Begin typing your search above and press return to search.

తెలంగాణ ప్ర‌యోగం.. ఏపీలో ఫ‌లించేనా..!

వ‌చ్చే 2024 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీని బ‌లోపేతం చేయ‌డంతోపాటు.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం హోదా లోకి తీసుకురావాల‌నేది కాంగ్రెస్ పార్టీ వ్యూహం.

By:  Tupaki Desk   |   29 Dec 2023 6:00 PM IST
తెలంగాణ ప్ర‌యోగం.. ఏపీలో ఫ‌లించేనా..!
X

వ‌చ్చే 2024 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీని బ‌లోపేతం చేయ‌డంతోపాటు.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం హోదా లోకి తీసుకురావాల‌నేది కాంగ్రెస్ పార్టీ వ్యూహం. ఈ క్ర‌మంలోనే వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుమార్తె.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత ష‌ర్మిల‌ను పార్టీలో చేర్చుకుని.. వెంట‌నే తెలంగాణ‌లో చేసిన ప్ర‌యోగం మాదిరి గా.. ఏపీలోనూ ఆమెకు ప‌గ్గాలు అప్ప‌గించాల‌ని భావిస్తోంది. అంటే.. పొరుగు రాష్ట్రంలో చేసిన ప్ర‌యోగాన్ని డిటో ఇక్క‌డ దింపేయాల‌న్న‌ది కాంగ్రెస్ వ్యూహం.

అయితే.. అక్క‌డి ప్ర‌యోగం ఫ‌లించ‌డానికి ప్ర‌ధానంగా మూడు కార‌ణాలు ఉన్నాయి. ఒక‌టి.. కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ రేవంత్‌రెడ్డి ఫైర్ బ్రాండ్‌గా ముద్ర‌వేసుకున్నాడు. పైగా.. ఆయ‌న స్థానికుడు. సొంత‌గా ఎలాంటి పార్టీ కూడా పెట్టుకోలేదు. ఇది ప్ర‌జ‌ల‌కు న‌చ్చింది. రెండు.. అధికార పార్టీ వ‌రుస‌గా ప‌దేళ్లు రాజ‌కీయాలు చేసింది. అయినా.. క్షేత్ర‌స్థాయిలో అన్ని వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకోలేక పోయింది. ఈ రెండు కార‌ణాలు.. క‌లిసి వ‌చ్చాయి.

మ‌రోముఖ్య‌మైన కార‌ణం.. తెలంగాణ ఇచ్చామ‌ని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ విష‌యంలో ప్ర‌జ‌ల‌కు సింప‌తీ ఉంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌జ‌లు ఆ పార్టీకి ప‌ట్టం క‌ట్టారు. దీనికి రేవంత్ ఫేస్ ఉప‌యోగ‌ప‌డింది. క‌ట్ చేస్తే.. ఏపీలో ఈ మూడుకార‌ణాల‌ను ప‌రిశీలిస్తే.. ష‌ర్మిల వైఎస్ త‌న‌య అనే పేరున్నా.. ఆమె సొంత‌గా పార్టీ పెట్టుకున్నారు. కానీ, స‌క్సెస్ కాలేక పోయారు. పైగా.. తాను తెలంగాణ కోడలిన‌ని చెప్పుకొన్నారు. కాబ‌ట్టి.. ఏపీ నుంచి దూర‌మ‌య్యారు.

ఒకానొక సంద‌ర్భంలో ఏపీతో త‌న‌కు పనేంట‌ని కూడా ప్ర‌శ్నించారు. మ‌రో కార‌ణం.. జ‌గ‌న్ విష‌యంలో మెజారిటీ ప్ర‌జ‌ల‌కు, ముఖ్యంగా మ‌హిళ‌ల‌కు సానుభూతి ఉంది. ఆయ‌న వ‌ల్ల లబ్ధి పొందుతున్నామ‌నే వాద‌న వినిపిస్తున్నారు. ఈ త‌ర‌హా ల‌బ్ధి కాంగ్రెస్ చేకూరుస్తుందా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఇక‌, కాంగ్రెస్ కార‌ణంగా ఏపీ విడిపోయి.. ఇబ్బందులు ప‌డుతోంద‌నే వాద‌న ఇప్ప‌టికీ వినిపిస్తూనే ఉంది. ఈ నేప‌థ్యంలో ష‌ర్మిలతో ప్ర‌యోగాలు చేసినా ఫ‌లించ‌డం క‌ష్ట‌మ‌నే భావ‌న సర్వ‌త్రావినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.