జగన్ మీద కాంగ్రెస్ నేతల సాఫ్ట్ టోన్...మ్యాటరేంటి ?
ఏపీలో కాంగ్రెస్ కి అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ఉన్నారు. ఆమె జగన్ మీద విమర్శలు చేస్తూనే ఉన్నారు.
By: Tupaki Desk | 29 Jan 2025 4:30 AM GMTఏపీలో కాంగ్రెస్ కి అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ఉన్నారు. ఆమె జగన్ మీద విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఏపీలో జగన్ మాజీ సీఎం అయినా కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే ప్రతీ సందర్భంలోనూ జగన్ ప్రస్తావనను కూడా కోరి తెచ్చి మరీ కెలికి వదిలిపెడతారు.
ఆమె రాజకీయ కోణం అలా ఉంటే ఏపీలో లబ్ద ప్రతిష్టులు అయిన వారు సీనియర్ నేతలు అయిన నాయకుల పొలిటికల్ వే వేరే విధంగా ఉంది అని అంటున్నారు. వారు డైరెక్ట్ గానే టీడీపీని చంద్రబాబుని విమర్శిస్తున్నారు. ఏ మాత్రం స్పేర్ చేయడం లేదు. ఇక ఇటీవల కాలంలో జగన్ వైపు సాఫ్ట్ టోన్ తో మాట్లాడుతున్నారు.
కాంగ్రెస్ లో ఒకప్పుడు ఫైర్ బ్రాండ్ గా పేరు గడించి అమలాపురం నుంచి వరసగా రెండు సార్లు ఎంపీగా గెలిచిన జీవీ హర్ష కుమార్ అయితే తాజాగా చంద్రబాబు మీద విమర్శల జడివాన కురిపించారు. సంక్షేమ పధకాలను అమలు చేయలేకపోతున్నామని ఆర్థిక పరిస్థితులే కారణం అని చంద్రబాబు చెప్పడాన్ని ఆయన తప్పు పట్టారు.
జగన్ అయిదేళ్ళూ ఎలా అమలు చేశారని ఆయన ప్రశ్నిస్తూ మీ కంటే ఆయనే నయం కదా అని కూడా అన్నారు. ఎంతో అనుభవం ఉన్నాదని చెప్పుకునే బాబు ఇలా హామీలను వదిలేయాలనుకోవడం జనాలను మోసం చేయడమే అన్నారు. 2014 నుంచి 2019 దాకా హామీలను అమలు చేయకపోవడం వల్లనే జనాలు ఓడించారు అన్నది గుర్తించాలని ఆయన అన్నారు.
ఏపీలో టీడీపీ కూటమి పాలన బాగా లేదని అంటూ జగన్ హయాంలో పేదలకు న్యాయం జరిగిందని హర్ష కుమార్ మాట్లాడటం విశేషం. ఇక అనంతపురానికి చెందిన మాజీ మంత్రి సాకే శైలజానాధ్ అయితే జగన్ గురించి బాగానే మాట్లాడుతున్నారు. ఆయన కూటమి ప్రభుత్వానికి ఆపోజిట్ ఫోర్స్ అని కూడా చెప్పుకొస్తున్నారు.
జగన్ సొంత జిల్లా కడపకు చెందిన వారు జగన్ పులివెందుల నియోజకవర్గం పరిధిలోని వారు అయిన సీనియర్ నాయకుడు తులసీరెడ్డి కూడా జగన్ ని వెనకేసుకుని వస్తున్నారు. విజయసాయిరెడ్డి పార్టీ నుంచి వెళ్ళిపోవడం వైసీపీని కొంత ఇబ్బందిగా ఉన్నా వైసీపీ కనుమరుగు అవుతుంది అన్నది తప్పు అని ఆయన అంటున్నారు.
ఈ రోజున ఆ పార్టీ కూటమికి అపొజిషన్ గా ఉందని గుర్తు చేశారు. కూటమి పట్ల జనాలకు వ్యతిరేకత వస్తే వైసీపీ వైపు చూసినా చూస్తారు అని విశ్లేషించారు. కాంగ్రెస్ కమ్యూనిస్టులు బీజేపీ జనసేన ఇలా ఇతర పార్టీలు వైసీపీని తగ్గించి ముందుకు వెళ్ళకపోతే వైసీపీకే మళ్ళీ అవకాశాలు ఉంటాయని అన్నారు. జగన్ పార్టీకి ఏపీలో 11 సీట్లు వచ్చినా పులివెందులలో ఆయన 62 వేల ఓట్ల మెజారిటీ దక్కిందని గుర్తు చేశారు.
ఇలా కాంగ్రెస్ నేతలు అంతా కూడా జగన్ విషయంలో ఎంతో కొంత సాఫ్ట్ స్టాండ్ తో ఉండడం కనిపిస్తోంది. దీని వెనక భావమేమి అన్నది చూస్తే కనుక కాంగ్రెస్ 2029 నాటికి కేంద్రంలో అధికారంలోకి రావాలని చూస్తోంది. ఏపీలో కాంగ్రెస్ సొంతంగా ఎదగలేదు, పొత్తులు కావాలి, ఆ పొత్తులకు వైసీపీయే సరైన ఆల్టర్నేషన్ అన్నది సీనియర్ల భావన అని అంటున్నారు.
ఒకవేళ పొత్తులు కుదరకపోతే ఈ నేతలలో కొందరు వైసీపీలో చేరి అయినా తరువాత ఎన్నికల్లో తమ రాజకీయం చూసుకుంటారని కూడా అంటున్నారు. మొత్తానికి టీడీపీ మీద చంద్రబాబు మీద వైసీపీతో పాటుగా కాంగ్రెస్ నుంచి కూడా నాయకులు విమర్శలు చేస్తున్నారు. ఇది ఫ్యాన్ పార్టీకి కొంత ఆనందించే పరిణామమే అని అంటున్నారు. అదే సమయంలో షర్మిల మాత్రం జగన్ నే టార్గెట్ చేస్తున్నారు అన్నది కూడా గమనించాల్సిన విషయం అంటున్నారు.