కేంద్రంలో కాంగ్రెస్ కూటమి వస్తే బాబుకు.. జగన్ కి దెబ్బ...!
అదే కాదు వరస బెట్టి రెండు విడతలుగా జరిగిన ఎన్నికల్లో పోలింగ్ శాతం చూస్తే గత ఎన్నికల కంటే తక్కువగా నమోదు అయింది
By: Tupaki Desk | 29 April 2024 12:30 PM GMTజాతీయ రాజకీయాలు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించక ముందు వరకూ వాతావరణం టోటల్ గా బీజేపీకి అనుకూలంగా ఉన్నట్లుగా కనిపించింది. కానీ ఆ తరువాత నెమ్మదిగా మారుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇండియా కూటమి పుంజుకుంటున్న చాయలు కనిపిస్తున్నాయి. అదే కాదు వరస బెట్టి రెండు విడతలుగా జరిగిన ఎన్నికల్లో పోలింగ్ శాతం చూస్తే గత ఎన్నికల కంటే తక్కువగా నమోదు అయింది.
దాంతో కేంద్రంలో ఎవరికి అధికారం దక్కుతుంది అన్నది చర్చగా మారింది. ఎవరికీ మెజారిటీ రాకపోవచ్చు అన్న కొత్త చర్చ కూడా తెర పైకి వస్తోంది. కేంద్రంలో చూస్తే ఈసారి మోడీ వేవ్ పెద్దగా లేదు అని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుఇతోంది. మోడీకి మూడవ చాన్స్ లేదు అనే అంటున్నారు. అలాంటి ప్రచారం ఎందుకు జరుగుతోందో తెలియదు కానీ చాలా జోరుగా అయితే సాగుతోంది.
అదే నిజమై ఎన్డీయేకి కేంద్రంలో ఓటమి సంభవించి కాంగ్రెస్ నాయకత్వంలో ఇండియా కూటమి వస్తే కనుక ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబుకు కానీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ కి కానీ అది పెద్ద దెబ్బగా మారుతుంది అని అంటున్నారు. ఇక ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ గెలిచినా లేక చంద్రబాబు గెలిచినా కూడా కేంద్రంలో ప్రభుత్వం మారితే మాత్రం దారుణమైన ఇక్కట్లు తప్పవని అంటున్నారు.
ఇక విచ్చలవిడిగా పధకాలను ప్రకటించినా వాటి అమలుకు కేంద్రంలోని ప్రభుత్వం అప్పులు చేసుకునేందుకు వెసులుబాటు కూడా ఇవ్వదని అంటున్నారు. ఎఫ్ఆర్ఎంబీ చట్టం ప్రకారం చూస్తే అప్పులకు ఒక పరిమితి ఉంది. దానిని దాటి ఇచ్చేందుకు కూడా కేంద్రంలోని కాంగ్రెస్ కూటమి అసలు ఇష్టపడకపోవచ్చు అని అంటున్నారు.
ఏపీలో తమకు వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వానికి నిధులు ఇచ్చి అప్పులు ఇచ్చి పేరు తీసుకుని వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తుంది అని కూడా ప్రశ్న. అంతే కాదు కాంగ్రెస్ నాయకత్వంలో ప్రభుత్వం వస్తే ఏపీలో పుంజుకోవడానికి ప్రత్యేక హోదాని కూడా కచ్చితంగా ఇస్తుంది అని అంటున్నారు. ఆ విధంగా జనాలను తమ వైపునకు తిప్పుకుంటుంది అని అంటున్నారు.
అలా కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్లేస్ లో ఇండియా కూటమి వస్తే కనుక అప్పులు పెద్దగా పుట్టవని అంటున్నారు. అపుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు వెల్ ఫేర్ స్కీమ్స్ ని ఎలా చేస్తారు అన్నది అతి పెద్ద ప్రశ్నగానే ఉంటుంది అంటున్నారు. టీడీపీ అధినేత తరచూ చెబుతున్న మాటలు ఏంటి అంటే సంపదను సృష్టించి పధకాలకు ఖర్చు చేస్తామని. కానీ ఇప్పటికిపుడు సంపద సృష్టించడం కష్టసాధ్యమైన వ్యవహారం.
పైగా నెల వస్తే చాలు జీతాల నుంచి అన్నీ ఖర్చులతో కూడుకున్నవే. బడ్జెట్ ఎంత అయినా సరిపోదు. ఏపీకి పెద్దగా ఆదాయం లేదు. దాంతో జగన్ కి అయినా చంద్రబాబుకు అయినా ఇండియా కూటమి వస్తే కనుక ఇబ్బందులు అన్నవి ఒక లెవెల్ లో ఉంటాయని అంటున్నారు. ఏపీలో ఆదాయ మార్గాలని పెంచడం అన్నది మాత్రం ఇద్దరిలో ఎవరి వల్ల తక్షణం జరిగే వ్యవహారం కాదు. అది ఆర్థిక వేత్తలు కూడా అంగీకరించే విషయం అని అంటున్నారు.
ఇక బ్యాంకుల నుంచి పుట్టే అప్పులు కూడా లేకుండా టైట్ చేస్తారు అని అంటున్నారు. ఈ నేపధ్యంలో నుంచి చూసినపుడు ప్రజలకు ప్రాంతీయ పార్టీల మీద మోజు లేకుండా పోవాలి. వారు కేంద్రం అండ లేకుండా ఏమీ చేయలేరు అన్న నిర్ణయానికి రావాలి. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆ పార్టీలకు చెడ్డ పేరు రావాలి. ఇలాగే కాంగ్రెస్ వ్యూహాలు సాగుతాయని అంటున్నారు.
ఇక ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి కాంగ్రెస్ ఆంధ్రాను హత్తుకుంటుందని దగ్గరకు తీసుకుని తనదైన ట్రెడిషనల్ ఓటు బ్యాంక్ ని అంతా జమ చేసుకుని 2029 నాటికి గట్టి పడుతుందని అంటున్నారు. మొత్తానికి రాజకీయాల్లో ప్లాన్ ఏ అని ఒక్క దానినే పట్టుకుని కూర్చునే అయ్యేది. కాదు ప్లాన్ బీ ప్లాన్ సీ కూడా ఉండాలి.
చిత్రమేంటి అంటే ఏపీలో టీడీపీ కానీ వైసీపీ కానీ బీజేపీనే నమ్ముకుని ముందుకు సాగుతున్నాయి. కనీసం న్యూట్రల్ గా కూడా ఉండటం లేదు. కేంద్రంలో రేపు ఏమి జరుగుతుంది, అలా తమకు వ్యతిరేక ప్రభుత్వం అక్కడ ఏర్పడితే ఏమి చేయాలన్నది మాత్రం ఈ ఇద్దరు నేతలు ఇప్పటికి అయితే గుర్తించినట్లు లేదు అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇండియా కూటమి వస్తే కనుక రెండు ప్రాంతీయ పార్టీలకు భారీ చెక్ పెట్టడం ఖాయమని మాత్రం వినిపిస్తున్న మాట.