రుణమాఫీ : భయం నీడలో కాంగ్రెస్!
‘కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే లక్ష కాదు రూ.2 లక్షల రుణాలను మాఫీచేస్తుంది.
By: Tupaki Desk | 16 April 2024 1:30 PM GMT‘కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే లక్ష కాదు రూ.2 లక్షల రుణాలను మాఫీచేస్తుంది. ఇప్పటి వరకు లక్ష రుణం తీసుకున్న వారు ఇంకో లక్ష తీసుకోండి. లక్ష రుణమాఫీ అయిన వారు రెండు లక్షలు రుణం తీసుకోండి. డిసెంబరు 9న అన్నీ మాఫీ చేస్తాం’ అని ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ పదే పదే ప్రకటించాడు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు దాటినా ఆ దిశగా చర్యలు లేవు. కనీసం సమీక్ష కూడా లేదు. ఆ ఊసెత్తడం కూడా మానేశారు.
అయితే హఠాత్తుగా నారాయణపేటలో జరిగిన బహిరంగ సభలో ఆగస్టు వరకు రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించాడు. రుణమాఫీకి రూ.33 వేల కోట్లు అవసరం పడతాయని అంచనా. ఆగస్ట్ నెల కాదు అయిదేళ్ల పాలనలో కూడా రుణమాఫీ సాధ్యమయ్యే పని కాదు అన్నది ఆర్థికవేత్తల వాదన. మరి హఠాత్తుగా రేవంత్ రుణమాఫీ ప్రస్తావన ఎందుకు తెచ్చాడన్న ప్రశ్న మొదలయింది.
గత ప్రభుత్వం ఎకరాకు ఏడాదికి రూ.10 వేలు రైతుబంధు ఇచ్చేది. కాంగ్రెస్ ఎకరాకు రూ.15 వేలు, కౌలు రైతులకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు అని ప్రకటించింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఫిర్యాదుతో విడుదలకు సిద్ధంగా ఉన్న రైతుబంధు నిధులను ఎన్నికల కమీషన్ నిలిపివేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు దాటినా రైతుబంధు నిధులు రైతుల ఖాతాలకు చేరలేదు. దీని మీద ముఖ్యమంత్రి స్థానంలో రేవంత్ పలు మార్లు ప్రకటన చేశాడు. మార్చి 31 వరకు అందరికీ ఇస్తాం అని చెప్పాడు. ఏప్రిల్ మూడో వారం వచ్చినా రైతుబంధు ఊసు లేదు. ఇక కళ్యాణలక్ష్మి పథకం కింద రూ.లక్ష నగదుతో పాటు తులం బంగారం అని ప్రకటించారు. ఆ విషయం గురించి కూడా ఏ కాంగ్రెస్ నేత నోరెత్తడం లేదు.
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఖరారుకు రాష్ట్ర పర్యటనకు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ క్షేత్ర స్థాయి నుండి నివేదిక తెప్పించుకున్నారని సమాచారం. రైతుబంధు ఇవ్వక పోవడం, రుణమాఫీ ఊసెత్తకపోవడం, కళ్యాణలక్ష్మిని పక్కన పెట్టడం, ఫించన్లు పెంచకపోవడం, సాగునీళ్లు ఇవ్వక పోవడం మీద రైతులు గుర్రుగా ఉన్నారన్న విషయాలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అధిష్టానం ఆదేశాల మేరకు రేవంత్ రైతులను శాంతింపజేసేందుకు రుణమాఫీ ప్రకటన చేసినట్లు తెలుస్తున్నది.
అయితే రుణమాఫీ విషయంలో కట్ ఆఫ్ తేది ప్రకటించకపోవడం, 34 వేల కోట్ల నిధులు సర్దుబాటు అయ్యే పరిస్థితి లేకపోవడంతో రేవంత్ ప్రకటన మీద నీలినీడలు కమ్ముకున్నాయి. మహిళలకు ఉచిత ప్రయాణం మినహా మరే పథకం విషయంలోనూ సరైన విధానం, పారదర్శకత లేకపోవడంతో లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూల వాతావరణం కనిపించడం లేదు. రేవంత్ ప్రకటన ఎంత వరకు పనిచేస్తుందో వేచిచూడాలి.