కాంగ్రెస్ అభ్యర్థులతో ఇదే సమస్య
గెలుపు ఖాయమన్న ఆలోచనే ఈ దశలో అభ్యర్ధుల్లో రాకూడదన్నది అధిష్టానం భావన. గెలుపు ఖాయమన్న ఆలోచన వచ్చేస్తే ఇక నిర్లక్ష్యం మొదలవుతుందని ఆందోళన పెరిగిపోతోంది
By: Tupaki Desk | 22 Nov 2023 5:00 AM ISTకాంగ్రెస్ అధిష్టానం కొందరు అభ్యర్ధులకు ఫుల్లుగా క్లాసు పీకినట్లు సమాచారం. తొందరలో జరగబోయే ఎన్నికల్లో గెలుపు ఖాయమైపోయిందన్న ఆలోచనతో కొందరు అభ్యర్ధులు రిలాక్స్ మోడ్ లోకి వెళ్ళిపోయారట. అంతకుముందు వరకు బాగా ప్రచారంచేసిన అభ్యర్ధులు మూడునాలుగు రోజులుగా రిలాక్సుడుగా ఉంటున్నట్లు అధిష్టానం దృష్టికి వెళ్ళిందట. మొదట ఈ విషయం పీసీసీ దృష్టికి రావటంతో అభ్యర్ధులతో ఫోన్లోనే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గట్టిగానే మాట్లాడారట. ఎందుకైనా మంచిదని ఇదే విషయాన్ని అధిష్టానం దృష్టికి కూడా చేరవేసినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.
దాంతో వెంటనే అదిష్టానం ప్రతినిధులు రంగంలోకి దిగి అభ్యర్ధులకు ఫోన్లుచేసి క్లాసులు పీకారట. గెలిచిపోతామనే టాక్ వచ్చేసింది కాబట్టి ఇదివరకు కష్టపడినట్లుగా ఇపుడు కష్టపడాల్సిన అవసరం లేదన్న ధోరణి అభ్యర్ధుల్లో కనిపించిందట. దాంతో అధిష్టానం గట్టిగానే క్లాసు పీకినట్లు చెబుతున్నారు. ఉదాశీనంగా ఉంటే మొదటికే మోసం వస్తుందని ఎట్టి పరిస్ధితుల్లోను రిలాక్సుగా ఉండటం కుదరదని కచ్చితంగా చెప్పేసిందట. పోలింగ్ జరిగేంతవరకు గ్రౌండ్ లో తిరగాల్సిందేనని, రోడ్డుషోలు, ర్యాలీలతో పాటు ఇంటింటి ప్రచారం చేయాల్సిందే అని చెప్పిందట.
వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్, జనగాం, తుంగతుర్తి, దేవరకద్ర, నాగర్ కర్నూల్, చేవెళ్ళ, మేడ్చల్, కరీంనగర్ తదితర నియోజకవర్గాల్లో అభ్యర్ధుల విజయవకాశాలు పెరిగినట్లు సర్వేల్లో తేలిందట. ఆ విషయం తెలియగానే ఎలాగూ గెలుపు ఖాయం కాబట్టి అంతగా కష్టపడాల్సిన అవసరం లేదన్నట్లుగా అభ్యర్ధులు రిలాక్సయిపోయారట. ఇదే విషయం పరిశీలకుల ద్వారా పీసీసీకి అక్కడినుండి ఏఐసీసీకి చేరింది. దాంతో వెంటనే ఫోన్లలో రెండువైపుల నుండి క్లాసులు పడినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.
గెలుపు ఖాయమన్న ఆలోచనే ఈ దశలో అభ్యర్ధుల్లో రాకూడదన్నది అధిష్టానం భావన. గెలుపు ఖాయమన్న ఆలోచన వచ్చేస్తే ఇక నిర్లక్ష్యం మొదలవుతుందని ఆందోళన పెరిగిపోతోంది. ఆ నిర్లక్ష్యమే చివరకు అభ్యర్ధితో పాటు పార్టీని నిలువునా ముంచేయటం ఖాయమని అధిష్టానం అభ్యర్ధులకు స్పష్టంగా చెప్పిందట. పోలింగ్ కు ఇక ఉన్నది పదిరోజులు కాబట్టి కచ్చితంగా ఒకటి రెండుసార్లు ఇంటింటి ప్రచారం చేయమని అభ్యర్ధులను ఆదేశించిందట. గెలుపుఖాయమన్న ఓవర్ కాన్ఫిడెన్సు సుమారు 30 మంది అభ్యర్ధుల్లో ఉన్నట్లు అధిష్టానంకు రిపోర్టు వచ్చింది. అందుకనే వెంటనే రంగంలోకి దిగి క్లాసు పీకింది.