ఆ రాష్ట్రంలో గట్టెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం!
ఛత్తీస్ గఢ్ లో భూపేష్ బఘేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గట్టెక్కింది. ఆ రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా చివరి రోజు ప్రతిపక్ష బీజేపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశం పెట్టింది.
By: Tupaki Desk | 22 July 2023 1:21 PM GMTఛత్తీస్ గఢ్ లో భూపేష్ బఘేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గట్టెక్కింది. ఆ రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా చివరి రోజు ప్రతిపక్ష బీజేపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశం పెట్టింది. దీనిపై ఏకంగా 13 గంటల పాటు ఛత్తీస్ గఢ్ అసెంబ్లీలో చర్చ జరిగింది. శనివారం తెల్లవారుజామున 1 గంటకు అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగ్గా కాంగ్రెస్ ప్రభుత్వం నెగ్గింది. దీంతో బీజేపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది.
మొత్తం 90 మంది సభ్యుల గల ఛత్తీస్ గఢ్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 71 మంది సభ్యులు ఉండగా, బీజేపీకి 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
వివిధ కుంభకోణాలు, ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చకపోవడం, శాంతిభద్రతలు క్షీణించడం తదితరాలపై ప్రతిపక్ష సభ్యులు కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ మాట్లాడుతూ.. ప్రతిపక్షాల ఆరోపణలో వాస్తవాలు లేవన్నారు. తమ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలతో 109 అంశాలతో బీజేపీ చార్జిషీట్ పేరిట పుస్తకం వేసిందని.. అయితే వాటిని నిరూపించలేకపోయిందని మండిపడ్డారు. వాస్తవాలు, ఆధారాలు లేకుండా తమ ప్రభుత్వంపై బురద చల్లడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
కాగా ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ తన ప్రసంగాన్ని ముగించడానికి ముందు బీజేపీ సభ్యులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ప్రతిపక్షాల ఆరోపణలకు సమాధానం ఇవ్వడంలో విఫలమైందని పేర్కొంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతేకాకుండా సభ నుంచి వాకౌట్ చేశారు.
కాగా ఎనఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి అపారమైన అధికారాలు ఇచ్చారని, ఇది దేశ ప్రయోజనాలను దెబ్బతీస్తోందని కేంద్రంపై సీఎం భూపేష్ బఘేల్ మండిపడ్డారు. జీఎస్టీ సంబంధిత కేసులను విచారించేందుకు ఈడీకి అధికారాలు ఇవ్వడాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని తెలిపారు.
కాగా అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా బఘేల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ 109 పాయింట్ల ‘ఛార్జిషీట్‘ సమర్పించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైందని బీజేపీ ఆరోపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దురాగతాలు బ్రిటిషర్లు చేసిన దానికంటే ఎక్కువగా ఉన్నాయని ఘాటు వ్యాఖ్యలు చేసింది.
అయితే అధికార పక్షం ఆరోపణలను కాంగ్రెస్ ప్రభుత్వం ఖండించింది. ఈ ఏడాది చివర్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండటంతో ఎన్నికల్లో లబ్ధి పొందడానికి బీజేపీ తమపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు.