Begin typing your search above and press return to search.

రాజ్యసభకు రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్!

వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ఏడు రాజ్యస‌భ స్థానాలు ఉండగా... అవన్నీ ప్రస్తుతం బీఆరెస్స్ పార్టీలోనే ఉన్నాయి

By:  Tupaki Desk   |   14 Feb 2024 11:24 AM GMT
రాజ్యసభకు రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్!
X

అధికారంలోకి వచ్చిందంటే ఆ పార్టీలో ఉండే సందడే వేరు! ఒక్కసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్చాత నామినేటెడ్ పోస్టుల సందడి నెలకొంటుంటుంది. ఈ క్రమంలో తాజాగా తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు రాజ్యసభ సభ్యుల సందడి మొదలైంది. ఇందులో భాగంగా ఇద్దరి పేర్లు తెరపైకి వచ్చాయి. అందులో ఒకరు రేణుకా చౌదరి, కాగా.. రెండో అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్!!

అవును... తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ ఎన్నికల సందడి నెలకొంది. ఇందులో భాగంగా... కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలు, ఉమ్మడి ఖ‌మ్మం జిల్లాకు చెందిన సీనియ‌ర్ నేత రేణుకా చౌద‌రితో పాటు కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజ‌న్ కుమార్ యాద‌వ్ కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ కి అవకాశం దక్కింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జ‌న‌ర‌ల్ సెక్రట‌రీ కేసీ వేణుగోపాల్ ప్రక‌ట‌న విడుద‌ల చేశారు. దీంతో... ఆయా నేతల అనుచరుల్లో పండగ వాతావరణం కనిపిస్తుంది.

వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ఏడు రాజ్యస‌భ స్థానాలు ఉండగా... అవన్నీ ప్రస్తుతం బీఆరెస్స్ పార్టీలోనే ఉన్నాయి. అయితే... తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డంతో.. ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా ఖాళీ అవుతున్న మూడు స్థానాల్లో రెండు స్థానాలు ఈ పార్టీకే ద‌క్కనున్నాయి! మరోపక్క బీఆరెస్స్ నుంచి వ‌ద్దిరాజు ర‌విచంద్ర, లింగ‌య్య యాద‌వ్‌, జోగిన‌ప‌ల్లి సంతోష్‌ ల స్థానాలు ఈ ఏడాది ఏప్రిల్‌ లో ఖాళీ అవుతున్నాయి.

రాజ్యసభకు సోనియా గాంధీ!:

మరోపక్క అందరూ ఊహించినట్లే కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజస్థాన్‌ నుంచి బరిలోకి దిగనున్నారు. ఇదే సమయంలో... మహారాష్ట్ర నుంచి చంద్రకాంత్‌ హండోరె, బిహార్‌ నుంచి అఖిలేశ్‌ ప్రసాద్‌ సింగ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి అభిషేక్‌ మను సింఘ్వీ పోటీ చేయనున్నారని తెలుస్తుంది. ఇదే సమయంలో... కర్ణాటకలో ఖాళీ అవుతున్న మూడు స్థానాల నుంచి అజయ్‌ మాకెన్‌, సయ్యద్‌ నాసిర్‌ హుస్సేన్‌, జి.సి.చంద్రశేఖర్‌.. మధ్యప్రదేశ్‌ నుంచి అశోక్‌ సింగ్ పోటీ చేయనున్నారు.

ఈ క్రమంలో జైపూర్ చేరుకున్న సోనియా గాంధీ... ఈరోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 15 (గురువారం) గడువు ఉంది.