Begin typing your search above and press return to search.

తెలంగాణ పాలిటిక్స్‌: అసెంబ్లీ వ‌ర‌కే పొత్తు.. కోల్‌బెల్ట్‌లో మాత్రం ఫైటే!

మ‌రో నాలుగు రోజుల్లో సింగ‌రేణి కార్మికుల సంఘానికి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో సీపీఐ కి బ‌లం కొంచెం ఎక్కువ‌గా ఉంది.

By:  Tupaki Desk   |   23 Dec 2023 6:30 AM GMT
తెలంగాణ పాలిటిక్స్‌: అసెంబ్లీ వ‌ర‌కే పొత్తు.. కోల్‌బెల్ట్‌లో మాత్రం ఫైటే!
X

రాజ‌కీయాలు రాజ‌కీయాలే అన్న‌ట్టుగా ఉంది తెలంగాణ పాలిటిక్స్ ప‌రిస్థితి. నిన్న‌టి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పొత్తుల కోసం ఎదురు చూసి.. చివ‌రి నిమిషంలో కాంగ్రెస్‌తో చేతులు క‌లిపిన సీపీఐ ఎట్ట‌కేల‌కు ఒక స్థానంలో విజ‌యం ద‌క్కించుకుంది. అయితే.. ఇది జ‌రిగి నిండా నెల రోజులు కూడా గ‌డ‌వ‌క ముందే.. ఇప్పుడు అదే తెలంగాణ‌లో కాంగ్రెస్‌తో చేతులు క‌లిపేది లేద‌ని తేల్చేసింది. మ‌రి ఈ క‌థేంటో చిత్రంగా ఉంది క‌దూ.. !

మ‌రో నాలుగు రోజుల్లో సింగ‌రేణి కార్మికుల సంఘానికి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో సీపీఐ కి బ‌లం కొంచెం ఎక్కువ‌గా ఉంది. బీఆర్ ఎస్ త‌ర్వాత ఆ పార్టీ అనుబంధం సంఘం ఏఐటీయూసీకి మంచి మ‌ద్ద‌తు ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీ నేత‌లు.. ఇక్క‌డ సీపీఐతో చేతులు క‌లిపి.. బీఆర్ ఎస్ అనుబంధ సంఘానికి షాకివ్వాల‌ని అనుకున్నారు. అయితే.. సీపీఐ మాత్రం వ‌ద్దులే.. అనేసిందట‌.

ఈ నెల 27న జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్‌టీయూసీ, సీపీఐ అనుబంధ సంఘం ఏఐటీయూసీ ఎవరికి వారుగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఐఎన్‌టీయూసీ తో కలిసి ఎన్నికలకు వెళ్లేలా ఏఐటీయూసీని ఒప్పించాలన్న సీపీఐ ప్రయత్నం విఫలమైంది. ఈ అంశంపై కాంగ్రెస్‌తో సంప్రదించే వాతావరణం ఉందని సీపీఐ నేతలు చెప్పినా.. బేషరతుగా కలిసివస్తే ఆహ్వానిస్తామే తప్ప.. ఐఎన్‌టీయూసీతో పొత్తు ఉండదని ఏఐటీయూసీ స్పష్టం చేసింది.

దీంతో సింగరేణి ఎన్నికల విషయంలో కాంగ్రెస్‌, సీపీఐ మధ్య చర్చలు గానీ, ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూ సీ మధ్య పొత్తుగానీ ఉండవని తేలిపోయింది. మొత్తానికి ఈ ప‌రిణామంతో రాజ‌కీయాలు ఎక్క‌డైనా రాజ‌కీయాలే.. ఎవ‌రి అవ‌కాశాలు వారివ‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది. సింగరేణి ఎన్నికలకు అక్టోబరు మొదటి వారంలోనే నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తయింది. అర్హత కలిగిన సంఘాలు, గుర్తుల కేటాయింపు కూడా జరిగింది. ఆ తరువాత డిసెంబరు 27వ తేదీకి ఎన్నికలకు వాయిదా పడ్డాయి. తిరిగి అప్పటి షెడ్యూల్‌ మేరకే ఎన్నికలను ఆర్‌ఎల్‌సీ నిర్వహిస్తోంది.