Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ సీఎం ఖరారు లేట్ అవుతున్నది అందుకేనా?

వంట చేయటం రాకున్నా.. వండిన ప్రతి వంటకంపైన తన పేరు ఉండాలని ఊబలాటపడతాడన్నట్లుగా ఉంది ప్రస్తుతం టీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి.

By:  Tupaki Desk   |   5 Dec 2023 5:39 AM GMT
కాంగ్రెస్ సీఎం ఖరారు లేట్ అవుతున్నది అందుకేనా?
X

వంట చేయటం రాకున్నా.. వండిన ప్రతి వంటకంపైన తన పేరు ఉండాలని ఊబలాటపడతాడన్నట్లుగా ఉంది ప్రస్తుతం టీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. కీలకమైన అసెంబ్లీ ఎన్నికలు జరిగే వేళలో.. ఎవరికి వారు తాము పోటీ చేసే స్థానాలకు పరిమితమై.. గెలిస్తే చాలు భగవంతుడా? అనుకంటూ కిందా మీదా పడి చెమటోడ్చి గెలిచారు. మరోవైపు.. తాను పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాల్ని వదిలేసి.. తెలంగాణ వ్యాప్తంగా నిత్యం పర్యటిస్తూ.. ప్రత్యర్థులు ఇస్తున్న కౌంటర్లకు గట్టిగా బదులిస్తూ.. ఏ రోజుకు ఆ రోజు వారు చేసే ఘాటువిమర్శలకు చెక్ చెబుతూ పార్టీని విజయతీరాలకు తీర్చటంలో కీలకభూమిక పోషించారు రేవంత్ రెడ్డి.

ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందంటే.. దానికి పూర్తి క్రెడిట్ రేవంత్ కు ఇచ్చేయాల్సిందే. అందులో వేరే మాటకు అవకాశం లేదు. ఈ కారణంగానే.. ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్న వేళలోనే ముఖ్యమంత్రిగా రేవంత్ ను ఎంపిక చేస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. గతంతో పోలిస్తే.. ఈసారి ముఖ్యమంత్రిఎంపిక విషయంలో అట్టే నాన పెట్టకుండా.. విషయం తేల్చేస్తున్నారన్న భావన కలిగింది. కానీ.. ఇంగువ కట్టిన వస్త్రానికి ఆ వాసన ఊరికే పోదన్న చందంగా.. కాంగ్రెస్ తన తీరునుమార్చుకోలేదు.

దీనికి కారణం.. పార్టీకి చెందిన సీనియర్ నేతలైన ఇద్దరు కారణమని చెబుతున్నారు. అందులో ఒకరు భట్టి విక్రమార్క అయితే మరొకరు ఉత్తమ్ కుమార్ రెడ్డి. వీరిద్దరి కారణంగా సీఎంను డిసైడ్ చేసే ప్రకటన ఆలస్యం అవుతుందని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ను అధిష్ఠానం డిసైడ్ చేయగా.. అందుకు భట్టి.. ఉత్తమ్ అడ్డుపడుతున్నట్లుగా చెబుతున్నారు. ఢిప్యూటీ సీఎంగా ముగ్గురిని నియమించాలని హైకమాండ్ భావిస్తే.. అందుకే భట్టి మాత్రం అడ్డుపడినట్లుగా చెబుతున్నారు. డిప్యూటీ సీఎం ముగ్గురు కాదు ఒక్కరే ఉండాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని లేదంటే తనకు ఒక్కరికే డిప్యూటీ సీఎం పోస్టు ఇవ్వాలన్న భట్టి ఫిట్టింగ్ పెట్టటంతో కాంగ్రెస్ పరిశీలకులు నెత్తి పట్టుకుంటున్నట్లు చెబుతున్నారు.ఇలా భట్టి పంచాయితీ మీద పంచాయితీ పెడుతుంటే.. తాను మాత్రం తక్కువ తినలేదన్నట్లుగా ఉత్తమ్ కూడా కొత్త డిమాండ్లను తెర మీదకు తెస్తున్నట్లుగా తెలుస్తోంది. సీఎం రేసులో ఉన్న ఉత్తమ్.. తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుంటే డిప్యూటీ సీఎంతో పాటు తన సతీమణిని మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న ఫిట్టింగ్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇలా.. కాంగ్రెస్ అధినాయకత్వం ఆలోచలనకు భిన్నంగా భట్టి.. ఉత్తమ్ తీరుతో అధిష్టానం నుంచి వచ్చిన దూతలు చేతులు ఎత్తేసినట్లుగా చెబుతున్నారు. దీంతో తమ పంచాయితీల్ని ఢిల్లీలో తేల్చుకుంటామని వారు రాజధానికి పయనమైనట్లుగా తెలుస్తోంది.