పీవీ...ప్రణబ్ విషయంలో కాంగ్రెస్ తప్పు చేసిందా ?
కిషన్ రెడ్డి మాత్రమే కాదు మాజీ రాష్ట్రపతి దివంగతులైన ప్రణభ్ ముఖర్జీ విషయంలో కూడా కాంగ్రెస్ అవమానించిందని ఏకంగా ఆయన కుమార్తె శర్మిష్ట ముఖరీ ఆరోపించారు.
By: Tupaki Desk | 29 Dec 2024 4:28 AM GMTకాంగ్రెస్ పార్టీ ఈ రోజున కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం మీద విమర్శలు చేస్తోంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి దక్కాల్సిన గౌరవం దక్కలేదని అంటోంది. మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు విషయంలో బీజేపీ ప్రభుత్వం ఆయనను అవమానించిందని, అంత్యక్రియలను అధికారిక స్మశాన వాటికలో కాకుండా నిగంబోధ్ ఘాట్ వద్ద జరిపిందని కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది.
అయితే దీని మీద బీజేపీ కూడా ఘాటుగానే రియాక్ట్ అయింది. మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం కోసం కేంద్ర ప్రభుత్వం స్థలాన్ని కేటాయిస్తుందని, ఇది మాజీ ప్రధానులందరికీ నిబంధనల ప్రకారమే జరుగుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. మన్మోహన్ సింగ్ మరణాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు.
అదే సమయంలో కిషన్ రెడ్డి మరిన్ని విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నెహ్రూ, గాంధీ కుటుంబానికి చెందని ప్రధానులు పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ అలాగే, కాంగ్రెస్ అగ్రనేత ప్రణబ్ ముఖర్జీ వంటి వారిని తన వైఖరితో నిరంతరం మోసం చేస్తూ వచ్చిందని అన్నారు. అలాగే వారిని తీవ్ర అవమానాలకు గురి చేసిందని ఆరోపించారు. ఈ విషయం చరిత్రే చెబుతోందన్నారు. మన్మోహన్ మరణానికి కాంగ్రెస్ సంతాపం తెలియజేసినప్పటికీ ఆ పార్టీ ఆయనకు చేసిన అవమానాలను మనం విస్మరించకూడదన్నారు.
కిషన్ రెడ్డి మాత్రమే కాదు మాజీ రాష్ట్రపతి దివంగతులైన ప్రణభ్ ముఖర్జీ విషయంలో కూడా కాంగ్రెస్ అవమానించిందని ఏకంగా ఆయన కుమార్తె శర్మిష్ట ముఖరీ ఆరోపించారు. తన తండ్రి ప్రణబ్ ముఖర్జీ చనిపోయినప్పుడు ఆయనకు నివాళులు అర్పించేందుకు కనీసం సీడబ్ల్యూసీ సమావేశం కూడా నిర్వహించలేదని ప్రణబ్ కూతురు శర్మిష్ఠ ముఖర్జీ కాంగ్రెస్ పార్టీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ రాష్ట్రపతి, తన తండ్రి ప్రణబ్ 2020లో మృతి చెందారని, సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేయలేదన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ తనను తప్పుదోవ పట్టించిందని ఆరోపించారు.
రాష్ట్రపతులకు ఆ సంప్రదాయం పాటించడం లేదని కాంగ్రెస్ పార్టీలోని ఓ సీనియర్ నేత తనను నమ్మించే ప్రయత్నం చేశారన్నారు. అయితే తన తండ్రి డైరీని చదివిన తర్వాత అది నిజం కాదని తెలిసిందన్నారు. కేఆర్ నారాయణన్‌కు నివాళులర్పించేందుకు సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించినట్లు డైరీలో ఉందన్నారు.
ఈ రెండు విషయాలతో పాటు మరొకటి కూడా ఉంది. అదే పీవీ నరసింహారావు వ్యవహారం. ఆయన కాంగ్రెస్ పార్టీని నిలబెట్టారు. 1991 నుంచి 1996 వరకూ అయిదేళ్ల పాటు ఒక మైనారిటీ ప్రభుత్వానికి సారధ్యం వహించి బ్రహ్మాండంగా నడిపారు. ఉత్తమ ప్రధానిగా చరిత్రలో పీవీ నిలిచారు.
మరి ఆయన 2004 డిసెంబర్ లో మరణించినపుడు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ ప్రభుత్వం పీవీని అవమానించింది అని అంటారు. ఆయన పార్ధివ దేహాన్ని హైదరాబాద్ కి తీసుకుని రావాల్సి రావడం వెనక ఏమి జరిరిగింది అన్నది కాంగ్రెస్ పెద్దలకే తెలుసు అంటారు. ఈ రోజున ఢిల్లీలో మాజీ ప్రధానులు అందరికీ ఘనంగా అంత్యక్రియలు జరిపి స్మారక చిహ్నాలు ఏర్పాటు చేస్తున్నారు. మరి ఆ గౌరవం పీవీకి ఎందుకు దక్కలేదు అన్న ప్రశ్నలు ఉండనే ఉన్నాయి.
పీవీని కాంగ్రెస్ మాజీ ప్రధాని అయ్యాక వదిలించేసుకుందని కూడా అప్పట్లో ప్రచారం సాగింది. ఏ కాంగ్రెస్ కోసం అయితే ఆయన జీవితాంతం శ్రమించారో అదే కాంగ్రెస్ లో ఇందిరాగాంధీ వారసులు ఆయనను అవమానించారు అని అంటారు.
ఇక ప్రణబ్ ముఖరీ విషయానికి వస్తే ఆయన కాంగ్రెస్ లో అత్యంత సీనియర్ 1984లోనే ప్రధాని కావాల్సిన వారు కానీ రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యారు. ఆ తరువాత 2004లో ఆయనకు చాన్స్ కచ్చితంగా రావాల్సి ఉంది. కానీ అది జరగలేదు. ఇక రాష్ట్రపతి పదవికి కూడా ఆయన పేరుని ముందుగా విపక్షాల నుంచి ఆమోద ముద్ర లభించింది. కానీ చివరికి కాంగ్రెస్ ఆయన పేరుని ఆమోదించింది అని అంటారు. ప్రణబ్ ముఖరీకి కాంగ్రెస్ అవమానం చేసింది అని స్వయంగా ఆయన కుమార్తె ఆరోపించిన నేపథ్యం ఉంది.
మన్మోహన్ సింగ్ విషయంలో కూడా స్కాముల మరకలు ఆయన పాలనలో అంటడం వెనక ఎవరు ఉన్నారు అన్నది కూడా చరిత్రలో పదిలంగా ఉందని అంటున్నారు. ఆయన ప్రభుత్వం జారీ చేసిన ఒక ఆర్డినెన్స్ ని మీడియా ముందే నాటి యువ నేత రాహుల్ గాంధీ చించేసి అవమానించారు అన్నది కూడా గుర్తు చేస్తున్నారు. ఏది ఏమైనా పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు అన్న మాట ఉంది. అలా వెళ్ళిపోయిన వారిని ఎవరూ అవమానించలేరు. అలా చేశామని అనుకుంటే అది వారి మూర్ఖత్వమే అవుతుంది. అంతే కాదు వారి ప్రతిష్టను తగ్గించాలని చూసినా అది జరిగే పని కాదనే అంటున్నారు.