11 రోజులు దీక్ష చేస్తే మనిషి బ్రతుకుతాడా?... కాంగ్రెస్ నేత కొత్త సందేహం!
ఈ సందర్భంగా తన సందేహాలకు కారణాలున్నాయంటూ ఆయన పలు విషయాలు వెల్లడించారు వీరప్ప మొయిలీ.
By: Tupaki Desk | 24 Jan 2024 6:08 AM GMTఅయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి ముందు ప్రధాని నరేంద్ర మోడీ 11 రోజుల పాటు దీక్ష చేశారని.. అందులో భాగంగా నేలపై పడుకుంటూ, కేవలం కొబ్బరి నీళ్లు మాత్రమే తీసుకుంటూ కఠోర దీక్ష చేపట్టారని చెప్పిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ప్రాణప్రతిష్ఠ అనంతరం దీక్ష విరమించారు. ఇందులో భాగంగా... పండితులు గోవింద్ దేవ్ గిరిజీ మహరాజ్ మోడీకి తీర్ధం అందించి దీక్షను విరమింప చేశారు. అయితే ఈ దీక్షపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు.
అవును... అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి ముందు ప్రధాని నరేంద్ర మోడీ నిజంగా 11 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారా అనే సందేహాన్ని లేవనెత్తారు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ. కర్ణాటకలోని చిక్కబళ్లాపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన... ఈ సందర్భంగా మోడీ దీక్షపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా తన సందేహాలకు కారణాలున్నాయంటూ ఆయన పలు విషయాలు వెల్లడించారు వీరప్ప మొయిలీ. ఇందులో భాగంగా... "11 రోజుల ఉపవాసం ఉంటే జీవించడం అసాధ్యం అని చెబుతున్నారు.. వైద్యుల అభిప్రాయం ప్రకారం... ఒక వ్యక్తి కేవలం లేత కొబ్బరి నీరు తాగి అన్ని రోజులు ఉండటం అసాధ్యం! తాను ఉపవాస దీక్షలో ఉన్నానని, ఈ సమయంలో అనేక ప్రాంతాలను సందర్శించానని ప్రధాని మోడీ పేర్కొన్నారు.. చూస్తే... ఆయన నిరాహార దీక్ష చేస్తున్నట్లు కనిపించడం లేదు" అని మొయిలీ అన్నారు.
ఇదే సమయంలో తాను డాక్టర్ తో ఉపవాసం గురించి చర్చించినట్లు చెప్పిన మొయిలీ... 11 రోజులు ఉపవాసం ఉంటే బ్రతకడం సాధ్యం కాదని.. అది జరిగితే అదో అద్భుతం అని.. అందువల్లే ఉపవాసం పాటించడం అనుమానమే అని.. ప్రాక్టికల్ గా ఆ ఉపవాస దీక్ష సాధ్యంకాదని అంటున్నారని.. ఒకవేళ ప్రధాని మోడీ ఉపవాసం పాటించకుండా గర్భగుడిలోకి వెళ్లి ఉంటే ఆ ప్రదేశం పవిత్రతను కోల్పోతుందని మొయిలీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అదే క్రమంలో... ఉపవాసం చెయ్యకుండా గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేస్తే అది అపవిత్రమైపోతుందని.. ఫలితంగా ఆ స్థలంలో ఎలాంటి శక్తి ఉండదని మొయిలీ చెప్పుకొచ్చారు. ఇక.. ఇంతకాలం రామమందిరం పేరుతో రాజకీయాలు చేసే బీజేపీ అధికారంలోకి వచ్చిందని.. ఇక నుంచి బీజేపీ మాట్లాడటానికి ఏమీ ఉండదని.. బీజేపీకి రామ మందిరం తప్ప మాట్లాడేందుకు మరో అంశం లేదని వీరప్ప మొయిలి ఆరోపించారు.
దీంతో... ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు స్పందించారు. ఇందులో భాగంగ... బీజేపీ సీనియర్ నాయకుడు ఆర్ అశోక... వెనుకబడిన వర్గానికి చెందిన మోడీని కాంగ్రెస్ నాయకులు దుర్భాషలాడుతున్నారని అన్నారు. వెంటనే మోడీకి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో... వీరప్ప మొయిలీ లేవనెత్తిన సందేహాలపై నెట్టింట చర్చ మొదలైందని తెలుస్తుంది