Begin typing your search above and press return to search.

రోడ్డు పై బైఠాయించిన సీఎం.. రాజ్‌భవన్ వద్ద భారీగా కార్యకర్తలు

అమెరికాలో గౌతమ్ అదానీ ఆర్థిక అవకతవకలు దేశ వ్యాపార, ఆర్థిక రంగాన్ని, పరువును దెబ్బతీశాయని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.

By:  Tupaki Desk   |   18 Dec 2024 9:31 AM GMT
రోడ్డు పై బైఠాయించిన సీఎం.. రాజ్‌భవన్ వద్ద భారీగా కార్యకర్తలు
X

దేశంలో అదానీ, మణిపూర్ అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మౌనం వీడాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితర మంత్రులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. చలో రాజ్‌భవన్ కార్యక్రమాన్ని చేపట్టారు.

అమెరికాలో గౌతమ్ అదానీ ఆర్థిక అవకతవకలు దేశ వ్యాపార, ఆర్థిక రంగాన్ని, పరువును దెబ్బతీశాయని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అవినీతి, మోసం, మనీలాండరింగ్, మార్కెట్ మానిప్యులేషన్ లాంటి వాటితో వరుసగా అదానీ దేశ ప్రతిష్టను దెబ్బతీశారని విమర్శించారు. మణిపూర్‌లో వరుసగా జరిగిన అల్లర్లు, విధ్వంసాలపైనా మోడీ స్పందించకపోవడం సరైంది కాదని కాంగ్రెస్ నేతలు దుయ్యబట్టారు.

పీసీసీ చీఫ్‌‌‌‌ మహేశ్‌‌‌‌ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించగా.. నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి రాజ్‌భవన్ వరకు ముందుగా భారీ ర్యాలీ చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్‌‌‌‌చార్జి దీపాదాస్ మున్షి, పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతోపాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రధాని, అదానీ అనుబంధం దేశ ప్రతిష్టను దెబ్బతీస్తున్నదని దుయ్యబట్టారు. దేశంలో వ్యాపారం చేయాలంటే లంచం ఇచ్చే పరిస్థితి తెచ్చారన్నారు. అదానీ, ప్రధాని కలిసి దేశం పరువు తీశారని, వెంటనే జేపీసీ వేయాలని డిమాండ్ చేశారు. అదానీ విషయంలో ప్రధాని మోడీని నిలదీసినా.. అడిగినా కడిగినా మాట్లాడడం లేదని అన్నారు. ముఖ్యమంత్రి అయి ఉంది రాజ్‌భవన్ వద్ద నిరసన చేపట్టడం ఏంటని కొందరు అంటున్నారని, తమ నిరసన కొందరి నచ్చకపోవచ్చని, 75 ఏళ్లు కష్టపడి కాంగ్రెస్ దేశ ప్రతిష్టను పెంచిందన్నారు. అదానీ లంచాలు ఇచ్చారని అమెరికాలో కేసు నమోదైందని, ఈ అంశంపై పార్లమెంటులో రాహుల్ గాంధీ నిలదీశారని అన్నారు. అయినా.. మోడీ మౌనంగా ఉండిపోయారని పేర్కొన్నారు. తమను పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే నిరసన చేపడుతున్నామని, అదానీపై విచారణ జరగాలని అన్నారు.