మరీ ఇంత తొందరేంది కేటీఆర్.. నెల కాలేదు అప్పుడే బుక్ లెట్?
తప్పుల మీద తప్పులు చేస్తున్నారు మాజీ మంత్రి కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి
By: Tupaki Desk | 4 Jan 2024 5:01 AM GMTతప్పుల మీద తప్పులు చేస్తున్నారు మాజీ మంత్రి కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి నెల రోజులు కూడా కాకుండానే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రశ్నలమీద ప్రశ్నలు సంధిస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది. పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపిన అనుభవం ఉన్నప్పటికి.. దాన్ని మర్చిపోయి.. పాలనా అంశాల్నిపక్కన పెట్టేసి రాజకీయంలో భాగంగా చేస్తున్న విమర్శలు ఆయన స్థాయికి తగ్గట్లుగా లేవన్న విమర్శ వినిపిస్తోంది. ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అంటూ తాజాగా ఒక బుక్ లెట్ ను ప్రచురించిన వైనం చూస్తే.. నెల రోజులు కూడా గడవకముందే అప్పుడే బుక్ లెట్ వేసుడా? అన్న సందేహం కలుగకమానదు.
అధికారమే లక్ష్యంగా.. ఆచరణ సాధ్యం కాని హామీల్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందన్న కేటీఆర్.. ఆ పార్టీ మొత్తం 420 హామీలు ఇచ్చిందంటూ 27 పేజీలతో కూడిన బుక్ లెట్ ను పబ్లిష్ చేసి.. విడుదల చేయటం ఆసక్తికరంగా మారింది. ఆరు హామీలు అంటూ రేవంత్ సర్కారు ఇప్పుడు చెబుతోందని.. కానీ ఆ పార్టీ 420 హామీల్ని ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. అయితే.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళ భారీ ఎత్తున హామీలు ఇచ్చినప్పటికీ.. తమ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఆరు గ్యారెంటీ హామీల్ని వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పటం తెలిసిందే.
ఆ విషయాన్ని వదిలేసిన కేటీఆర్.. అర్థం లేని లాజిక్కులతో '420' నెంబరును తనదైన శైలిలో చూపిస్తూ.. కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరును తప్పు పడుతున్నారు. గతంలో ఒక ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత తక్కువలో తక్కువ ఆర్నెల్ల వరకు విమర్శలకు దూరంగా ఉండేదని.. 2014లో తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ మొదటి ఆర్నెల్ల పాటు ఏమీ చేయలేదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అదేమంటే.. విభజన తర్వాత లెక్కలు చూస్తే ఆగమాగం అన్నట్లు ఉన్నాయని.. అందుకే అన్ని లెక్కల్ని తీయిస్తున్నామని.. వ్యవస్థను చక్కదిద్దే ప్రాసెస్ లో ఉన్నట్లుగా చెప్పేవారు.
ఆ రోజున అధికారపక్షంగా వ్యవహరించినప్పుడు చెప్పిన మాటలన్ని కాకున్నా.. కనీసం మూడు నెలలు కూడా సమయం ఇవ్వకుండా అప్పుడే హామీల పేరుతో కాంగ్రెస్ పార్టీ అబద్దాలు చెప్పినట్లుగా కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యల్ని తప్పు పడుతున్నారు. కాస్త సమయం ఇచ్చి మాట్లాడితే బాగుంటుందని.. అందుకు భిన్నంగా హడావుడిగా బుక్ లెట్ లు పబ్లిష్ చేసి.. ఘాటు విమర్శలు చేయటం ద్వారా రేవంత్ సర్కారు మీద సానుభూతి వ్యక్తమవుతుందన్న విషయాన్ని కేటీఆర్ గుర్తిస్తే మంచిదంటున్నారు.