందే సత్తా తమకు ఉందని ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ ప్రకటించారు. అయితే.. గత పదేళ్లలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటును కూడా సాధించలేదు. అది కూడా ఆ పార్టీకి మైనస్ అయింది. దాంతోపాటు హర్యానా ఓటమితో తృణమూల్ కాంగ్రెస్ కూడా విమర్శలు చేసింది. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్న చోట ప్రాంతీయ పార్టీలను కలుపుకోదని, ఆ పార్టీ బలంగా లేని రాష్ట్రాల్లో మాత్రమే కలుపుకుని పోవాలని ఆలోచన అని తృణమూల్ ఎంపీ సాకేత్ గోఖలే విమర్శించారు. మరోవైపు. శివసేన నే సంజయ్ రౌత్ సైతం కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాలంటూ సూచించారు.

తాజాగా.. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెల్లడైంది. ఈ క్రమంలో ఈ రెండు రాష్ట్రాల్లోనూ గెలిచి తీరాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కానీ.. కూటమి నేతలు ఎవరూ కాంగ్రెస్‌ను విశ్వసించడం లేదని తెలుస్తోంది. కాంగ్రెస్ మాటను కూడా మిత్ర పక్షాలు పట్టించుకోవడం లేదన్న ప్రచారం జరుగుతోంది. ఇటు.. యూపీలోనూ పది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. పొత్తులో భాగంగా అధిక స్థానాలను కాంగ్రెస్ కోరుతోంది. కానీ.. సమాజ్‌వాది పార్టీ మాత్రం అందుకు ఒప్పుకోవడంలేదు.

ముఖ్యంగా మహారాష్ట్రలో శివసేన కాంగ్రెస్ పట్ల అస్సలు కాంప్రమైజ్ కావడం లేదట. అక్కడి పీసీసీ చీఫ్ నానా పటోలేను కూడా ఆ పార్టీ లెక్కచేయడంలేదట. సొంతంగానే పోటీ చేసేందుకు ఆ పార్టీ ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌తో వెళ్తే అవకాశాలు కోల్పోతామన్న ఆలోచన ఆ పార్టీలో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక జార్ఖండ్‌కు వచ్చేసరికి తమ పార్టీకి సీట్లు తక్కువగా ఇస్తే సొంతంగా పోటీచేస్తామని ఆర్జేడీ బెదిరిస్తోంది. ఈ క్రమంలో కూటమిలో కాంగ్రెస్ మాట ఏమాత్రం చెల్లుబాటు కావడం లేదన్న అభిప్రాయం స్పష్టం అవుతోంది. దీంతో కాంగ్రెస్ ముందు ముందు ఏం చేయబోతోందా అన్న ఆసక్తి నెలకొంది. మిత్రపక్షాలకు తలొగ్గి వారికి సీట్లు సర్దుబాటు చేస్తుందా..? లేదంటే ఆ పార్టీలు కేటాయించిన సీట్లలోనే పోటీ చేసి సైలెంట్ అవుతుందా..? లేదంటే ఒంటరిగా ఎన్నికలకు వెళ్తుందా అనేది చూడాలి.