'నోటా'కు ఓటేయమంటున్న కాంగ్రెస్ !
ఇక మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లోక్ సభ స్థానం నుండి బరిలోకి దింపిన కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ బామ్ చివరి నిమిషంలో పోటీ నుండి తప్పుకోవడంతో అక్కడ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి లేకుండా పోయాడు.
By: Tupaki Desk | 12 May 2024 2:30 PM GMTఎన్నడూ లేనివిధంగా ఈ సారి లోక్ సభ ఎన్నికలలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. గుజరాత్ లోని సూరత్ లోక్ సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురికావడం, ఆ వెంటనే రంగంలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో అక్కడ బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవం కావడం సంచలనం రేపింది. ఇక ఒడిశాలో పూరి లోక్ సభ అభ్యర్థిగా సుచరిత మొహంతిని కాంగ్రెస్ ప్రకటించింది. అయితే తన వద్ద పైసలు లేవని ఆమె పోటీ నుండి తప్పుకోవడం కలకలం రేపింది.
ఇక మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లోక్ సభ స్థానం నుండి బరిలోకి దింపిన కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ బామ్ చివరి నిమిషంలో పోటీ నుండి తప్పుకోవడంతో అక్కడ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి లేకుండా పోయాడు. అంతే కాదు అతను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీలోకి చేరిపోవడం గమనార్హం.
నమ్ముకున్న అభ్యర్థి హ్యాండ్ ఇవ్వడంతో మరో అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేసింది. చివరకు హైకోర్టును కూడా ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది.
ఇక లాభం లేదనుకున్న కాంగ్రెస్ తమ పార్టీ అభ్యర్థిని తప్పించిన బీజేపీకి బుద్దిచెప్పాలని, ఈ ఎన్నికలలో నోటాకు ఓట్లేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కాంగ్రెస్ ప్రచారం మొదలుపెట్టింది.
అయితే 1984 లో చివరిసారిగా అక్కడ కాంగ్రెస్ గెలిచింది. ఆ తర్వాత వరసగా బీజేపీ పార్టీనే గెలుస్తూ వస్తుండడం గమనార్హం. 1989 నుండి వరసగా 2014 వరకు బీజేపీ అభ్యర్థి సుమిత్ర మహాజన్ విజయం సాధించడం విశేషం. 2019 ఎన్నికలలో ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ, బీజేపీ అభ్యర్థి శంకర్ లాల్వాని 5 లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం విశేషం.