ఆ విషయంలో కాంగ్రెస్-బీజేపీలు సర్దుకు పోతున్నాయి బ్రో
కాబట్టి.. వారికి ఖర్చుల కింద అడ్వాన్స్‌గా కొంత సొమ్ము ఇస్తే.. తప్పేంటి?`` అని రాజస్థాన్‌కు చెందిన బీజేపీ నాయకుడు ప్రశ్నించడం అందరినీ విస్మయానికి గురి చేసింది.
By: Tupaki Desk | 25 Nov 2023 4:53 AM GMTఔను.. ఇప్పుడు ఇదే మాట వినిపిస్తోంది. దేశ వ్యాప్తంగా ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు పార్టీలు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. చేశాయి. అయితే.. ఒక్క ఈశాన్య రాష్ట్రం మిజోరాంలో తప్ప.. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్,ఛత్తీస్‌గఢ్, ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న(శనివారం) రాజస్థాన్‌లోనూ నోట్ల కట్టల పంపిణీ విరివిగా సాగింది. ఇందులో ఏమీ ఎలాంటి అభ్యంతరం, భయం కూడా లేదని అభ్యర్థులే చెబుతున్నారు.
``ఔను. ఏదీ ఊరేకే రాదు. ప్రజలు తమ సమయాన్ని మా కోసం వెచ్చించి లైన్‌లో నిలబడి సుదూర ప్రయాణం చేసి వస్తున్నారు. కాబట్టి.. వారికి ఖర్చుల కింద అడ్వాన్స్‌గా కొంత సొమ్ము ఇస్తే.. తప్పేంటి?`` అని రాజస్థాన్‌కు చెందిన బీజేపీ నాయకుడు ప్రశ్నించడం అందరినీ విస్మయానికి గురి చేసింది. అయితే.. ఇది వివాదం కాలేదు. పైగా కాంగ్రెస్ నేతల నుంచి కూడా సమర్థన వ్యాఖ్యలే వినిపించాయి.
``ఔను. పేదలు.. పాపం దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. మేం స్వయంగా వాహనాలు ఏర్పాటు చేయడానికి నిబంధనలు అడ్డు వస్తున్నాయి. అందుకే ప్రయాణ, భోజన ఖర్చులు ఇవ్వడం తప్పుకాదు. ఇది ప్రలోభం కాదు`` అని కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్ చీఫ్ బీజేపీకి వంత పాడారు. కట్ చేస్తే.. తెలంగాణ లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని కొన్ని చోట్ల.. ఇరు పార్టీల అభ్యర్తులు కూడా సర్దుకు పోతున్నారు.
వాస్తవానికి ప్రత్యర్థి వర్గం.. ఓటర్లకు డబ్బులు పంచితే.. మరో వర్గం దానిని బట్టబయలు చేసే సంస్కృతి కొన్నాళ్లు సాగింది. కానీ, ఇప్పుడు సర్దుకు పోయే సంస్కృతి వచ్చింది. ఆయనా పంచుతున్నాడు.నేను కూడా పంచుతున్నా.. ఒకరిపై ఒకరు నిఘాపెడితే.. వచ్చేదేముందని ఉమ్మడిఖమ్మం జిల్లాకు చెందిన ఓ సీనియర్ నాయకుడు ఇటీవల బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అంతేకాదు.. డబ్బులు పంచడాన్ని కూడా ఆయన సమర్థించాడు.
ఇక, ఈ కీలక సమయంలో పెద్దనోట్ల రద్దు విషయం రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. పెద్ద నోట్లు ఉండి ఉంటేనా? అంటూ.. నాయకులు శూన్యంలోకి చూస్తూ.. నిట్టూరుస్తున్నారు. ప్రస్తుతం రూ.500లకు మించి పెద్దనోటు లేదు. వీటిని తరలిస్తూ.. పట్టుబడుతున్న ఘటనలు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరోసారి నేతల మధ్య పార్టీలకు అతీతంగా పెద్దనోట్ల వ్యవహారం.. చర్చకు రావడం గమనార్హం.