Begin typing your search above and press return to search.

అన్న ప్లేస్‌లో చెల్లి-అమ్మ ప్లేస్‌లో కొడుకు.. కాంగ్రెస్ ఫ్యామిలీ పాలిటిక్స్‌!!

తాజాగా కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, సోనియాగాంధీ గారాల ప‌ట్టి ప్రియాంక గాంధీని ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో దింపుతున్నారు.

By:  Tupaki Desk   |   17 Jun 2024 5:30 PM GMT
అన్న ప్లేస్‌లో చెల్లి-అమ్మ ప్లేస్‌లో కొడుకు.. కాంగ్రెస్ ఫ్యామిలీ పాలిటిక్స్‌!!
X

కాంగ్రెస్ లో వార‌స‌త్వ రాజ‌కీయాలు కొనసాగుతున్నాయి. ఒక‌వైపు ప్ర‌ధాని మోడీ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నా.. కాంగ్రెస్‌లోనే కొంద రు నాయ‌కులు వ్య‌తిరేకిస్తున్నా..కాంగ్రెస్ పార్టీ మాత్రం కుటుంబ రాజ‌కీయాల‌కే మొగ్గు చూపుతోంది. కుటుంబ నాయ‌కులు లేక పోతే ఎలా అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. తాజాగా కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, సోనియాగాంధీ గారాల ప‌ట్టి ప్రియాంక గాంధీని ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో దింపుతున్నారు. అదేంటి? ఎన్నిక‌లు అయిపోయాయి క‌దా! అనుకుంటున్నారా? అయిపోయాయి. కానీ, ఇదే కాంగ్రెస్ పార్టీ వార‌సుడు రాహుల్‌గాంధీ తాజా ఎన్నిక‌ల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేసిన విష‌యం తెలిసిందే.

అదృష్టం కొద్దీ ఆయ‌న రెండు చోట్లా విజ‌యం ద‌క్కించుకున్నారు. దీంతో నిబంధ‌న‌ల ప్ర‌కారం ఒక స్థానం ఉంచుకుని.. మ‌రొక‌దా న్ని వ‌దులుకుంటున్నారు. అలా వ‌దులుకుంటున్న స్థానంలో ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. దీంతో ఖాళీ అయ్యే స్థానాన్ని గాంధీల కుటుంబంలోని ప్రియాంక‌కు కేటాయించారు. ఆమే అక్క‌డ నుంచి పోటీ చేయ‌నున్నారు. దీంతో గాంధీల కుటుంబం.. ఫ్యామిలీ రాజ‌కీయాలను వ‌దులుకునే అవ‌కాశం లేద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

ఏం జ‌రిగింది?

తాజాగా జ‌రిగిన సార్వ‌త్రిక స‌మ‌రంలో కేర‌ళ‌లోని వ‌య‌నాడ్ పార్ల‌మెంటు స్థానం నుంచి సిట్టింగ్ (2019లో గెలిచారు) స్థానం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేశారు. అయితే.. ఇదేస‌మ‌యంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో రెండు ద‌శాబ్దాల‌కు పైగానే పోటీ చేస్తూ.. వ‌రుస విజ‌యా లు అందుకున్న రాహుల్ మాతృమూర్తి సోనియాగాంధీ ఈ సారి అనారోగ్య కార‌ణాల‌తో ఆ స్థానాన్ని వ‌దులుకున్నారు. ఆమె రాజ్య‌స‌భ‌కు వెళ్లిపోయారు. దీంతో అమ్మ ఖాళీ చేసిన రాయ్‌బ‌రేలి నియోజ‌క‌వ‌ర్గం నుంచి కూడా.. రాహుల్ గాంధీ పోటీ చేశారు. అటు వ‌య‌నాడ్.. ఇటు రాయ్‌బ‌రేలీల‌లో రెండు చోట్లా రాహుల్ గాంధీ విజ‌యం ద‌క్కించుకున్నారు.

దీంతో ఇప్పుడు ఏదో ఒక స్థానాన్ని విడిచి పెట్టుకోవాల్సి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో అమ్మ స్థానాన్ని రాహుల్ గాంధీ(రాయ్‌బ‌రేలి) త‌న వ‌ద్దే ఉంచుకున్నారు. ఇక‌, కేర‌ళ‌లోని వ‌య‌నాడ్‌ను మాత్రం వ‌దులుకునేందుకురెడీ అయ్యారు. ఈ క్రమంలో అన్న గెలిచిన స్థానాన్ని చెల్లెలు ప్రియాంక గాంధీ ద‌క్కించుకున్నారు. ఇక్క‌డ నుంచి ఆమె పోటీకి రెడీ అయ్యారు. ఈ మేర‌కు తాజాగా అఖిల భార‌త కాంగ్రెస్ క‌మిటీ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. అంటే.. అన్న ప్లేస్‌లో చెల్లి-అమ్మ ప్లేస్‌లో త‌న‌యుడు.. స్థిర‌ప‌డ‌నున్నార‌న్న మాట‌. మ‌రి వ‌య‌నాడ్ తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.