Begin typing your search above and press return to search.

ఈరోజుతో బీజేపీకి కష్టాలు షురూ.. కాంగ్రెస్ కు మంచిరోజులు!

గడిచిన పదేళ్లుగా రాజకీయంగా తీవ్రమైన గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న కాంగ్రెస్ కు మంచి రోజులు మొదలైనట్లుగా చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   8 Oct 2024 4:34 AM GMT
ఈరోజుతో బీజేపీకి కష్టాలు షురూ.. కాంగ్రెస్ కు మంచిరోజులు!
X

మిగిలిన అంశాల సంగతి ఎలా ఉన్నా.. రాజకీయాల్లో మాత్రం కాలం కీలకభూమిక పోషిస్తుందని చెప్పాలి. గడిచిన పదేళ్లుగా రాజకీయంగా తీవ్రమైన గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న కాంగ్రెస్ కు మంచి రోజులు మొదలైనట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో తిరుగులేని అధికారాన్ని అనుభవించిన బీజేపీకి ఎదురుదెబ్బలు మొదలయ్యే రోజుఈ రోజు నుంచే షురూ కానుందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. దీనికి కారణం ఈ రోజు వెలువడే రెండు రాష్ట్రాల అసెంబ్లీ (జమ్ముకశ్మీర్, హర్యానా) ఎన్నికల ఫలితాలుగా చెబుతున్నారు.

ఇటీవల ముగిసిన ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కలిసి వచ్చే అంశాలు కనిపించట్లేదు. హర్యానా ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లటం ఖాయమంటున్నారు. జమ్ముకశ్మీర్ విషయంలోనూ కాంగ్రెస్ కు సానుకూలంగా మారుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఒకవేళ తేడా వచ్చినా హంగ్ ఏర్పడుతుందన్న వాదన వినిపిస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ ఫలితాలు వెలువడిన కొద్ది రోజుల్లోనే మరో రెండు రాష్టాల అసెంబ్లీకి ఎన్నికల నగరా మోగనుంది. అందులో కీలకమైనది మహారాష్ట్ర. దేశ ఆర్థిక రాజధానిగా పేరున్న ముంబయి మహానగరం మహారాష్ట్ర కిందకే వస్తుంది. గడిచిన ఐదేళ్లలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో మహారాష్ట్ర ప్రజలు విసిగిపోయి ఉన్నారని.. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ కు పట్టం కట్టటం ఖాయమని చెబుతున్నారు.

బీజేపీ తీరుతో మహారాష్ట్ర ప్రజలు విసిగిపోయి ఉన్నారని.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి సరైన గుణపాఠం చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్రతో పాటు ఎన్నికలు జరిగే మరో రాష్ట్రం జార్ఖండ్. ఈ రాష్ట్రంలోనూ ఇప్పటికే బీజేపీ వ్యతిరేకత ప్రభుత్వం ఉంది. అయితే.. ఇటీవల కాలంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ను పెట్టిన ఇబ్బందుల నేపథ్యంలో బీజేపీ ఇమేజ్ ను దెబ్బ తీసిందన్న భావన ఉంది.

ఈసారి ఎన్నికల్లోనూ ఇప్పటి ప్రభుత్వానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ఒకవేళ అదే జరిగితే.. ఈ రోజు వెలువడే ఎన్నికల ఫలితాలు మాత్రమే కాదు..మరో నెల వ్యవధిలో (నవంబరు) అసెంబ్లీ ఎన్నికలు జరిగే మహారాష్ట్ర.. జార్ఖండ్ లోనూ బీజేపీకి ఎదురుదెబ్బ పడేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. అదే జరిగితే.. ఒకటి తర్వాత ఒకటి చొప్పున బీజేపీ చేతిలోని రాష్ట్రాలు కమలనాథులకు వ్యతిరేక కూటమి ఖాతాలోకి వెళ్లిపోతున్నట్లే. మొత్తంగా రానున్న రోజులు బీజేపీకి గడ్డు పరిస్థితులు ఎదురవుతాయని.. కాంగ్రెస్ కు కష్టకాలం ముగిసినట్లేనన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అందుకు ఈ రోజే పునాదిగా భావిస్తున్నారు.