త్వరలో కాంగ్రెస్ డాక్యుమెంటరీ.. బీఆర్ ఎస్‌కు చుక్కలే..!
నిజానికి తెలంగాణ విషయంలో 2014లో జరిగిన విషయాలను నాయకులు త్వరలోనే వీడియో రూపంలో నూ ప్రజలకు చేరువ చేసేందుకు రెడీ అయ్యారు.
By: Tupaki Desk | 2 Nov 2023 6:31 AM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ బీఆర్ ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ల మధ్య హోరా హోరీ పోరు సాగుతుందనే వాదన బలంగా వినిపిస్తోంది. తెలంగాణ తామే ఇచ్చామన్న సెంటిమెంటును తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డిసహా పార్టీ అగ్రనేతలు.. రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలు సహా మిగిలిన నాయకులు కూడా బలంగా తీసుకువెళ్తున్నారు.
నిజానికి తెలంగాణ విషయంలో 2014లో జరిగిన విషయాలను నాయకులు త్వరలోనే వీడియో రూపంలో నూ ప్రజలకు చేరువ చేసేందుకు రెడీ అయ్యారు. దీనికి సంబంధించి ఓ అగ్రదర్శకుడితో చర్చలు కూడా పూర్తయ్యాయి. ఇక, రంగంలోకి దిగనున్న దర్శకుడి టీం.. మరో వారంలో ఒక డాక్యుమెంటరీని రూపొందించనున్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే.. తెలంగాణ ఇచ్చే విషయంలో కాంగ్రెస్ ఎన్ని ఆటు పోట్లు ఎదుర్కొన్నదీ.. ముఖ్యంగా సోనియాగాంధీ ఎలా స్పందించారు.
కాంగ్రెస్ ఎంతలా నష్టపోతామని తెలిసినా.. తెలంగాణ ఇచ్చేందుకు ఎందుకు సిద్ధపడింది? తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు ఎందుకు వేయాలి? గత పదేళ్లలో కాంగ్రెస్ చేసిన పోరాటాలు.. ఇలా అనేక అంశాలను గుదిగుచ్చి ఈ డాక్యుమెంటరీని రూపకల్పన చేయనున్నట్టు గాంధీ భవన్‌కు చెందిన కీలక నేతలు చెబుతున్నారు. ఇది ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని నిర్ణయించారు. దీనికి సోషల్ మీడియా ప్లాట్ ఫాంలను విరివిగా వినియోగించుకోనున్నట్టు సమాచారం.
ఇదే జరిగి.. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ దూకుడు, నాటి నిర్ణయాలపై చర్చ జరిగితే.. తమకు మేలు జరుగుతుందని కాంగ్రెస్ పెద్దలు కూడా భావిస్తున్నారు. గత పదేళ్లలో నిర్బంధాలు.. ప్రతిపక్ష నేతలపై కేసులు.. పాలన వంటి వాటిని కూడా ప్రముఖంగా చూపించనున్నట్టు సమాచారం. మొత్తంగా కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేయాలో ఈ డాక్యుమెంటరీలో స్పష్టంగా చూపించనున్నట్టు కీలక నేతలు వెల్లడించారు.
ఇది రూపం దాల్చి ప్రజల మధ్యకు వచ్చేందుకు పెద్దగా సమయం లేదని.. దీనికికోడ్ కూడా అడ్డంకి కాబోదని అంటున్నారు. అదేసమయంలో ఆరు గ్యారెంటీలను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నారు. మొత్తానికి వ్యూహం మార్చిన కాంగ్రెస్‌కు ఇది ఏమేరకు లబ్ధి చేకూరుస్తుందో చూడాలి.