ఆరు గ్యారెంటీల్లో రెండింటికి మహుర్తం ఫిక్సు
ఈ సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పుట్టినరోజును పురస్కరించుకొని డిసెంబరు 9 నుంచి తమ ఆరు గ్యారెంటీల్లో రెండింటిని అమలు చేసేందుకు సిద్ధమైన విషయాన్ని ప్రకటించారు.
By: Tupaki Desk | 8 Dec 2023 10:37 AM ISTమాట ఇచ్చామంటే.. చేతల్లో చేసి చూపిస్తాం. ఇది మా గ్యారెంటీ అంటూ భారీగా ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ తాను చెప్పినట్లే తెలంగాణలో ప్రభుత్వం కొలువు తీరిన రెండు రోజులకే హామీల అమలుకు ముహుర్తాన్ని డిసైడ్ చేశారు. ఆరు గ్యారెంటీల పేరుతో ఎన్నికల ప్రచారాన్ని భారీగా చేపట్టిన కాంగ్రెస్.. అందుకు తగ్గట్లే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మూడో రోజుకే.. కీలకమైన ఆరు గ్యారెంట్లీలో రెండింటిని అమలు చేసేందుకు రెడీ అయిపోయారు.
ముఖ్యమంత్రి.. మంత్రులు ప్రమాణస్వీకారం చేసిన తొలి రోజు సాయంత్రం కేబినెట్ భేటీని నిర్వహించిన అనంతరం.. మంత్రివర్గ నిర్ణయాన్ని మంత్రి శ్రీధర్ బాబు మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పుట్టినరోజును పురస్కరించుకొని డిసెంబరు 9 నుంచి తమ ఆరు గ్యారెంటీల్లో రెండింటిని అమలు చేసేందుకు సిద్ధమైన విషయాన్ని ప్రకటించారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. రాజీవ్ ఆరోగ్య శ్రీ ద్వారా వైద్య సాయాన్ని పది లక్షల రూపాయిలకు పెంచేందుకు వీలుగా తమ హామీల్ని నెరవేర్చనున్నట్లుగా ఆయన ప్రకటించారు. ఈ రెండు గ్యారెంటీలపై ఆయా శాఖల అధికారులతో శుక్రవారం ముఖ్యమంత్రి చర్చిస్తారని చెప్పటం ద్వారా.. డిసెంబరు 9 నుంచి అమలుకు ప్రభుత్వం సిద్ధమైనట్లుగా స్పష్టమవుతుంది.
ఆరు గ్యారెంటీ హామీల్లో రెండింటిని ప్రభుత్వం కొలువు తీరిన మూడో రోజునే అమలు చేయటం ద్వారా.. మిగిలిన హామీల్ని నెరవేర్చేందుకు కాస్తంత టైం తీసుకోవచ్చన్న మాట వినిపిస్తోంది. ఎందుకంటే ఆరు హామీల్లో ఈ రెండు హామీలు కాకుండా మిగిలిన నాలుగు హామీలు ఖర్చు కూడుకున్నవి. ఇందులో విద్యుత్ బిల్లులు 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తామన్న హామీ.. గ్యాస్ బండను రూ.500లకు ఇచ్చే అంశాలు కాస్తంత బరువుతో కూడుకున్నవి కాగా.. మిగిలిన రెండు మాత్రం మరింత నిధులు అవసరమని చెబుతున్నారు. అందుకే.. ఆరు హామీల్ని దశల వారీగా అమలు చేసేలా రేవంత్ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు.